పాలమూరు నుంచి 2 లక్షల మందికి పైగా వలస పోయిన్రు

పాలమూరు నుంచి 2 లక్షల మందికి పైగా వలస పోయిన్రు
  • ఉమ్మడి జిల్లా నుంచి ముంబై, పుణె పోయినోళ్లు 2 లక్షల మందికి పైనే
  • తండాల్లో 80 శాతం ఇండ్లకు తాళాలుఇన్నాళ్లూ వలస కూలీల 
  • లెక్కలు తీయని కార్మిక శాఖ వలసల వివరాలు వెల్లడించిన ఆరోగ్య శాఖ
  • వ్యాక్సిన్ వేసుకోనోళ్ల లెక్కలు తీస్తుంటే బయటపడ్డ నిజాలు

మహబూబ్‌‌నగర్, వెలుగు: పాలమూరు పచ్చబడ్డదని, వలసపోయినోళ్లు వాపస్ వస్తున్నరని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా.. ఊర్లలో పరిస్థితి మాత్రం ఎప్పటిలెక్కనే ఉన్నది. పాలుగారే పాలమూరు అని సర్కారు అంటున్నా.. సాగు చేసుకోవడానికి నీళ్లు వస్తలేవు. పని చేసుకుందామంటే ఉపాధి ఉంటలేదు.. దీంతో పేదల గోస తీరలేదు. వలసలు ఆగుతలేవు. పిల్లాజల్లను వదిలేసి పోయేటోళ్లతో ముంబై బస్సు కిక్కిరిసి పోతూనే ఉన్నది. ఒక్కరో ఇద్దరో కాదు 2 లక్షల మందికి పైగా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి వలస వెళ్లినట్లు ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి. కానీ ఇవి కార్మిక శాఖ నమోదు చేసిన లెక్కలు కాదు.. కరోనా వ్యాక్సిన్‌‌కు సంబంధించిన వివరాలను ఆరోగ్య శాఖ తీస్తుంటే వెల్లడైన వాస్తవాలు. 

ప్రాజెక్టులు ఎక్కడివక్కడే..

తెలంగాణ వచ్చాక పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేస్తామని, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు తదితర లిఫ్టు స్కీముల కింద కెనాల్స్​ తవ్వి సాగు నీరిస్తామని పలుమార్లు కేసీఆర్ హామీ ఇచ్చారు. తద్వారా ఉమ్మడి మహబూబ్‌‌నగర్ జిల్లాలో కొత్తగా లక్షల ఎకరాల ఆయకట్టు అదనంగా సాగులోకి వస్తుందని చెప్పారు. కానీ టీఆర్ఎస్ సర్కారు కొలువుదీరి ఎనిమిదేండ్లు అయినా ఇప్పటికీ పాలమూరు ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. కాంగ్రెస్ హయాంలో కట్టిన లిఫ్టు స్కీముల కింద ఎలాంటి కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీలు తవ్వలేదు. పైగా మోటర్లకు రిపేర్లు వచ్చి కేఎల్‌‌ఐతోపాటు లిఫ్టు స్కీములన్నీ పడకేశాయి. సాగునీరు అందడం లేదు. ఈ యాసంగిలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. దీంతో గ్రామాల్లో ఉపాధి లేక చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు వలసపోతున్నారు. 

పిల్లాపాపలను తల్లిదండ్రుల వద్ద వదిలి, ఆలుమగలు పొట్టచేతపట్టుకొని ముంబై బస్సు ఎక్కుతున్నారు.ఆరోగ్య శాఖ లెక్కలతో వెలుగులోకి గత ప్రభుత్వాలు కార్మిక శాఖ ద్వారా ఏటా వలస కూలీల లెక్కలు తీసి, కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేవి. కానీ తెలంగాణ వచ్చాక 2014 నుంచి కార్మిక శాఖ ద్వారా ఈ లెక్కలను రికార్డ్ చేయడం లేదు. పైగా సాగునీరు వస్తుండడంతో వలస పోయినోళ్లు తిరిగి ఊళ్లకు వాపస్ వస్తున్నారని ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేస్తూ వచ్చారు. కానీ సర్కారు మాటల్లోని డొల్లతనాన్ని ఆరోగ్య శాఖ బయటపెట్టింది. 2021 డిసెంబర్‌‌‌‌లో ఆరోగ్య శాఖ కరోనా వ్యాక్సిన్​ వేసేందుకు తీసిన లెక్కల్లో ఉమ్మడి మహబూబ్‌‌నగర్ జిల్లా నుంచి 2 లక్షల 14 వేల మందికి పైగా వలస వెళ్లినట్లు తేలింది. అందువల్లే జిల్లాలో 100 శాతం వ్యాక్సిన్ లక్ష్యం చేరుకోలేకపోయినట్లు స్పష్టం చేసింది. హెల్త్ డిపార్ట్‌‌మెంట్ లెక్కల ప్రకారం మహబూబ్‌‌నగర్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారు లక్షా 33 వేల 515 మంది ఉండగా, వీరిలో 90 వేల మంది వలస వెళ్లారు. నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లాలో 73,620 మంది వ్యాక్సిన్ తీసుకోని వారు ఉంటే.. అందులో 42 వేల మందిని వలస కార్మికులుగా చూపారు. వనపర్తి జిల్లాలో 46 వేల మంది వ్యాక్సిన్ తీసుకోని వారు ఉండగా.. వారిలో 22 వేల మంది, జోగుళాంబ గద్వాల జిల్లాలో 36,308 మంది వ్యాక్సిన్ తీసుకోని వారు ఉండగా.. అందులో 20 వేల మంది, నారాయణపేట జిల్లాలో 60 వేల మంది వ్యాక్సిన్ తీసుకోని వారు ఉండగా.. వారిలో 38 వేల మంది వలస వెళ్లినట్లు పేర్కొన్నారు. అధికారుల లెక్కల ప్రకారం మహబూబ్‌‌నగర్ జిల్లాకు చెందిన 42,637 మంది ముంబైలోనే వ్యాక్సిన్ వేయించుకున్నారు.

పాలమూరు–రంగారెడ్డి పూర్తయ్యేదెన్నడు?

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 2015 జూన్ 11న మహబూబ్‌‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కర్వెన వద్ద సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు తాగునీరు, 12 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని మాట ఇచ్చారు. రూ.36 వేల కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించగా, ప్రస్తుతం దీని వ్యయం రూ.52 వేల కోట్లకు చేరింది. కానీ ఇప్పటి వరకు 40 శాతం పనులు మాత్రమే జరిగాయి. ఎన్జీటీ స్టే ఇవ్వడంతో అక్టోబరు 2021 నుంచి ఆ పనులు కూడా ఆగిపోయాయి. మహాత్మాగాంధీ లిఫ్టు స్కీం ( ఎంజీకేఎల్ఐ) కింద 4.20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని టార్గెట్ పెట్టుకోగా, కెనాల్స్ పూర్తికాకపోవడం వల్ల 1.80 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోంది. ఈ స్కీం పరిధిలో మెయిన్​కెనాల్‌‌తోపాటు సబ్ కెనాల్స్, బ్రాంచ్ కెనాల్స్ మిగిలి ఉన్నాయి. భీమా–1, 2 కింద రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా, కేవలం 42 వేల ఎకరాలకే నీరు అందుతోంది. కోయిల్​సాగర్​ కెపాసిటీని 52 వేల ఎకరాలకు పెంచినా, కాలువల రిపేర్లు, డిస్ర్టిబ్యూటరీల పనులు మొదలుకాకపోవడంతో 20 వేల ఎకరాల లోపే సాగునీరు అందుతోంది. ఆర్డీఎస్ కింద తెలంగాణలో 85 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, 18 వేల ఎకరాలకు మించి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. దీంతో సాగునీరు అందక ఎప్పట్లాగే సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు వలసబాట పడుతున్నారు

ఇండ్లకు తాళాలు..

మహబూబ్‌‌నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లోని కోయిల్‌‌కొండ, గండీడ్, బాలానగర్, మిడ్జిల్, కోస్గి, నవాబ్​పేట, ఖిల్లాఘనపురం, మహ్మదాబాద్, కొడంగల్, మక్తల్, మద్దూరు మండలాల నుంచి రైతులు, కూలీలు, గిరిజనులు వలస పోతున్నారు. ప్రస్తుతం ఈ మూడు జిల్లాల నుంచి 2 లక్షల మందికి పైగా ముంబై, పుణె తదితర ప్రాంతాలకు వలసపోయినట్లు తెలుస్తోంది. అనేక తండాల్లో 80 శాతానికి పైగా ఇండ్లకు తాళాలు పడ్డాయి. కొడంగల్ నియోజకవర్గం ఎర్రగుంటతండా లో 200 కుటుంబాలు ఉండగా, 140 కుటుంబాలు ముంబై వెళ్లాయి. మహబూబ్‌‌నగర్ జిల్లాలోని మహ్మదాబాద్ మండలం గువ్వని కుంట తండా పంచాయతీ పరిధిలోని మూడు తండాల్లో 116 కుటుంబాలు ఉండగా, 95 కుటుంబాలు వలసపోయాయి.

మహబూబ్‌‌నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలం బోరింగ్‌‌తండాకు చెందిన ఈమె పేరు మాణిక్కిబాయి. పక్కన ఉన్నది ఆమె మనువడు వెంకటేశ్. వీరికి భూమి లేదు. ఊర్లో ఉపాధి దొరక్కపోవడంతో వెంకటేశ్ తల్లిదండ్రులు పదేండ్ల కింద పుణెకు వలస పోయారు. వెంకటేశ్ తండ్రి రాజు తాపీ మేస్ర్తీ పని చేస్తున్నడు. వచ్చిన పైసల్లో ప్రతి నెలా తల్లికి డబ్బులు పంపిస్తున్నడు. 

ఆ పైసలతోనే మాణిక్కిబాయి ఇల్లు నడుపుతున్నది. అబ్బాయి చదువుకూ ఆ పైసలే ఖర్చు చేస్తున్నరు. ఏడాదిలో ఒకసారి ఇంటికి వచ్చిపోతరు.మహ్మదాబాద్ మండలం గువ్వని కుంట తండాకు చెందిన ఈమె పేరు రుకాలి బాయి. పక్కన ఉన్నది ఆమె ఇద్దరు మనువళ్లు.  ఈమె కొడుకులు పాండు, బాలు. ఇద్దరికీ పెండ్లిళ్లు కాగా.. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో తమ భార్యలతో కలిసి పుణెకు వలసపోయారు. అక్కడే సుతారి పనులు చేసుకుంటున్నరు. వారి పిల్లలను రుకాలి వద్దే వదిలిపెట్టారు. తనకున్న ఎకరం పొలంలో రుకాలి వర్షాకాలంలో జొన్నలు సాగు చేస్తోంది. బోరు లేకపోవడంతో యాసంగిలో పొలాన్ని పడావుపెట్టింది. గువ్వని కుంట తండాకు చెందిన ఈమె పేరు చినిబాయి. రెండు ఎకరాల భూమి ఉంది. కానీ నీళ్లు లేవు. బోరు లేదు. దీంతో ఈమె కొడుకులు మోహన్, రవి, గణేశ్, నరేశ్ ఉపాధి లేక 20 ఏండ్ల కిందట పుణె వెళ్లారు. అక్కడే మేస్ర్తీ పనులు చేస్తున్నరు. వర్షాకాలంలో మాత్రం చినిబాయి రెండు ఎకరాల్లో జొన్నలు వేస్తున్నది. కానీ రైతుబంధు రావడం లేదు. 2019లో వితంతు పింఛన్ కోసం అఫ్లై చేసినా ఇయ్యలేదు.

మధుర మీది తండాకు చెందిన ఈమె పేరు జానకమ్మ. గోబ్రియా, తూక్యా, లక్ష్మణ్, రాములు ఈమె కొడుకులు. నలుగురికి కలిపి అర ఎకర పొలం మాత్రమే ఉంది. బోరు లేదు. దీంతో ఉపాధి లేక ఈ నలుగురు పుణెకు వలసపోయారు. అక్కడే సుతారి పని చేసుకుంటున్నరు. జానకమ్మకు ఆరోగ్యం బాగా లేకుంటే తప్ప వీరు ఊరికి రావడం లేదు. జానకమ్మ కూలి పనులు చేసుకుంటూ నెట్టుకొస్తున్నది.

అప్పులు ఎక్కువై ముంబై వచ్చినం

ఊళ్లె పనులు లేక, అప్పులు ఎక్కువై ముంబై వచ్చినం. కాంట్రాక్టర్ దగ్గర నేను, నా భార్య మేస్త్రీ పని చేస్తున్నం. పైసల్లేక నా పెద్ద కొడుకు శివ సాయిని 5వ తరగతి వరకు చదివించి బంద్​పెట్టినం. ఇప్పుడు ముంబై తీసుకువచ్చి మాతోనే పని చేయిస్తున్నం. ఓ పాప ఊళ్లెనే ఓ బడిలో చదువుతంది.
- బెల్లం కథలప్ప, పులిమామిడి గ్రామం, ఊట్కూర్ మండలం, నారాయణపేట