కాళేశ్వరం ముంపు గ్రామాలను సర్కార్ పట్టించుకుంటలే

కాళేశ్వరం ముంపు గ్రామాలను సర్కార్ పట్టించుకుంటలే

పెద్దపల్లి, వెలుగు: 'పెద్దపల్లి జిల్లా మంథని మండలం మల్లారం గ్రామానికి చెందిన సుంకరి బాపుకు 4 ఎకరాల భూమి ఉంది. ప్రతీయేడు కాళేశ్వరం బ్యాక్​ వాటర్​తో అది మునిగిపోతుంది. ప్రాజెక్టు నిర్మాణం ముందు సర్కార్ 420  ఎకరాలు తీసుకుంటామని చెప్పింది. కానీ, 20 ఎకరాలు మాత్రమే తీసుకున్నది. మిగతా 400 ఎకరాలను సర్కార్ పట్టించుకోవడం లేదు. బాపుకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నరు. అందులో శివసాయి డిప్లొమా పూర్తి చేశాడు. ప్రేంసాయి డిగ్రీ చదువుతున్నాడు.  కానీ, ఆర్థిక పరిస్థితి బాగా లేక చదువులు కొనసాగే పరిస్థితి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మూలంగా పంటలు మునిగిపోతుండడంతో ఉపాధి పూర్తిగా కోల్పోయారు. నాలుగేండ్లుగా పంటలు లేక ఆర్థికంగా చితికిపోయారు. ఉపాధి కోసం కుటుంబంతో సహా ఒక సంవత్సరం కరీంనగర్ కు వలసపోయిండ్రు. అక్కడ కూడా ఉపాధి దొరకక తిరిగి సొంత గ్రామం మల్లారం వచ్చారు.  అందరు కలిసి ఉపాధి హామీ పనులకు పోతున్నరు. కొడుకులను పొలాల్లో కైకిలికి కూడా తీసుకెళ్తున్నడు బాపు.  ప్రభుత్వం తమ భూములను తీసుకొని నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నాడు.

పంటలు ఏసుడే బంద్​ చేసిండ్రు..

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించారు. వీటి నిర్మాణంలో లోకల్​ స్ట్రీమ్స్​, క్యాచ్​మెంటు ఏరియాల నుంచి వచ్చే వరద నీటి సామర్థ్యాన్ని అధికారులు గుర్తించకుండ, గోదావరి వరద నీటినే పరిగణలోకి తీసుకున్నారు.  ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత వరద ఉధృతి 
పెరిగినప్పుడు బ్యారేజీల గేట్లు ఓపెన్​ చేయడంతో బ్యాక్ వాటర్​ సమస్య ఏర్పడి చుట్టూ ఉన్న వందలాది ఎకరాల భూముల్లో పంటలు నీట మునుగుతున్నాయి. వరద తీవ్రత పెరిగినప్పుడు కాళేశ్వరం బ్యారేజీల కింద ఉన్న మంథని, రామగుండం, వెల్గటూరు వ్యవసాయ పంటలు అన్నీ మునిగిపోతున్నాయి. దీంతో రైతులు పంటలు వేయడం మానేశారు.

పరిహారం ఒక్కసారే ఇచ్చి ఆపేసిండ్రు....

గడిచిన మూడేండ్లుగా సాలుకు రెండు పంటల చొప్పున ఆరు పంటలు వేసిన రైతుల చేతికి ఒక్క గింజ కూడా రాలేదు. ప్రతీ పంట నీటి పాలైంది. మొదటి సంవత్సరం పంట నీట మునిగిన తర్వాత అధికారులు వచ్చి నష్టాన్ని లెక్కించి ఎకరానికి రూ. 19వేలు ఇచ్చిండ్రు. ఆ తర్వాత నష్టపోయిన ఐదు పంటలకు రూపాయి కూడా ఇయ్యలేదు. ప్రతీ యేడు పంట నీట మునుగుతుందని అధికారులే పంట వేయవద్దని సూచించారు. క్రాప్​ హాలీడే కింద నష్టపరిహారం ఇస్తామని చెప్పారని రైతులు చెప్తున్నారు. ఇప్పటి వరకు నీట మునిగిన పంటకు, క్రాప్​హాలిడే కాంపన్సేషన్​ ఇవ్వలేదంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కాక ముందు రూ. 2 లక్షలతో బోర్లు వేయించుకొని ప్రతీ యేడు రెండు పంటలు పండించే వాళ్లమని, నీటి తాకిడికి బోర్లు, పైప్​లైన్లు కూడా మునిగిపోయాయని, అన్ని విధాలుగా నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం ముంపు భూములను తీసుకొని ఎకరానికి రూ. 20 లక్షలు ఇవ్వాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. మంథని మండల పరిధిలో పలు గ్రామాల పరిధిలో  దాదాపు 4000 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయన్నారు.  పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్​పుట్​ సబ్సిడీ కింద పరిహారం ఇయ్యాలే, కానీ, టీఆర్​ఎస్​  ప్రభుత్వం అధికారం వచ్చిన మొదటి ఏడాది తప్ప ఇప్పటి వరకు రైతులకు ఇన్​పుట్​ సబ్సిడీ కింద ఒక్క రూపాయి ఇయ్యలేదు. గత మూడేండ్లుగా  కాళేశ్వరం బ్యారేజీల కింద ఉన్న పంటలు దాదాపు 20 వేల ఎకరాలు నీటిపాలైనాయి. పంటలు దెబ్బతిన్నాయని ఆఫీసర్లు సర్వేలు నివహించి రిపోర్టులు పంపినా సర్కార్​ ఎలాంటి పరిహారం 
రైతులకు అందిస్తలేదు.

సర్వే నివేదిక అందలేదంటున్నరు...

కాళేశ్వరం బ్యాక్​ వాటర్​లో మునిగిపోయిన పంటలకు నష్టపరిహారంతో పాటు రెండేండ్లుగా క్రాప్​ హాలిడే పరిహారం కూడా ఇవ్వాలని కాళేశ్వరం బ్యారేజీల ముంపు గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేస్తున్నరు. ప్రభుత్వం భూములను తీసుకొని ఎకరానికి రూ.20 లక్షలు ఇవ్వాలని కోరుతున్నరు. ఇప్పటికే రెవెన్యూ, అగ్రికల్చర్​ ఆఫీస్లర్లు మునిగిన పంటలను పరిశీలించి సర్వే నిర్వహించారు. పరిహారం కోసం ఉన్నతాధికారులను అడిగితే సర్వే నివేదిక అందలేదని, అందిన వెంటనే ఇస్తామంటున్నారని రైతులు చెప్తున్నారు. అలాగే, భూసేకరణ కోసం అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి అందజేశారు. అయినా, భూమిని హ్యాండోవర్​ చేసుకోవడానికి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తన్నది అటున్నారు.


సర్కార్​ మా భూములు తీసుకోవాలే

నాకు 4 ఎకరాలు ఉంది. మూడేండ్లు ఆరుసార్లు పంట వేసిన. పంట చేతికచ్చే టైంలనే పంటలన్ని వరద ముంపుకు గురైనయి. మొదటి యేడు ప్రభుత్వం ఒక్కసారి పంట నష్ట పరిహారం ఇచ్చింది. ఆ తర్వాత రూపాయి కూడా ఇయ్యలేదు. కనీసం క్రాప్​ హాలీడే పరిహారం ఇయ్యలే. అందుకే భూములు తీసుకొని పరిహారం ఇయ్యాలని డిమాండ్​ చేస్తున్నం.
- సుంకరి బాపు, మల్లారం, పెద్దపల్లి జిల్లా

ఎకరానికి రూ.20 లక్షలు ఇయ్యాలే

మూడేండ్లుగా పంటలు వేసి నష్టపోతున్నాం. కాళేశ్వరం నిర్మాణంలో అధికారులు చేసిన తప్పునకు మేము బలి అవుతున్నాం. పంటలు వేసినా ప్రతీ యేడు ముంపునకు గురవుతున్నయి.  మేము వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నం. మూడేండ్లుగా అప్పుల పాలైనం. ప్రభుత్వం మాకు జరిగిన నష్టాని కి పరిహారం ఇయ్యాలే. అలాగే మా భూములను తీసుకొని ఎకరానికి రూ. 20 లక్షలు ఇయ్యాలే.

- సుంకరి మహేశ్​, మల్లారం,  పెద్దపల్లి జిల్లా


ముంపు బాధితులకు న్యాయం చేయాలే..

కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం బ్యారేజీ కింద మంథని మండలంలోని చాలా గ్రామాల భూములు ముంపునకు గురవుతున్నాయి.  వాటిని ప్రభుత్వమే తీసుకొని రైతులకు పరిహారమివ్వాలి. ప్రతీ యేటా మునుగుతుండడంతో రైతులు భూములను పడావు పెడుతున్నరు. వెంటనే ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలే.

- చందుపట్ల సునీల్​రెడ్డి, బీజేపీ లీడర్​, మంథని