ముగ్గువోసి మూలకు పెట్టిన్రు..కేటీఆర్ వేసిన శిలాఫలకాలే 28

ముగ్గువోసి మూలకు పెట్టిన్రు..కేటీఆర్  వేసిన శిలాఫలకాలే 28
  •     మున్సిపల్ ​ఎన్నికలప్పుడు 400 శిలాఫలకాలేసిన లీడర్లు
  •     పనులపై గ్రేటర్​ ఆఫీసర్లతో కలిసి రివ్యూల మీద రివ్యూలు 
  •     ఆరు నెలల్లో సిటీని మార్చేస్తామని హామీలు 
  •     ఓట్లేసి నెలలైనా మొదలవని పనులు.. కనవడని నేతలు
  •     ఇప్పుడు ఫోకసంతా ఉప ఎన్నిక జరగబోయే హుజూరాబాద్​ మీదనే

హనుమకొండ, వెలుగు: గ్రేటర్​ వరంగల్​ మున్సిపల్​ ఎన్నికలప్పుడు 6 నెలల్లో నగరాన్ని మార్చేస్తామన్న లీడర్లు పత్తా లేకుండా పోయారు. ఆ పనులు.. ఈ పనులంటూ రూ. కోట్ల విలువైన పనుల కోసం దాదాపు 400 శిలాఫలకాలేసి నెలలు గడుస్తున్నా పట్టించుకుంటలేరు. కొన్ని పనులైతే టెండర్​ దశ కూడా దాటలేదు. ఇంకొన్నింటికి భూములనే అలాట్​ చేయలేదు. మంత్రి కేటీఆర్​ మొదలుపెట్టిన పనులే మస్తు పెండింగ్​లో ఉన్నాయి. ఉప ఎన్నిక జరగబోయే హుజూరాబాద్​ నియోజకవర్గంలోనూ ఇప్పుడు అచ్చం ఇలాంటి సీనే రిపీట్​అవుతోంది. వరంగల్​ మాదిరే వందల కోట్ల విలువైన పనులకు మంత్రులు, ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు చేస్తున్నారు. రకరకాల హామీలిస్తున్నారు. జనాలేమో.. వరంగల్​లో పనులు మొదలుపెట్టి వదిలేసినట్టే హుజూరాబాద్​లోనూ చేస్తరేమోనని అనుకుంటున్నరు. కొద్దిపాటి వానకే మునిగిపోయే కాలనీలు,  అస్తవ్యస్తమైన నాలాలు, ఉన్నాయా లేవా అనేలా మారిన రోడ్లు, అరకొరగా డ్రింకింగ్​ వాటర్​ వ్యవస్థ, కళ తప్పిన పార్కులు.. ఇదీ కార్పొరేషన్​ ఎన్నికల ముందు గ్రేటర్​ వరంగల్​​లో వాడవాడలా కనిపించిన సీన్​. 

అరకొర మౌలిక వసతులు, అనేక సమస్యలతో గత టీఆర్​ఎస్​ పాలకవర్గం మీద జనాలు పీకల్లోతు కోపంతో ఉన్నారని ఎన్నికల ముందు అధికార పార్టీ చేయించిన వివిధ సర్వేల్లో తేలింది. అప్పటికే జరిగిన జీహెచ్​ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీకి ఆశించిన రిజల్ట్స్​ రాలేదు. అంతకుముందు దుబ్బాక ఎన్నికల్లోనూ రూలింగ్ ​పార్టీ ఓడింది. దీంతో గ్రేటర్​ వరంగల్​ మేయర్​ పీఠం దక్కించుకోకపోతే పార్టీకి నష్టం తప్పదనుకున్న హైకమాండ్​ కొత్త ఎత్తులు వేసింది. గ్రేటర్ వరంగల్​లో పబ్లిక్​ను ఆకట్టుకునే పనులతో ప్లాన్​ తయారు చేయించింది. ఏప్రిల్​15న ఎన్నికల నోటిఫికేషన్ ​రాగా అంతకు కొద్ది నెలల ముందు నుంచే అప్పటి మేయర్​ గుండా ప్రకాశ్​రావు సమక్షంలో వందలాది పనులకు తీర్మానాలు జరిగాయి. రూలింగ్​ పార్టీ ఎమ్మెల్యేలు, లోకల్​ కార్పొరేటర్లు కలిసి వాడవాడలా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, లైటింగ్ సిస్టం.. ఇలా దాదాపు 400 కుపైగా పనులకు శిలాఫలకాలు వేయించారు. 

6 నెలల్లో పూర్తి చేస్తమని..

ఎన్నికల ముందు శంకుస్థాపన చేసిన పనులన్నింటినీ కంప్లీట్​ చేసేందుకు 6 నెలల టైం కావాలని కేటీఆర్​ను  మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు కోరారు. ‘ఇది వరంగలా..!?’ అని ఆశ్చర్యపడేలా డెవలప్​ చేస్తామని వరంగల్​ ఫోర్ట్​ రోడ్డులోని గ్రౌండ్​లో జరిగిన సభలో హామీ ఇచ్చారు. కానీ కొన్ని పనులు టెండర్​ దశ కూడా దాటకపోగా.. రంగశాయిపేట ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​, కాజీపేట డబుల్​ బెడ్​ రూం ఇండ్లకు ఇంకా ల్యాండ్​ అలాట్​మెంట్​ కూడా కాలేదు. 

ఎన్నికలయ్యాక లైట్ తీసుకున్నరు

ఎన్నికలప్పుడు శంకుస్థాపనలు చేసి.. గ్రేటర్​ ఆఫీసర్లతో రివ్యూల మీద రివ్యూలు పెట్టి లీడర్లు హడావుడి చేశారు.  ఎన్నికల ప్రచారంలో ఇవే పనులను చెప్పుకొని ఓట్లడిగారు. దీంతో జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో గ్రేటర్​ లోని 66 డివిజన్లకు 48 డివిజన్లలో టీఆర్​ఎస్​ గెలిచింది. కానీ మంత్రి కేటీఆర్​ శిలాఫలకాలు వేసిన డెవలప్​ మెంట్​ పనుల్లో చాలా వరకు పూర్తికాలేదు. వాటిపై రివ్యూ చేసిన దాఖలాలూ లేవు. దేశాయిపేట జర్నలిస్ట్​ కాలనీ, దూపకుంట డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లు, శివనగర్​లో స్ట్రోమ్​ వాటర్​ డ్రైన్​ కండక్ట్, వడ్డేపల్లి చెరువుకట్ట డెవలప్​ మెంట్​ పనులు స్టార్టయినా ఫండ్స్​ లేక మెల్లగా నడుస్తున్నాయి.  రూ. 10 కోట్ల బడ్జెట్​ దాటిన పనులకు సీవోటీ (కమిషన్​ ఆఫ్​ టెండర్స్​) అప్రూవల్​ అవసరం. సమ్మయ్య నగర్​ వరద కాల్వ, రీటెయినింగ్​ వాల్స్​, స్మార్ట్​ రోడ్లు కలిసి దాదాపు రూ.234  కోట్ల విలువైన 10 పనులు సర్కారు దగ్గరే పెండింగ్​లో ఉన్నాయి. ఇంకో 11 పనులు టెండర్ ప్రాసెస్​లోనే ఆగాయి. నెలలు గడుస్తున్నా మోడల్​ మార్కెట్, సరిగమప పార్కు ఇంకా జనాలకు అందుబాటులోకి రాలేదు. వరంగల్​ ఫోర్ట్​ రోడ్డులోని ప్లే గ్రౌండ్​ ను వాకర్స్​ కోసం కేటాయిస్తామన్నా అమలు కాలేదు. ఎయిర్​ పోర్టు, మెట్రో నియో ప్రాజెక్టులూ అలాగే ఉన్నాయి. వరంగల్​లో మంత్రి కేటీఆర్​ టూర్​కు ముందు ఎమ్మెల్యేలు శిలాఫలకాలేసిన పనుల్లోనూ 50 శాతానికి పైగా మొదలుపెట్టలేదు. స్టార్ట్​ చేసిన పనుల్లో సగం వరకు పూర్తి కాలేదు. 

కేటీఆర్​ వేసిన శిలాఫలకాలే 28

వరంగల్​ కార్పొరేషన్​ ఎలక్షన్​ నోటిఫికేషన్​కు మూడ్రోజుల ముందు ఏప్రిల్​12న మున్సిపల్​ మంత్రి​ కేటీఆర్ ​వరంగల్​ వచ్చారు. ఉదయం  నుంచి రాత్రి వరకు వివిధ డెవలప్​ మెంట్​ పనులకు కొబ్బరి కాయలు కొట్టారు. రూ. 65 కోట్లతో భద్రకాళి బండ్​ డెవలప్​ మెంట్,  రూ. 54 కోట్లతో సమ్మయ్యనగర్ వరద కాల్వ డెవలప్​మెంట్​, రూ.45 కోట్లతో ఆర్​ఎస్​ నగర్​ వరద కాల్వ, రూ. 38.35 కోట్లతో లేబర్​ కాలనీ నుంచి సీకేఎం వరకు స్మార్ట్​ రోడ్డు, రూ.36 కోట్లతో రాంపూర్​లో బయో మైనింగ్,  రూ. 24 కోట్లతో వరంగల్​ ఇంటిగ్రేటెడ్​ వెజ్​, నాన్​ వెజ్​ మార్కెట్, రూ.  26 కోట్లతో శివనగర్​ నుంచి మైసయ్యనగర్ రోడ్డు, రూ. 22 కోట్లతో  సమ్మయ్యనగర్​ వద్ద నాలాల అడ్డుగోడల నిర్మాణం, రూ.15.89 కోట్లతో ఫోర్ట్​ రోడ్డు నుంచి నాయుడు బంక్​ వరకు రోడ్డు, రూ.8.5 కోట్లతో నయీంనగర్​ నాలాపై బ్రిడ్జి.. ఇలా రూ.600 కోట్ల విలువైన పనులకు 28 శిలాఫలకాలు వేశారు.

హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఇట్లేనా?

జీడబ్ల్యూఎంసీ ఎన్నికలప్పుడు వందల కోట్ల పనులకు శిలాఫలకాలేసిన లీడర్లు ఎన్నికల్లో గెలిచాక కాలనీలను కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు హుజూరాబాద్​లోనూ ఇదే ట్రెండ్​ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కోట్ల విలువైన పనులు శాంక్షన్​ చేస్తున్నారు. శంకుస్థాపనలతో హడావుడి చేస్తున్నారు. హుజూరాబాద్​లోనూ పరిస్థితి వరంగల్​లానే కనిపిస్తుండటంతో అక్కడి పనులపై జనాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఓట్లేసినంక పత్తా లేరు

ఎన్నికలకు ముందొచ్చి రోడ్లు, డ్రైనేజీలు వేస్తమన్నరు.  శంకుస్థాపన లు చేశారు. మా ఏరియాను డెవలప్​ చేస్తారనుకొని టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను  గెలిపించినం. తర్వాత మమ్మల్ని పట్టించుకున్నోళ్లు లేరు. లీడర్లు ఇప్పుడు పత్తా లేకుండపోయిన్రు. 
- బోగి ఆండాలమ్మ, వినాయక నగర్​ 

పనులు స్టార్ట్​కాలె

మా ఏరియాలో డ్రైనేజీలు లేక మురుగునీరు ఇండ్ల మధ్య ఆగి దోమలు పెరుగుతున్నయ్​. గ్రేటర్​ వరంగల్​ ఎలక్షన్స్​ టైమ్​లో మా కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం కోసం శిలాఫలకం వేసిన్రు. ఇప్పటికి 7 నెలలైనా పనులు స్టార్ట్​ చేయలేదు. 
- మోర సంధ్య, శ్రీ సాయినగర్, మడికొండ