తెలంగాణలో గుడి లేని దేవుడు.. ఏటా పెరుగుతున్నాడు!

తెలంగాణలో గుడి లేని దేవుడు.. ఏటా పెరుగుతున్నాడు!

దశావతారాల్లో వరాహావతారం ఒకటి. జల ప్రళయంలో చిక్కుకున్న భూమాతను శ్రీ మహావిష్ణువు అవతారమైన వరాహ స్వామి రక్షించినట్లు పురాణాలు చెబుతాయి. ఆ స్వామే పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ లో ‘ఆదివరాహ స్వామి’గా పూజలు అందుకుంటున్నాడు.

ఈ స్వామివారి ఆలయాల్లో ఒకటి తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఉంటే, మరొకటి కమాన్ పూర్ లో ఉంది. ఒకసారి అలకబూని లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది. ఆమెని వెతుక్కుంటూ శ్రీవారు వచ్చినప్పుడు.. తిరుమలలో వరాహస్వామే ఆయనకు ఆశ్రయమిచ్చాడట. దీనికి ప్రతిగా తన కొండకు వచ్చే భక్తులు మొదట వరాహస్వామినే దర్శించుకునేలా శ్రీవారు.. వరాహ స్వామికి వరమిచ్చాడని చెబుతారు. తిరుమల వరాహస్వామి తర్వాత అంత ప్రసిద్ధి చెందింది కమాన్ పూర్ ఆదివరాహస్వామి ఆలయం. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా స్వామివారు భక్తుల పూజలు అందుకుంటున్నాడు.

ఏటా పెరుగుతున్న విగ్రహం

కొన్నేళ్ల క్రితం చిన్న ఎలుక ఆకారంలో వెలిసిన ఆది వరాహస్వామి విగ్రహం.. ఏటా పెరుగుతుండటం విశేషం. ప్రస్తుతం విగ్రహం దాదాపు మూడు అడుగులు ఉంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే? స్వామివారి రాతి విగ్రహంపై వెంట్రుకలు కనిపించడం. ఈ నేలపై స్వామివారు నడిచి వచ్చినట్టుగా పాదాల గుర్తులు కనిస్తాయి. వీటిని సాక్షాత్తు ఆ దేవదేవుడి పాదముద్రికలుగా భక్తులు కొలుస్తారు. నిత్య పూజలు, అర్చనలు జరిగే ఈ క్షేత్రానికి భక్తులు భారీగా వస్తుంటారు.

స్థల పురాణం

సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం ఒక మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేస్తుండగా.. స్వామి వారు కలలో కనిపించి వరం కోరుకోమన్నాడట. ఇందుకు సంతోషించిన మహర్షి.. స్వామిని ఇక్కడే వెలిసి ప్రజలను రక్షించాలని వేడుకున్నాడట. నిస్వార్థమైన ఆయన కోరికను మన్నిం చి స్వామివారు ఇక్కడ వెలిశాడని ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఇక్కడి ఆదివరాహస్వామికి ‘వరాలస్వామి’గా పేరుంది. స్వామి సన్నిధి లో ఏదైనా కోరిక కోరుకుంటే తప్పక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. తమ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ.

స్వామివారు వద్దని చెప్పడంతో..

ఇక్కడ వరాహస్వామికి ఆలయం కనిపించదు. చెట్లు, బండ రాళ్ల మధ్యే స్వామి వారు కొలువై ఉంటాడు. ‘కొన్నేళ్ల క్రితం ఒక భక్తుడు స్వామివారికి గుడి కట్టాలనుకున్నాడు. అయితే, స్వామివారు కలలో కనిపించి.. ‘తనకు ఆలయం వద్దు’ అని చెప్పడంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అంతేకాదు గుడి నిర్మాణానికి జమ చేసిన సొమ్మును భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఉపయోగించాడ’ని పూజారులు చెబుతుంటారు.

ఎలా వెళ్లాలి ?

ఆది వరాహ స్వామి వారి క్షేత్రం పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్, జూలపల్లి గ్రామాల శివారులో ఉంది. హైదరాబాద్ నుంచి పెద్దపల్లి వెళ్లి అక్కడి నుంచి ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. మంథని వెళ్లే బస్సులన్నీ ఈ క్షేత్రం మీదుగా వెళ్తా యి. పెద్దపల్లి, గోదావరిఖని రూట్ లో కమాన్ పూర్ మీదుగా బస్సులు, ఆటోలు కూడా తిరుగుతాయి.

– వెలుగు, లైఫ్‌ ప్రతినిధి