ఉద్యమకారులకు ఇచ్చిన.. హామీల అమలుకు సబ్ కమిటీ

ఉద్యమకారులకు ఇచ్చిన..  హామీల అమలుకు సబ్ కమిటీ
  • సెంట్రల్ గవర్నమెంట్ ఫెడరల్ స్ఫూర్తి చాటాలి
  • తెలంగాణపై వివక్ష వీడాలి
  • మంత్రి పొన్నం ప్రభాకర్ 
  • నిజామాబాద్​ మేయర్​గా బాధ్యతలు స్వీకరించిన ఉమారాణి

నిజామాబాద్​, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జైలు శిక్షలు అనుభవించిన ఉద్యమకారులు, ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్‌గా కూరగాయల ఉమారాణి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి మీడియాతో మాట్లాడారు. ఉద్యమకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయింపునకు విధివిధానాలు రూపొందించేందుకు ఈ నెలలోనే సబ్‌కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.  రాజకీయాలపై తమకు ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని చాటి తెలంగాణపై వివక్షను మానుకోవాలని సూచించారు. రాష్ట్రానికి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ గత రెండు బడ్జెట్లలో తగిన నిధులు కేటాయించలేదని విమర్శించారు.  

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2047 విజన్‌తో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. 116 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లను ప్రజలు కాంగ్రెస్‌కు అప్పగించారని, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నుంచి గ్రామపంచాయతీ ఎన్నికల వరకు ప్రజాపాలనకు మద్దతు లభించిందని గుర్తుచేశారు. ప్రజల ఆశలను వమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తామని మంత్రి అన్నారు.

అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తాం.. టీపీసీసీ చీఫ్​ మహేశ్​​గౌడ్​

మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇక ప్రభుత్వం అభివృద్ధిపైనే పూర్తి దృష్టి సారిస్తుందని టీపీసీసీ  చీఫ్ మహేశ్​కుమార్ గౌడ్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పేదింటి ఆడ బిడ్డ ఉమారాణిని నగర మేయర్‌గా ఎంపిక చేసిన ఘనత కాంగ్రెస్ దేనని పేర్కొన్నారు. ఆమెకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తన సొంత జిల్లా అయిన నిజామాబాద్​పై ప్రత్యేక అభిమానం ఉందని, అభివృద్ధి కార్యక్రమాల ద్వారానే ఆ అనుబంధాన్ని చూపుతానని తెలిపారు.

కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి, డిప్యూటీ మేయర్ సల్మా తహసిన్, నుడా చైర్మన్ కేశవేణు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, డీసీసీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, రత్నాకర్, నరేందర్ రెడ్డి, అక్తర్ తదితరులు పాల్గొన్నారు.