హుజూర్‌‌నగర్‌లో మెగా జాబ్ మేళా సక్సెస్ చేయాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్‌‌నగర్‌లో మెగా జాబ్ మేళా సక్సెస్ చేయాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • సూర్యాపేట కలెక్టరేట్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష 
  • ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల యాజమాన్యాలతో భేటీ
  •  ఇప్పటికే 250పైగా కంపెనీలు, 12 వేలకు పైగా నిరుద్యోగుల రిజిస్ట్రేషన్ 

సూర్యాపేట, వెలుగు: నిరుద్యోగ సమస్య పెను ప్రమాదంగా మారిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావానికి మూల కారణం నిరుద్యోగమేనని గుర్తుచేశారు.  బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల అధిపతులతో సమావేశమయ్యారు. అనంతరం ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పాలనాధికారులు, గ్రామ పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందన్నారు. అక్టోబర్ 25న సూర్యాపేట జిల్లా హుజూర్‌‌నగర్‌లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 250 సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయన్నారు.  12,480 మంది నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. 

గ్రామీణ యువత పట్టణ విద్యార్థులతో సమానంగా ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ , సింగరేణి కాలరీస్ సహకారంతోఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్టు తెలిపారు. కనీస అర్హతగా పదవ తరగతి పాసై ఉన్న యువతీ యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని వివరించారు.

విస్తృతంగా ప్రచారం చేయాలి  

గ్రామీణ యువత అధిక సంఖ్యలో జాబ్ మేళాలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామానికి వాల్ పోస్టర్ల ద్వారా సమాచారం చేరవేస్తున్నామని, క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌తో పాటు మేళా ప్రాంగణంలో ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.అభ్యర్థులు తమ బయోడేటా ఐదు కాపీలు, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు. 

మేళా రోజున ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం టిఫిన్ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీనరసింహ, అదనపు కలెక్టర్ సీతారామరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, వ్యవసాయ శాఖా కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్,  కాంగ్రెస్ నేతలు సర్వోత్తమ్ రెడ్డి,డీఈఈటీ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

డాక్టర్లు నిబద్ధతతో పనిచేయాలి 

పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా నూతనంగా నియమితులైన వైద్యాధికారులుడాక్టర్ ఎస్. సాయి కృష్ణ ,డాక్టర్ యన్. అమూల్యడాక్టర్ బి. ప్రణీత్ నాయక్, డాక్టర్ ప్రతిమకు  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని, ప్రజా ఆరోగ్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని నిబద్ధతతో పని చేయాలని వైద్యాధికారులను మంత్రి కోరారు.