
న్యూఢిల్లీ: పదకొండేండ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో ఆమె కుటుంబ సభ్యులు, ప్రయాణికులు కలిసి రైల్వే ఉద్యోగిని కొట్టి చంపేశారు. బిహార్‌లోని బరౌని నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలులో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బిహార్‌లోని సివాన్‌కు చెందిన ఒక కుటుంబం బుధవారం బరౌని నుంచి ఢిల్లీకి వెళ్లే హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. తల్లికి, బాలికకు సీటు కన్ఫర్మ్ కాకపోవడంతో రాత్రి 11.30 గంటల టైమ్‌లో గ్రూప్ డీ రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్ ఆ కుటుంబంలోని 11 ఏండ్ల బాలికను తన సీటుపై కూర్చోబెట్టాడు.
కొంతసేపటి తర్వాత బాలిక తల్లి వాష్‌రూమ్‌కు వెళ్లగా.. కుమార్ బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు. మహిళ వాష్‌రూమ్ నుంచి రాగానే బాలిక ఆమె వద్దకు పరుగెత్తుకెళ్లి ఏడవడం ప్రారంభించింది. తల్లిని వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పింది. ఆ తర్వాత రైలులోని ఎం1 కోచ్‌లోని తన భర్త, అత్త, ఇతర ప్రయాణికులకు బాలిక తల్లి విషయం తెలిపింది. కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు, ప్రయాణికులు కుమార్‌ను పట్టుకుని గంటన్నర సేపు తీవ్రంగా కొట్టారు.
కాన్పూర్ సెంట్రల్ చేరుకున్న తర్వాత గురువారం ఉదయం 5 గంటలకు రైల్వే పోలీసులు వచ్చి తీవ్రంగా గాయపడిన ప్రశాంత్ ను ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. అయితే ప్రశాంత్ అలాంటి వాడు కాదని కుట్ర ప్రకారమే వారు అతన్ని కొట్టి చంపారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.