- మేడారం నుంచి వెనుదిరిగిన భక్తులు
- జనం నుంచి వనంలోకి సమ్మక్క, సారలమ్మ
- పగిడిద్దరాజు, గోవిందరాజునూ తరలించిన పూజారులు
- చివరిరోజు తల్లులను దర్శించుకున్న10 లక్షల మంది భక్తులు
మేడారం మహా జాతర ముగిసింది. వనం నుంచి జనంలోకి వచ్చిన సమ్మక్క, సారలమ్మ.. భక్తులకు దీవెనలిచ్చి తిరిగి వనం బాట పట్టారు. నాలుగు రోజుల జాతరలో అమ్మవార్లను లక్షల మంది దర్శించు కున్నారు. అనంతరం ‘తల్లీ వెళ్లొస్తం.. రెండేండ్లకు మళ్లొస్తం’ అంటూ ఇంటిబాట పట్టారు. జనవరి 28న సారలమ్మ రాకతో మొదలైన జాతర.. శనివారం తల్లుల వనప్రవేశంతో ప్రశాంతంగా ముగిసింది. గిరిజన పూజారులు తల్లులకు ప్రత్యేక పూజలు చేసి సమ్మక్కను చిలకల గుట్టకు.. సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్లారు.
వరంగల్/ములుగు/తాడ్వాయి, వెలుగు : వనం నుంచి జనంలోకి వచ్చిన సమ్మక్క, సారలమ్మ తల్లులను నాలుగు రోజులు లక్షల మంది భక్తులు దర్శించుకోగా తిరిగి వనానికి చేరారు. శనివారంతో మేడారం మహాజాతర ముగిసింది. గద్దెలపై నుంచి అమ్మవార్లను తరలిస్తుండగా దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించారు. ‘తల్లీ వెళ్లొస్తం.. రెండేండ్లకు మళ్లొస్తం’ అంటూ ఇంటిబాట పట్టారు. జనవరి 28న సారలమ్మ రాకతో మొదలైన మహాజాతర.. శనివారం తల్లుల వనప్రవేశంతో ప్రశాంతంగా ముగిసింది. సమ్మక్క ప్రధాన పూజారులు కొక్కెర కృష్ణయ్య, సిద్దబోయిన మునీందర్, సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సమ్మక్కను చిలకల గుట్టకు.. సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్లారు.
చివరిరోజు పోటెత్తిన భక్తులు
చివరిరోజు కూడా భక్తులు పోటెత్తారు. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, గురువారం సమ్మక్క తల్లిని పూజారులు గద్దెలపైకి చేర్చారు. శనివారం సైతం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు కాలినడకన గద్దెల వద్దకు చేరారు. చివరి రోజు సుమారు 10 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు.
కాలినడకన అడవిబాట..
వన దేవతలు సమ్మక్క, సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైనుంచి తీసుకుని పూజారులు అడవి బాట పట్టారు. సమ్మక్క తల్లిని చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు, గోవిందరాజును కొండాయికి కాలినడక ద్వారానే
తరలించారు.
దర్శించుకున్న ప్రముఖులు
హైకోర్టు జడ్జి మాధవీదేవి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్, ఐజీ తరుణ్ జోషి దంపతులు, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ దంపతులు, అరుణోదయ సాంస్కృతిక రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క, పలువురు దర్శించుకొని మొక్కులు చెల్లించారు.
నయా మేడారాన్ని చూసి సంబురం
మేడారం జాతర అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.251 కోట్లు కేటాయించింది. తెల్లని భారీ గ్రానైట్ శిలలపై సమ్మక్క, సారలమ్మ చరిత్రతో పాటు 250 కోయల ఇంటి పేర్లు, కుటుంబాల గొట్టుగోత్రాలు, జీవనశైలిని చిత్రాల రూపంలో చెక్కించి నిర్మించడంతో గద్దెల ప్రాంతానికి సరికొత్త శోభ వచ్చింది. జాతరకు వెళ్లే నాలుగు లేన్ల రోడ్లు, జంక్షన్లను అభివృద్ధి చేసియడంతో పాటు అన్ని వసతులు కల్పించింది. దీంతో జాతరకు తరలివచ్చిన భక్తులు నయా మేడారాన్ని చూసి సంబురపడ్డారు. స్వాగత తోరణం, గద్దెలు, జంక్షన్లలో శిల్పాల వద్ద ఫొటోలు, సెల్ఫీలు దిగారు.
మా ఇంట్లో పెండ్లి.. తల్లులారా దీవించండి!
ఏటూరు నాగారం,వెలుగు : మేడారం మహాజాతరలో శనివారం వినూత్న సంప్రదాయ పద్ధతి కనిపించింది. హైదరాబాద్ జిల్లెలగూడ పరిధి లలితానగర్ లోని వర్షిణి రెసిడెన్సీకి చెందిన ఎర్రం యశోద, సాగర్ రాజు దంపతుల కొడుకు సాయికృష్ణ రాజు పెండ్లి ఈనెల 21న జరగనుంది. ఈ నేపథ్యంలో జాతరకు వచ్చి సమ్మక్క, సారక్కను దర్శించుకుని గద్దెల వద్ద దంపతులు తమ కొడుకు పెండ్లి పత్రికను ఉంచారు. “ తల్లులారా.. మా ఇంట్లో పెండ్లి ఉంది. మా కొడుకు, కోడలు జీవితాంతం బాగుండాలని దీవించండి”అని కోరుకుంటూ దంపతులు మొక్కారు.
పోలీసన్నలు.. థ్యాంక్స్
ఏటూరునాగారం, వెలుగు: మేడారం జాతర ఆఖరి రోజున శనివారం అమ్మవార్ల గద్దెల వద్ద భక్తుల రద్దీ నెలకొంది. ఓ మహిళ నెలల వయసున్న చిన్నారితో మొక్కులు చెల్లించడానికి వచ్చింది. భక్తుల తాకిడితో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురవడంతో తల్లి గుండె తల్లడిల్లింది. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించారు. ఓ కానిస్టేబుల్గ్రిల్ పైకి ఎక్కి చిన్నారిని చేతితో పైకి తీసుకుని సేవ్ చేశారు. దీంతో అక్కడున్న పలువురు భక్తులు పోలీసన్నలు.. థ్యాంక్స్ అంటూ మెచ్చుకున్నారు.
