
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కుర్మల్ గూడ, తొర్రూర్, మేడ్చల్ జిల్లా బహదూర్ పల్లి ప్రాంతాల్లోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కు చెందిన మొత్తం 167 ఓపెన్ ప్లాట్లకు అక్టోబర్ 28 నుంచి 30వ తేదీ వరకు ఈ -వేలం నిర్వహించనున్నారు. తొర్రూర్లో 200 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణంలోని 120 ప్లాట్లకు, కుర్మల్ గూడలో 200 నుంచి -300 చదరపు గజాల విస్తీర్ణంలోని 29 ప్లాట్లు, బహదూర్ పల్లిలో 200 నుంచి -1,000 చదరపు గజాల విస్తీర్ణంలోని 18 ప్లాట్లను ఈ -వేలం ద్వారా విక్రయిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని ప్లాట్లకు గతంలో బహిరంగవేలం నిర్వహించగా... ప్రస్తుతం ఈ–-వేలం ద్వారా సేల్ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు రాజీవ్ స్వగృహ కొర్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది.
ఈ-వేలం షెడ్యూల్
కుర్మల్ గూడ, బహదూర్ పల్లిలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు ఆఖరు తేదీ అక్టోబరు 27వ కాగా... అక్టోబరు 28వ తేదీ ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో ఈ-వేలం నిర్వహిస్తారు. అలాగే, తొర్రూర్ లోని 120 ప్లాట్ల కొనుగోలుదారులు 28వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి 29, 30వ తేదీల్లో 4 సెషన్స్ లో వేలం నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ వెబ్ సైట్ లో చూడొచ్చు.