ఐదేండ్లైనా.. హామీలు తీర్చట్లే!

ఐదేండ్లైనా..  హామీలు తీర్చట్లే!
  • కలెక్టరేట్ నిర్వాసితులను పట్టించుకోని అధికారులు 
  • బోర్లు, చెట్లకు పరిహారం ఇస్తలే.. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తలే
  • కలెక్టరేట్ వద్ద పలుమార్లు ఆందోళనకు దిగిన బాధితులు
  • స్పందన రాకపోవడంతో రిలే నిరాహార దీక్షలకు సిద్ధం

సిద్దిపేట, వెలుగు: కలెక్టరేట్‌ నిర్మాణానికి భూములిచ్చిన రైతులను సర్కారు పట్టించుకోవడం లేదు.  భూసేకరణ చేసిన సమయంలో భూమితో పాటు బోరుబావులు, చెట్లకు పరిహారం, ప్లాట్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఐదేండ్లైనా పూర్తిస్థాయిలో నెరవేర్చడం లేదు. కేవలం భూమికి పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంది.  ప్లాట్ల కాగితాలు ఇచ్చినా ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. దీంతో బాధితులు పలుమార్లు కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు దిగారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో రిలే నిరాహార దీక్షలకు సిద్ధమవుతున్నారు. 

243 ఎకరాలు.. 60 మంది రైతులు

ప్రభుత్వం 2017లో సిద్దిపేట కలెక్టరేట్ నిర్మాణం కోసం కొండపాక మండలం దుద్దెడ పరిధిలోని  663,143 సర్వే నెంబర్లలోని 60 మందికి చెందిన 242.38 ఎకరాల భూమిని సేకరించింది. అప్పటి కలెక్టర్‌‌ వెంకట్రామారెడ్డి ఎకరాకు రూ.8 లక్షలతో పాటు బోరు బావికి రూ.1.50 లక్షలు, చెట్లకు విలువ కట్టి పరిహారం ఇస్తామని మాటిచ్చారు. అలాగే  ఎకరా కోల్పోయిన వారికి 200 గజాలు, 20 గుంటలు కోల్పోయిన వారికి 100  గజాల ఇంటి స్థలం ఇచ్చి, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధిత రైతులు భూమిలిచ్చేందుకు ఒప్పుకున్నారు. కానీ, భూమికి మాత్రమే పరిహారం ఇచ్చి.. 15 బోరు బావులు, మూడు వేల చెట్లకుపైగా పరిహారాన్ని పెండింగ్‌లో పెట్టారు. కాగా, ప్రస్తుతం బోరు బావుల్లో మోటార్లు బిగించి వెటర్నరీ కాలేజీ భవన నిర్మాణానికి వాడుకుంటుండటం గమనార్హం.

 ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయట్లేదు..

అధికారులు కలెక్టరేట్ వెనుక భాగంలో ప్లాట్లు చేసి నిర్వాసితులకు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినా..  ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేయలేదు.  రిజిస్ట్రేషన్ చార్జీలు నిర్వాసితులే పెట్టుకోవాలని చెబుతుండడంతో ఈ ప్రాసెస్‌ పెండింగ్‌లో పడింది. ఫ్రీగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని ఇటీవల ఆందోళన నిర్వహించగా.. కొండపాక తహసీల్దార్‌‌ వారితో చర్చలు జరిపారు.  స్వల్ప మొత్తంలో చార్జీలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించగా..  ఇలా చేస్తే ప్లాట్లపై పూర్తి హక్కులు లభించవని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో 59 జీవో ప్రకారం దరఖాస్తు చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పారు. కానీ, దీని ప్రకారం   లక్షల రూపాయల ఫీజుగా చెల్లించాల్సి ఉండడంతో బాధితులు ముందుకు రాలేదు.

నిర్వాసితులపై పోలీసుల నిఘా

కలెక్టరేట్ కోసం భూములిచ్చిన నిర్వాసితులు ఆందోళనలు చేస్తుండడంతో పోలీసులు వీరిపై నిఘా పెట్టారు.  ఇప్పటికే  కలెక్టరేట్ భవనంపైకి ఎక్కి, కలెక్టరేట్‌ ముందు పలుమార్లు నిరసన తెలిపారు. ఎన్నో సార్లు ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నారు. ఆశ్వత్థామ అనే నిర్వాసితుడు ప్రజావాణిలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.  దీంతో పోలీసులు అతన్ని ప్రజావాణికి హాజరుకాకుండా ముందస్తుగా అదుపులోకి తీసుకోవడమే కాకుండా ప్రతి రోజూ పీఎస్‌కు రావాలని హుకుం జారీ చేశారు.  పోలీసుల తీరుతో విసుగుచెందిన నిర్వాసితులు కలెక్టరేట్ ఎదుటే రిలే నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. 

హామీని నిలబెట్టుకోవాలె

 కలెక్టరేట్ నిర్మాణం కోసం భూములు తీసుకున్న సమయంలో కలెక్టర్‌‌ ఇచ్చిన  హామీ నిలబెట్టుకోవాలి.  నాకు రూ.6 లక్షల పరిహారం తప్ప ఏమీ రాలేదు.  సేకరించిన భూమితో పాటు బోరు బావులు , చెట్లకు పరిహారం, 200 గజాల ఇంటి స్థలాన్ని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి.  అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకుంటలేరు. 

పల్లె కనకయ్య, దుద్దెడ        
   
పోలీసులు ఇబ్బందులు పెడుతున్నరు

మాకు  న్యాయంగా రావాల్సిన పరిహారం అడిగితే అధికారులు పోలీసులతో ఇబ్బందులు పెట్టిస్తున్నరు.  చెట్లు, బోరు బావుల పరిహారం, ఇంటి ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం నాలుగేండ్లుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న.  విసుగొచ్చి ఆత్మహత్యాయత్నం కూడా చేసిన. అయినా పట్టించుకుంటలేదు.   మా భూముల్లో కట్టిన కలెక్టరేట్‌లో న్యాయం కోసం అడుక్కోవాల్సి వస్తుంది.  

పిల్లి అశ్వత్థామ,  దుద్దెడ