రుణమాఫీతో క్రాప్ లోన్లకు ఊపు..ఈ సీజన్లో రూ.10 వేల కోట్లు ఇచ్చిన బ్యాంకులు

రుణమాఫీతో క్రాప్ లోన్లకు ఊపు..ఈ సీజన్లో  రూ.10 వేల కోట్లు ఇచ్చిన బ్యాంకులు
  • వేగంగా పంట రుణాలు ఇస్తున్న బ్యాంకులు
  • ఈ సీజన్​లో 6 లక్షల మంది రైతులకు రూ.10 వేల కోట్లు ఇచ్చిన బ్యాంకర్లు
  • ఈ నెలాఖరు వరకు మరిన్ని రుణాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల దాకా పంట రుణాలను మాఫీ చేయడంతో రైతులకు బ్యాంకులు విరివిగా కొత్త రుణాలు ఇస్తున్నాయి. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616.89 కోట్ల పంట రుణాలను మాఫీ చేసింది. రైతులు భారీగా రుణ విముక్తులు కావడంతో బ్యాంకులు పంట రుణాలను ఇవ్వడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నాయి. గత బీఆర్ఎస్  సర్కారు హయాంలో రుణమాఫీ సక్రమంగా చేయకపోవడంతో బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకు రాలేదు. స్టేట్​ లెవెల్  బ్యాంకర్ల కమిటీ మీటింగ్స్ లో టార్గెట్ లు  పెట్టి మరీ చెప్పినా సర్దుబాట్లే తప్ప కొత్త లోన్లు ఇచ్చేవి కాదు. కానీ, కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే భారీ ఎత్తున లోన్లు మాఫీ చేసి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు విరివిగా పంట రుణాలు ఇస్తున్నాయి. ఈ సీజన్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట రుణాలు అందుతుండడంతో రైతుల్లో ఉత్సాహం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్​బీసీ సమావేశం నిర్వహించి ఈ వానాకాలం సీజన్​లో బ్యాంకర్లకు రూ.52,290 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని టార్గెట్  పెట్టింది. ఇటీవల సీజన్​ ప్రారంభం కాగా ఇప్పటికే రూ.10 వేలకోట్లకు పైగా 6 లక్షల మంది రైతులకు క్రాప్​ లోన్లు అందాయి. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్​లో అత్యధికంగా ఈ నెల చివరి నాటికి పూర్తి చేస్తామని బ్యాంకర్లు అంటున్నారు. 

రుణమాఫీ తర్వాత భారీగా పంట రుణాలు

ప్రజా ప్రభుత్వం రుణమాఫీ చేసిన తరువాత  బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వడం భారీగా పెరిగింది. గత రెండు సీజన్లలో కలిపి ప్రభుత్వం రూ.90,795 కోట్లు టార్గెట్​ విధించగా 47.89 లక్షల మంది రైతులకు రూ.73,104 కోట్లు రుణాలు (80.52 శాతం) అందాయి. అదే గత బీఆర్ఎస్​ హయాంలో రుణమాఫీ పూర్తి చేయని కారణంగా రైతులకు కనీసం 60 శాతం రుణాలు కూడా అందలేదు. దాదాపు 20 లక్షల మంది రైతులు లోన్లు పొందలేని పరిస్థితి ఉండేది. అప్పట్లో కొందరు రైతులకు రైతుబంధు పైసలు బ్యాంకుల్లో పడినా.. పాత బాకీల పేరుతో బ్యాంకర్లు రైతులకు రైతుబంధు డబ్బులు ఇవ్వకుండా విత్ హోల్డ్  చేశారు. కొత్త సర్కారు వచ్చిన ఏడాదిలోపే రుణమాఫీ చేయడంతో పరిస్థితిలో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి.