యుద్ధం వెంటనే ఆపాలె : ప్రధాని నరేంద్ర మోడీ

యుద్ధం వెంటనే ఆపాలె : ప్రధాని నరేంద్ర మోడీ

రష్యాకు జీ20 దేశాల స్పష్టీకరణ

బాలి (ఇండోనేషియా) : ఉక్రెయిన్​పై యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపాలని జీ20 దేశాలు స్పష్టం చేశాయి. ఇది యుద్ధాల కాలం కాదన్న ప్రధాని నరేంద్ర మోడీ మాటలను ప్రస్తావించాయి. ఉక్రెయిన్–రష్యా సంక్షోభం వల్ల ప్రపంచ ఎకానమీపై, ఆహార, ఇంధన భద్రతపై తీవ్ర ప్రభావం పడుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశాయి. ఇండోనేషియాలోని బాలిలో రెండు రోజుల 17వ జీ20 సదస్సు బుధవారం ముగిసింది. సదస్సు ముగింపు సందర్భంగా జీ20 దేశాలు ‘బాలి డిక్లరేషన్’ విడుదల చేశాయి. ‘‘ఉక్రెయిన్ యుద్ధానికి రష్యా ముగింపు పలకాలి.

వైరాలు పక్కనపెట్టి, శాంతిని నెలకొల్పాలి. సంక్షోభం కొనసాగుతున్న కొద్దీ ప్రపంచంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇది యుద్ధాల కాలం కాదని, చర్చలు, దౌత్య విధానాలతోనే వివాదాన్ని పరిష్కరించుకోవాలన్న ప్రధాని మోడీ మాటలను గుర్తు చేసుకోవాలి” అని డిక్లరేషన్ లో జీ20 దేశాల అధినేతలు పిలుపునిచ్చారు. గత సెప్టెంబర్ లో ఉజ్బెకిస్తాన్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జరిగిన భేటీ సందర్భంగా మోడీ చేసిన కామెంట్లను డిక్లరేషన్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అణుయుద్ధానికి కూడా వెనకాడబోమంటూ పుతిన్ హెచ్చరించడాన్ని కూడా ఖండించారు. ఉక్రెయిన్​పై దాడి అన్యాయం, చట్ట విరుద్ధం, దురాక్రమణే అని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, యూఎన్ చార్టర్ కు, అంతర్జాతీయ మానవతా చట్టానికి కట్టుబడి ఉండాలన్నారు.

యుద్ధ సమయంలో పట్టుబడిన పౌరులు, సైనికుల విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. అలాగే, ప్రపంచ ఎకానమీని బలోపేతం చేసేందుకు సమష్టిగా గట్టి చర్యలు చేపట్టాలని జీ20 దేశాలు నిర్ణయించాయి. అయితే, ఉక్రెయిన్–రష్యా సంక్షోభంపై జీ20 సదస్సులో అమెరికా, దాని మిత్రదేశాలు రష్యాకు వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పగా.. కొన్ని దేశాలు ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థపై ఎఫెక్ట్ పడుతోందని మాత్రమే ఆందోళన వ్యక్తం చేశాయి. డిక్లరేషన్​పై అన్ని దేశాలు ఏకాభిప్రాయానికి రావడం వెనక ఇండియా కీలక పాత్ర పోషించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాగా, బుధవారం జీ20 సదస్సు ముగిసిన అనంతరం ప్రధాని మోడీ తిరిగి ఇండియాకు బయలుదేరారు.  

డిజిటల్ మార్పు.. ఇదే మా మంత్రం: మోడీ 

వచ్చే పదేండ్లలో ప్రతి ఒక్కరికీ డిజిటల్, కొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తేవడమే ఇండియా లక్ష్యమని, ఇందులో జీ20 దేశాల నేతలను ఒక్కతాటిపైకి తెస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బుధవారం జీ20 సదస్సు ముగింపు సందర్భంగా ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడొడొ నుంచి ప్రధాని మోడీ జీ20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ‘అభివృద్ధి కోసం డేటా’ అన్నదే ఇండియా జీ20 ప్రెసిడెన్సీకి ఓవరాల్ థీమ్ అని ప్రకటించారు. కాగా, జీ20 అధ్యక్ష బాధ్యతలను ఇండియా అధికారికంగా డిసెంబర్ 1 నుంచి చేపట్టనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే 18వ జీ20 సదస్సుకు నేతృత్వం వహించనుంది.