యాదాద్రి జిల్లాలో మూడు వేల మంది ఇతర రాష్ట్రాల వ్యక్తులు.. పోలీసుల సెర్చ్ ఆపరేషన్

యాదాద్రి జిల్లాలో మూడు వేల మంది ఇతర రాష్ట్రాల వ్యక్తులు.. పోలీసుల సెర్చ్ ఆపరేషన్
  •  పశ్చిమ బెంగాల్, ఓడిశా, బిహార్ రాష్ట్రాలకు చెందిన వారి వివరాలు చెక్ చేసిన పోలీసులు 
  • గురువారం ఆధార్ కార్డు తీసుకుని పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆదేశం 

యాదాద్రి, వెలుగు: భువనగిరిలో బుధవారం (అక్టోబర్ 22) రాత్రి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి గురించి పోలీసులు సెర్చ్ నిర్వహించారు.  కొన్ని నెలల నుంచి పశ్చిమ బెంగాల్​, ఒడిశా, బిహార్​ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో యాదాద్రి జిల్లాకు వస్తున్నారు. జిల్లా కేంద్రమైన భువనగిరిలో ఎక్కువగా నివాసం ఉంటున్నారు. ఇలా వచ్చిన వారికి స్థానికంగా ఉంటున్న కొందరు సహకరిస్తూ ఇండ్లు అద్దెకు ఇప్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు మూడు వేల మంది భువనగిరిలో నివాసం ఉంటున్నారని పోలీసులు భావిస్తున్నారు. 

ఇలా వచ్చిన వారు ఎక్కువగా బిల్డింగ్​ నిర్మాణ పనులు చేస్తున్నారు. రోజూ ఉదయాన్నే భువనగిరిలోని జగదేవ్​పూర్​ చౌరస్తాలో నిలబడి రోజు పనికి తీసుకెళ్లే వారి కోసం ఎదురుచూస్తుంటారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒకరు రూ. 12 వేలు ఇచ్చి.. ఫోన్​ పే చేయించుకున్నాడు. తీరా చూస్తే అవి దొంగనోట్లుగా తేలాయి. దీంతో  నోట్లు ఇచ్చిన వ్యక్తిని రిమాండ్​ చేశారు. ఇటీవల పశ్చిమబెంగాల్​కు చెందిన మరో వ్యక్తి చైన్​ స్నాచింగ్​ చేసి పోలీసులకు దొరికిపోయాడు. దీంతో భువనగిరిలో ఉంటున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను గుర్తించే ప్రక్రియను పోలీసులు చేపట్టారు. 

పహడీనగర్​లో చెకింగ్​ 

బుధవారం రాత్రి భువనగిరి టౌన్​ సీఐ రమేశ్​ ఆధ్వర్యంలో  పహడీనగర్​లో నివాసం ఉంటున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారి వద్దకు పోలీసులు వెళ్లారు. ఒక్కొక్కరిని పిలిచి వారి పేర్లను రాసుకోవడంతో పాటు ఏ రాష్ట్రం నుంచి వచ్చావు..  ఏ పని చేస్తున్నావు. నీకు ఇల్లు అద్దెకు ఇప్పించిన వ్యక్తి ఎవరూ.. అని ప్రశ్నిస్తూ అడ్రస్​ ప్రూఫ్​ కోసం ఆధార్​ కార్డులు పరిశీలించారు. వారి ఫొటోలను కెమెరాలో తీసుకున్నారు. ఆధార్​ నెంబర్లు సేకరించారు. 

ఈ విధంగా 40 మందిని ఆరా తీశారు.  వీరితో పాటు ఇతర రాష్ట్రాల నంచి వచ్చిన వారందరూ గురువారం పోలీస్​ స్టేషన్​కు ఆధార్​కార్డులను తీసుకొని రావాలని సూచించారు.  పోలీస్​ స్టేషన్‌కు రాని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఎవరు చెబితే ఇల్లు అద్దెకు ఇచ్చారంటూ ఇండ్ల ఓనర్లను పోలీసులు ప్రశ్నించారు. దీంతో అద్దెకు ఇచ్చిన వారు కంగారుపడిపోతున్నారు. 

ఆధార్‌‌ అసలా.. నకిలీయా గుర్తిస్తాం.. సీఐ రమేశ్ 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ఆధార్​ కార్డులను పరిశీలిస్తామని భువనగిరి టౌన్​ సీఐ రమేశ్​ తెలిపారు. ఆధార్​ కార్డు చూడగానే.. వదిలిపెట్టకుండా ఆన్​లైన్​లో నెంబర్​ను పరిశీలించి అది అసలైన కార్డా..లేక డూప్లికేటా.. గుర్తిస్తామని చెప్పారు. కార్డు డూప్లికేట్​ అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.