అప్పులు తెచ్చి పనులు చేయిస్తే సర్కార్ పైసా ఇస్తలేదు

అప్పులు తెచ్చి పనులు చేయిస్తే సర్కార్ పైసా ఇస్తలేదు
  • టార్గెట్లు పెట్టి మరీ.. శ్మశానాలు, డంప్ యార్డులు,
  • పార్కులు, రైతు వేదికలు కట్టించిన ప్రభుత్వం
  • నెలలు గడుస్తున్నా బిల్లులు మాత్రం వస్తలే
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల వద్ద ఆగుతున్న బిల్లులు
  • ఉపాధి నిధులు మళ్లించడమే కారణమంటున్న ఆఫీసర్లు

(వెలుగు, నెట్వర్క్) సర్కారు ఆదేశాలతో ఊరూరా శ్మశానవాటికలు, డంప్​ యార్డులు, విలేజ్​పార్కులు, రైతు వేదికలు నిర్మించిన సర్పంచుల్లో చాలా మంది అప్పులపాలైపోయిన్రు. మిత్తికి పైసలు తెచ్చి కిందా మీదా పడి కంప్లీట్ చేసినంక తీరా ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తలేవ్. అప్పుడు టార్గెట్లు పెట్టి, మెమోలు, సస్పెన్షన్లతో భయపెట్టిన ఆఫీసర్లు ఇప్పుడు తప్పించుకుంటున్నరు. తాము బిల్లులు ఆమోదించి, పంపుతున్నా పంచాయతీరాజ్, రూరల్​ డెవలప్​మెంట్​డిపార్ట్ మెంట్ల వద్ద పెండింగ్​పడుతున్నయని చెబుతున్నరు. కేంద్రం ఇచ్చే ఈజీఎస్​ ఫండ్స్​ను రాష్ట్ర సర్కారు ఇతర అవసరాలకు మళ్లించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నరు.అప్పులకు వడ్డీలు పెరుగుతుండడంతో ఏం చేయాలో తెలియక సర్పంచులు తలలు పట్టుకుంటున్నరు.

టార్గెట్లతో.. హడలెత్తించిన్రు

పల్లె ప్రగతి కింద ప్రభుత్వం ప్రతి ఊళ్లోనూ శ్మశానవాటిక, డంప్ యార్డు, విలేజ్​పార్కు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఒక్కో శ్మశానవాటికకు రూ.12 లక్షలు, డంపింగ్ యార్డు కు రూ.2.50 లక్షలు, విలేజ్​పార్కుకు రూ. 5.7 లక్షల చొప్పున మంజూరు చేస్తామని ప్రకటించింది. ఇవిగాక స్టేట్​వైడ్​ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్​ చొప్పున 2,604 క్లస్టర్ల పరిధిలో  రైతువేదికలను నిర్మించాలని ఆదేశించింది. ఇందుకోసం ప్రతి క్లస్టర్​కు రూ.22 లక్షలు మంజూరు చేస్తోంది. పంచాయతీరాజ్, డీఆర్డీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనులను గడువులోగా పూర్తి చేయాల్సిన బాధ్యతను ఫీల్డ్​ లెవల్​లో సర్పంచులు, కార్యదర్శులపైన ఉంచారు. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లకు ఇచ్చినా మెజారిటీ గ్రామాల్లో సర్పంచులే పనులు చేయిస్తున్నరు. ఈ పనులను మొదట్లో పంద్రాగస్టుకు, తర్వాత దసరా, దీపావళీలోగా పూర్తి చేయాలంటూ ఆఫీసర్లపై సర్కారు టార్గెట్ల మీద టార్గెట్లు పెడుతూ వచ్చింది. ఫీల్డ్​ లెవల్​లో సర్కారీ భూములు​లేకపోవడం, అసైన్డ్​ల్యాండ్స్​కేటాయించిన చోట జనం​అడ్డుకోవడం లాంటి సమస్యలున్నా ఆఫీసర్లు ఆవేవీ పట్టించుకోకుండా సర్పంచులు, కార్యదర్శులను ఉరుకులు పరుగులు పెట్టించారు. గడువులోగా పనులు కంప్లీట్​ కాకపోతే యాక్షన్​ తీసుకుంటామని బెదిరించారు. కొందరు సర్పంచులు, కార్యదర్శులకు నోటీసులు ఇచ్చి, సస్పెండ్​ చేసి మిగిలినవాళ్లను హడలెత్తించారు. ఆఫీసర్ల ఫోర్స్​తట్టుకోలేక చాలా మంది సర్పంచులు బయట మిత్తికి తెచ్చి మరీ పనులు చేపట్టారు.

ఫండ్స్ ను మళ్లించడం వల్లే..

గ్రామాల్లో శ్మశానవాటిక, డంప్ యార్డు, విలేజ్​పార్కు, రైతువేదికలు కట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈజీఎస్​ ఫండ్స్​నే వాడుకుంటున్నారు. ఫీల్డ్ లెవల్​లో పనుల ప్రోగ్రెస్​ఆధారంగా ఈ ఫండ్స్​విడతలవారీగా రిలీజ్​ అవుతాయని ఆఫీసర్లు చెప్పారు. కానీ జులై నుంచి ఫండ్స్​రావడం లేదని సర్పంచులు అంటున్నారు. కొన్నిచోట్ల ఎంబీలు చేయడంలో స్టాఫ్​ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ తాము బిల్లులను ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసి పైకి పంపుతున్నామని, పంచాయతీరాజ్, రూరల్​డెవలప్​మెంట్ డిపార్టమెంట్లలోనే ఆ బిల్లులు ఆగిపోతున్నాయని ఆఫీసర్లు వాపోతున్నారు. కేంద్రం రిలీజ్​చేస్తున్న ఈజీఎస్​ఫండ్స్​ను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు ​మళ్లించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని
చెబుతున్నారు.

బిల్లులు రాకుంటే.. ఆందోళన చేస్తం

అప్పులు చేసి మరీ నిర్మాణాలు చేపట్టామని, కొన్ని శ్మశాన వాటికలకు 40 శాతం, డంపింగ్ యార్డులు, పల్లెప్రకృతి వనాలకు30 శాతమే బిల్లులే వచ్చాయని, కొన్నిచోట్ల అవి కూడా రాలేదని సర్పంచులు అంటున్నారు. మొదట్లో ఉరికురికి పనులు చేయించిన ఆఫీసర్లు ఇప్పుడు తప్పించుకు తిరుగుతుండడంపై మండిపడుతున్నారు. సస్పెండ్​చేస్తారనే భయంతో కొందరు సర్పంచులు తమ ఇండ్లు, భూములు, బంగారం కుదవబెట్టి మరీ లోన్లు తెచ్చి పెట్టారు. ఇప్పుడు అప్పులవాళ్ల వేధింపులు తట్టుకోలేక ఊరిడిసిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలానికి చెందిన ఓ సర్పంచ్ అప్పుల బాధ భరించలేక కుటుంబంతో సహా ఊరు విడిచి హైదరాబాదులో ఉంటున్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం బిల్లులను వెంటనే మంజూరు చేసి తమకు అప్పుల బాధ నుంచి విముక్తి కల్పించాలని, లేదంటే ఆందోళనబాట పడతామని సర్పంచులు హెచ్చరిస్తున్నారు.

ఇది నల్గొండ జిల్లా మునుగోడు మండలం రావిగూడెంలోని కొత్త శ్మశానవాటిక. ఇక్కడి సర్పంచ్ గుర్రం సత్యం12 లక్షల 50 వేల రూపాయలు అప్పు తెచ్చి మరీ ఆగస్టులో దీనిని కట్టించిండు. ఇప్పటివరకు సర్కార్ నుంచి పైసా రాలేదు. పంచాయతీరాజ్ ఏఈ, డీఈ బిల్లులు అప్రూవల్ కూడా చేయలేదని సర్పంచ్​ చెప్తుండగా.. సర్కార్ నుంచే ఫండ్స్​ రావడం లేదని ఆఫీసర్లు అంటున్నరు. దీనిపై కలెక్టర్ కు కూడా సర్పంచ్ కంప్లయింట్ చేసిండు. పనులు తొందరగా చేయాలంటూ ఆఫీసర్లు ఒత్తిడి చేయడం వల్లే అప్పులు తెచ్చి పెట్టానని, ఇప్పుడు నెలనెలా వడ్డీలు కట్టడమూ కష్టమైపోతోందని, సర్కార్ నుంచి ఇంకా పైసలు రాకుంటే ఎట్లా? అని గోడు వెళ్లబోసుకున్నడు. రాష్ట్రంలో చాలా మంది సర్పంచ్ ల పరిస్థితి ఇప్పుడిట్లనే దారుణంగా తయారైంది.

పోటీలు పెట్టి.. అప్పులపాల్జేసిన్రు

శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులు, విలేజ్ పార్క్ లు, రైతు వేదికలంటూ సర్పంచ్ లకు సర్కార్ పోటీలు పెట్టింది. ముందుగల కట్టినోళ్లకు అవార్డులు, రివార్డులని ఆఫీసర్లు చెప్పిన్రు. పనులు చేయనోళ్లకు నోటీసులిచ్చిన్రు. సస్పెండ్ చేస్తామని బెదిరిచ్చిన్రు. దీంతో ఒక్కో సర్పంచ్ రూ. 10 లక్షల దాకా అప్పులు చేసి మరీ పనులు చేసిన్రు. తీరా పనులు అయిపోయినంక ఇప్పుడు బిల్లులు అడిగితే ఇస్తలేరు.

– ఎలగందుల శంకరయ్య, మూలసాల సర్పంచ్, పెద్దపల్లి మండలం

నెలకు 15 వేల వడ్డి కడ్తన్న..

సెగ్రిగేషన్​షెడ్ కు రూ.2 లక్షలు, డంప్ యార్డ్ కు రూ.3 లక్షలు, శ్మశానవాటికకు రూ.4 లక్షలు.. మొత్తం రూ.9 లక్షల అప్పు తెచ్చిన. నెలనెలా రూ. 15 వేల వడ్డీ కట్టుడయితంది. అప్పుడు పనుల కోసం ఒత్తిడి చేసిన ఆఫీసర్లు ఇప్పుడు బిల్లులు ఇవ్వాలని అడిగితే తప్పించుక తిరుగుతన్రు.

– గణపతి, భూరేపల్లి సర్పంచ్, ఆసిఫాబాద్ జిల్లా

ఆత్మహత్యే దిక్కు..

ఆఫీసర్ల ఒత్తిడితో మా ఊళ్లె డంప్ యార్డ్ కోసం రూ. 1.5 లక్షలు, శ్మశాన వాటిక కోసం 8 లక్షలు, విలేజ్ ​పార్కుకు లక్ష అప్పు చేసి పెట్టిన. బిల్లులను రిలీజ్​ చేస్తలేరు. పరిస్థితి గిట్లనే ఉంటే ఆత్మహత్యే గతి. జీవితంలో మళ్లెప్పుడు సర్పంచ్ కావద్దు.

– చెన్న నాయక్,    భీమ్లా తండా సర్పంచ్, మెదక్​ జిల్లా

20 లక్షలు అప్పు తెచ్చిన

సర్కార్ టార్గెట్లు పెట్టడంతో పల్లె ప్రగతి పనుల కోసం రూ. 20 లక్షలు మిత్తికి తెచ్చి పెట్టిన. ప్రతి నెల వడ్డీల మీద వడ్డీలు కడ్తున్న. పనులు జరిగి నెలలైతున్నా బిల్లులు ఇస్తలేరు. మా ఊరికే రూ.32 లక్షలు రావాలె. ఫండ్స్​ రిలీజ్​ చేయకుంటే సర్పంచులంతా రోడ్డెక్కి ఆందోళన చేస్తం.

– మహేశ్, గొల్లమడ సర్పంచ్‍, నిర్మల్‍ జిల్లా