- మొదటి విడతలో జనవరి 17 నుంచి 20 వరకు..
- రెండో విడతలో జనవరి 22 నుంచి 24 వరకు లెక్కింపు
- లెక్కింపులో పాల్గొనేందుకు ఇప్పటివరకు 3,800 మంది నుంచి అప్లికేషన్లు
- ఈ నెల 30తో ముగియనున్న అప్లికేషన్ల గడువు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో జంతు గణన చేపట్టేందుకు అటవీ శాఖ సర్వం సిద్ధం చేస్తోంది. ‘ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్ 2025-–26’ పేరుతో దేశంలో ఎన్ని పులులు ఉన్నాయో లెక్కిస్తోంది. దేశవ్యాప్తంగా నాలుగేండ్లకోసారి ఈ గణన నిర్వహిస్తుండగా.. తెలంగాణలో ఈ ప్రక్రియను చేపట్టేందుకు ఔత్సాహికులను నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నెల 30 వరకు గడువు ఇవ్వగా.. జంతుగణనలో పాల్గొనేందుకు ఇప్పటివరకు 3,800 మంది అప్లై చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు కూడా ఈ జంతుగణనలో భాగస్వామ్యం కావచ్చని ఆఫీసర్లు ప్రకటించారు.
రెండు విడతల్లో...
ఈ సారి రెండు విడతల్లో పులుల గణన చేపట్టేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఇందుకు అనుగుణంగా అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, గతంలో పనిచేసిన వలంటీర్లకు ఈ గణనలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎంపికైన వలంటీర్లకు ముందుగా ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యధికులు విద్యార్థులు, యువకులు, పర్యావరణవేత్తలే ఉన్నారు. ఒక్కో వలంటీర్‌కు రెండేసి ఆప్షన్లు ఇవ్వగా... ఇందులో సుమారు 65 శాతానికిపైగా వలంటీర్లు అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లకు వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఎవరు ఏ ప్రాంతానికి వెళ్లి జంతుగణన చేపట్టాలనేది అటవీ శాఖ ఆఫీసర్లు నిర్ణయించనున్నారు.
మొత్తం ఆరు రోజుల పాటు..
పులుల గణన మొదటి విడత జనవరి 17న ప్రారంభమై 20వ తేదీ వరకు కొనసాగనుంది. అలాగే రెండో విడత గణనను జనవరి 22న ప్రారంభించి 24 వరకు పూర్తి చేయనున్నారు. మొత్తం ఆరురోజుల పాటు జంతు గణన కొనసాగించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవికాలంలోగా లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. బీట్ ఆఫీసర్ పర్యవేక్షణలో వలంటీర్లు ఉదయం సమయంలో అడవికి వెళ్లి జంతువుల సంఖ్యను లెక్కించనున్నారు. వలంటీర్లు ప్రతి రోజూ అటవీ సిబ్బందితో కలిసి 10 నుంచి 15 కిలోమీటర్ల మేర అటవీలో ‘ట్రాన్సెక్ట్ అండ్ ట్రయల్ వాక్’ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో పులులు, చిరుత పులులతో పాటు వాటి ఆహారమైన జింకలు, కనుజులు, సాంబర్ల వంటి వంటి శాకాహార జంతువుల జాడలను నమోదు చేయాలి. మాంసాహార, శాఖాహార జంతువుల వివరాలను వేర్వేరుగా నమోదు చేయనున్నారు.
అత్యాధునిక టెక్నాలజీతో...
ఈ సారి పులుల గణన ప్రక్రియను శాస్త్రీయంగా, మరింత పారదర్శకంగా నిర్వహించేలా అటవీశాఖ ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తోంది. ప్రత్యేకంగా రూపొందించిన ‘మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ -ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకోలాజికల్ స్టేటస్’(ఎం-ఎస్‌టీఆర్‌ఎల్‌పీఈఎస్) అనే మొబైల్ యాప్‌ను వినియోగించనున్నారు. గతంలో మాదిరిగా కాగితాలపై కాకుండా, వలంటీర్లు, సిబ్బంది తమ పరిశీలనను నేరుగా ఈ యాప్‌లో నమోదు చేయనున్నారు. పులుల పాదముద్రలు, రెట్టలు, గోర్ల గుర్తులు, ప్రత్యక్షంగా కనిపించిన జంతువుల వివరాలను జియో- ట్యాగింగ్‌తో సహా యాప్‌లో పొందుపరచనున్నారు. దీనివల్ల మానవ తప్పిదాలకు ఆస్కారం ఉండదని, కచ్చితమైన సమాచారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ యాప్ వినియోగంపై ఇప్పటికే జిల్లా స్థాయి అటవీ అధికారులకు డెహ్రాడూన్‌లోని వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. వీరు స్థానిక వలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
