ఓపెన్​ కాని మూసీ డ్యామ్​ గేట్లు.. మెయింటెనెన్స్​ లేక గేట్లు జామ్​

ఓపెన్​ కాని మూసీ డ్యామ్​ గేట్లు.. మెయింటెనెన్స్​ లేక గేట్లు జామ్​
  •  నెల 15న 6 రెగ్యులేటరీ గేట్లు ఓపెన్​కాక ముంచుకొచ్చిన ముప్పు
  • రత్నపురం వద్ద గండి పెట్టడంతో తప్పిన ప్రమాదం
  • గతేడాది గేట్​ కొట్టుకుపోయినా కళ్లు తెరవని ఆఫీసర్లు
  • ఐదేండ్లుగా మెయింటెనెన్స్​కు నిధులు విడుదల చేయని సర్కారు

సూర్యాపేట, వెలుగుప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మూసీ ప్రాజెక్టు పరిస్థితి ప్రమాదకరంగా మారింది. గ్రేటర్​ హైదరాబాద్, ​ దాని చుట్టుపక్కల జిల్లాల్లో ఇటీవల కుండపోత వర్షాల వల్ల మూసీ నదికి భారీ వరదలు రావడంతో ప్రాజెక్టు నిర్వహణలోని లోపాలు బయటపడ్డాయి. 4 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జీ కెపాసిటీ గల ఈ ప్రాజెక్టు, కనీసం 2.20  లక్షల క్యూసెక్కుల వరదను కూడా రిలీజ్​ చేయలేకపోవడంతో రత్నపురం వద్ద గండి పెట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో మూసీ ప్రాజెక్టు భవిష్యత్​పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2015 నుంచి  ఇప్పటివరకు మెయింటెనెన్స్​ కోసం పైసా నిధులు ఇవ్వకపోవడం, 35 మంది స్టాఫ్ కు గాను కేవలం నలుగురు మాత్రమే  ఉండడంతో రిపేర్లు చేయలేక ప్రాజెక్టుకు ఈ దుస్థితి వచ్చిందని ఇంజినీర్లు చెబుతున్నారు.

ఈసారి రికార్డు స్థాయిలో వరద..

ఈ ప్రాంత సాగు, తాగునీటి అవసరాల కోసం మూసీ ప్రాజెక్టును 1965లో నిర్మించారు. గడిచిన 57 ఏండ్లలో ఈ స్థాయి వరదలు కేవలం రెండుసార్లు మాత్రమే వచ్చాయి. 1983లో 2.28 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్​ రాగా,  ఈ నెల 15న 2.50లక్షల క్యూసెక్కులతో రెండో రికార్డు స్థాయి వరద నమోదైంది. ఈ సీజన్​లో జూన్ నుంచి ఇప్పటివరకు 38 టీఎంసీల నీటిని దిగువకు వదిలితే ఆ ఒక్కరోజే ఏకంగా16 టీఎంసీల నీటిని కిందికి విడుదల చేశారు. ‌ప్రాజెక్టు చరిత్రలో ఇది కూడా ఓ రికార్డు అని ప్రాజెక్టు ఇంజినీర్లు చెబుతున్నారు. 2005, 2016, 2019 సంవత్సారాల్లో దాదాపు లక్ష క్యూసెక్కుల వరద నమోదుకాగా, ఈసారి అంతకు రెండింతల ఫ్లడ్​ రావడం, గేట్లు తెరుచుకోకపోవడంతో ప్రాజెక్టును కాపాడుకునేందుకు రత్నపురం వద్ద గండిపెట్టాల్సి వచ్చింది. దీంతో వందలాది ఎకరాల పంట పొలాలు నీటమునిగి రైతులు నష్టపోయారు.

రెగ్యులేటరీ గేట్లు ఓపెన్​కావట్లే.. క్లోజ్​ కావట్లే..

మూసీ ప్రాజెక్టును12 క్రస్టు గేట్లు, 8 రెగ్యులేటరీ గేట్లు, 10 సిల్ట్‌గేట్లతో నిర్మించారు. దీని డిశ్చార్జ్ కెపాసిటీ 4లక్షల క్యూసెక్కులు కాగా, ప్రస్తుతం 2లక్షల క్యూసెక్కులను సైతం విడవలేని పరిస్థితి ఉంది. కీలకమైన రెగ్యులేటరీ గేట్లు సరిగ్గా పనిచేయకపోవడమే ఇందుకు కారణమని ఇంజినీర్లు చెబుతున్నారు. మొన్న మూసీకి వచ్చిన భారీ వరదలకు11 క్రస్ట్ గేట్లు ఎత్తిన ఆఫీసర్లు, 2 రెగ్యులేటరీ గేట్లను మాత్రమే తెరవడగలిగారు. దీంతో గరిష్ఠంగా 1.86లక్షల క్యూసెక్కుల ఫ్లడ్​ను మాత్రమే రిలీజ్​ చేయలేకపోయారు. 1, 3,4, 5, 6,8 నంబర్​ గేట్లను ఎంత ప్రయత్నించినా తెరవలేకపోయారు. కేవలం 2,7 నంబర్​ రెగ్యులేటరీ గేట్లు మాత్రమే ఓపెన్​ చేసినా ఇప్పటికీ క్లోజ్​ చేయలేకపోతున్నారు. ఫలితంగా వాటి బేస్​ దెబ్బతింటోందనీ, బలవంతంగా క్లోజ్​ చేసినా మళ్లీ తెరిచే పరిస్థితి ఉండకపోవచ్చని చెబుతున్నారు. వాస్తవానికి  టీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015లో పాత గేట్ల స్థానంలో రూ.18కోట్లతో కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. కానీ క్వాలిటీ లేకపోవడంతో 2019 అక్టోబర్ లో 5వ నెంబర్ రెగ్యులేటరీ గేట్ కొట్టుకుపోగా కొత్తది బిగించారు. కానీ ఇంకా ట్రయల్స్ దశలోనే ఉండడంతోఓపెన్​ చేయలేకపోయారు. ఇక ఈ ఏడాది ఆగస్టులో 9వ నెంబర్ క్రస్ట్ గేట్ కౌంటర్ వెయిట్ కొట్టుకపోగా దానిని కూడా తెరవలేని పరిస్థితి వచ్చింది. ఇలా గేట్లు కొట్టుకుపోతున్నా కనీసం ఈసారైనా అలర్ట్​ కాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రాజెక్టులో ఇసుకమేట, బురదను తొలగించేందుకు ఏర్పాటు చేసిన సిల్ట్‌ గేట్లు కూడా గతంలో కొట్టుకుపోగా, సిమెంట్​తో శాశ్వతంగా క్లోజ్​ చేశారు. కనీసం అవి ఉన్నా ఇలాంటి టైంలో పనికి వచ్చేవని ఇంజినీర్లు అంటున్నారు.

మెయింటెనెన్స్​కు ఫండ్స్​లేవు.. స్టాఫ్​ లేరు..

2015లో కొత్త గేట్లు ఏర్పాటుచేసిన సర్కారు, అప్పటి నుంచి మెయింటెనెన్స్​కు పైసా కూడా విడుదల చేయలేదని ప్రాజెక్టు ఇంజినీర్లు అంటున్నారు. చిన్న చిన్న రిపేర్లకు తామే జేబులోంచి పెట్టుకుంటున్నామని చెబుతున్నారు. అదే టైంలో మూసీ ప్రాజెక్ట్ నిర్వహణకు 35 మంది స్టాఫ్ అవసరం ఉండగా కేవలం నలుగురితోనే నడుపుతున్నారు. టెక్నికల్, మెకానికల్ ఎక్స్​పర్ట్స్​ను కూడా ప్రభుత్వం నియమించడం లేదు. దీనితో పాటు గేట్ ఆపరేటర్స్, ఫిట్టర్స్, ఎలక్ట్రీషియన్స్ కావాలని ప్రపోజల్స్ పెట్టి ఏళ్లు గడుస్తున్నా సర్కారు నుంచి స్పందన లేకుండా పోయింది. అందువల్లే మూసీ మెయింటెనెన్స్ పట్టుతప్పి​, ప్రాజెక్టుకే ముప్పు ఏర్పడిందని ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు.

ఐదేళ్లుగా ఫండ్స్ రావట్లే

గత ఐదేండ్లుగా ప్రాజెక్ట్ మెయింటనెన్స్​కు ఎలాంటి ఫండ్స్​ రావట్లేదు. దీంతో రిపేర్లు చేయలేకపోతున్నాం. అలాగే స్టాఫ్​ కొరత తీవ్రంగా ఉంది. ప్రధానంగా టెక్నికల్​ స్టాఫ్​ లేక ప్రాబ్లమ్​ అవుతోంది. మెయింటనెన్స్​ కోసం ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పెట్టినం. ఫండ్స్ రాగానే పనులు చేస్తం.

–నవికాంత్ రెడ్డి, మూసీ ప్రాజెక్టు డీ‌ఈ