యాదగిరిగుట్టలో కార్తీక సందడి

యాదగిరిగుట్టలో కార్తీక సందడి
  • నవంబర్ 20 వరకు కొనసాగనున్న కార్తీక పూజలు
  • గుట్టలో ఆరు, పాతగుట్టలో నాలుగు బ్యాచుల్లో వ్రతాల నిర్వహణ

యాదగిరిగుట్ట, వెలుగు: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బుధవారం నుంచి కార్తీక మాసం సందడి షురూ అయింది. యాదగిరిగుట్ట ఆలయంలో బుధవారం మొదలైన కార్తీక మాస పూజలు నవంబర్ 22 వరకు కొనసాగనున్నాయి. ఇక బుధవారం సత్యనారాయణస్వామి వ్రతాలు, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకునే భక్తులతో వ్రత మండపాలు, కార్తీక దీపారాధన ప్రదేశాలు కిటకిటలాడాయి.

కొండ కింద వ్రత మండపంలో భక్తులు సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించి సత్యదేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు.  కార్తీక దీపాలు వెలిగించుకునేందుకు వీలుగా కొండపైన మూడు చోట్ల ‘కార్తీక దీపారాధన’  పేరుతో ప్రత్యేక మండపాలు ఏర్పాట్లు చేశారు. కొండపైన ప్రధానాలయం ఎదుట, శివాలయం ఎదుట, విష్ణుపుష్కరిణి వద్ద ‘కార్తీక దీపారాధన’ పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన మండపాల్లో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి కార్తీకమాస మొక్కులు తీర్చుకున్నారు.

గుట్టలో రోజుకు ఆరు, పాతగుట్టలో నాలుగు బ్యాచుల్లో వ్రతాల నిర్వహణ

యాదగిరిగుట్ట క్షేత్రం హరిహరులకు నిలయం కావడంతో.. కార్తీకమాసంలో రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో కంటే యాదగిరిగుట్ట టెంపుల్ లోనే భక్తులు అధిక సంఖ్యలో సత్యనారాయణస్వామి వ్రతాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడికి అనుగుణంగా.. కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని రెండు హాళ్లలో వ్రతాలు నిర్వహించుకోవడానికి సదుపాయాలు కల్పించి ప్రతిరోజు ఆరు బ్యాచుల్లో వ్రతాలు నిర్వహిస్తున్నారు.

 రూ.1000 వ్రత టికెట్ పై భక్తులకు పూజా సామాగ్రి, పాత్ర సామాగ్రితో పాటు స్వామివారి ప్రతిమ, కల్యాణం శెల్లా, కనుము అందిస్తున్నారు. బుధవారం నుంచి నవంబర్ 22 వరకు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు గంటలకు ఒక బ్యాచ్ చొప్పున మొత్తం ఆరు బ్యాచుల్లో వ్రతాలు నిర్వహించనున్నారు. 

ఇక యాదగిరిగుట్ట టెంపుల్ కు అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బుధవారం నుండి కార్తీక మాసం ముగిసే వరకు రోజుకు నాలుగు బ్యాచుల్లో వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు.. రెండు గంటలకు ఒక బ్యాచ్ చొప్పున నాలుగు బ్యాచుల్లో సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తున్నారు. కాగా బుధవారం యాదగిరిగుట్టలో 174, పాతగుట్టలో 10 వ్రతాలు జరిగినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.