హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్.. రద్దు చేసిన సంస్థ ప్రతినిధులు..!

హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్.. రద్దు చేసిన సంస్థ ప్రతినిధులు..!

ఫార్ములా ఈ కార్ రేసింగ్ గేమ్స్ చూడడం అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. డిఫరెంట్ స్టైల్స్ లో మోడల్ కార్లు, వివిధ రకాల కలర్స్ తో ఉన్న కార్లు.. రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తుంటుంటే.. ఆ సన్నివేశాలను చూడ్డం కోసం చాలామంది ఎగబడుతారు. 2023, ఫిబ్రవరిలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన విషయం తెలిసిందే. 

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా.... హుస్సేన్ సాగర్ తీరంలో రేసింగ్ కార్లు రయ్ రయ్ మంటూ దూసుకుపోయాయి. మన దేశంలో మొదటిసారి జరిగిన అంతర్జాతీయ ఫార్ములా ఈ రేసింగ్ ఛాంపియన్ షిప్ చూసేందుకు పలువురు క్రీడా, సినీ, వ్యాపార ప్రముఖులు హైదరాబాద్ నగరానికి క్యూ కట్టారు.

2024, ఫిబ్రవరిలోనూ ఫార్ములా E రేసింగ్‌ పోటీలను మరోసారి హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్వాహకులు ప్లాన్ చేశారు. అయితే.. తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 2024 ఫిబ్రవరి 10న షెడ్యూల్ చేసిన రేసింగ్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఫిబ్రవరిలో తలపెట్టిన రేస్.. రద్దు చేశామని ఫార్ములా ఈ ప్రతినిధులే చెప్పారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఫార్ములా E సంస్థ ఈ ప్రిక్స్‌, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్లతో కలిసి 2023, అక్టోబర్ 30న రేసింగ్‌కు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నారు. భారీ రేసింగ్‌కు హైదరాబాద్ నగరం కూడా ఒక హోస్ట్ సిటీగా ఉంది. 

ఫార్ములా ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ బృందం డిసెంబర్ నెల ప్రారంభంలో తెలంగాణలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంతో సమావేశమైంది. అప్పటి నుంచి చర్చలు కొనసాగాయి. ఈ భారీ ఈవెంట్‌కు మరికొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. అయినా ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎటువంటి అప్డేట్ రాలేదు. దీంతో ఈవెంట్ నిర్వహణపై ఈ రేసింగ్ ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా ఫార్ములా- ఈ రేస్ రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించారు ఫార్ములా-ఈ ప్రతినిధులు.