
- అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి
- బోనాలు సమర్పించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ దంపతులు, కొండా సురేఖ
- అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క,
- అడ్లూరి లక్ష్మణ్, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- తెల్లవారుజామునుంచే భక్తుల క్యూ.. ఇయ్యాల రంగం
హైదరాబాద్ సిటీ, వెలుగు: నెత్తిన బోనమెత్తి వచ్చిన ఆడబిడ్డలు, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో లష్కర్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. బోనాల పండుగను పురస్కరించుకొని ఆలయాన్ని అధికారులు రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. పూజారులు తెల్లవారుజామునే అమ్మవారికి మహా మంగళ హారతి ఇచ్చారు. ఆలయ ధర్మకర్త సురటి కుటుంబ సభ్యులు తొలి బోనం సమర్పించగా.. ఉదయం 4.10 గంటలకు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ప్రభుత్వం తరఫున అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం భక్తులకు అనుమతిచ్చారు.
అమ్మవారికి సీఎం రేవంత్‌రెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించి, దర్శించుకున్నారు. సీఎంతోపాటు మంత్రులు కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించారు. సీఎంకు అధికారులు, ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేష్.. సీఎంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా.. రాత్రి 9.30 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు.
కిక్కిరిసిన లష్కర్ దారులు
బోనాలు సమర్పించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బోనాలతో వచ్చిన వారికి ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. శివసత్తులకు మధ్యాహ్నం సమయంలో ప్రత్యేక దర్శన సదుపాయాన్ని కల్పించారు. ఉదయం సమయంలో అమ్మవారి దర్శనానికి గంట నుంచి రెండు గంటల సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు, వీఐపీల కోసం వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. జాతరను తిలకించేందుకు వివిధ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లను అమర్చారు. ఆలయ పరిసరాల్లో 5 ఉచిత ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ సిబ్బంది, వివిధ విభాగాల వలంటీర్లు భక్తులకు, బోనాలు సమర్పించే మహిళలకు తాగునీటిని అందించారు.
వీఐపీల క్యూ
బోనాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వీఐపీలు క్యూకట్టారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, నగర ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు, హైకోర్టు జడ్జి నంద, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, మేయర్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక పూజలు చేశారు.
నేడు రంగం...
లష్కర్ బోనాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమం సోమవారం ఉదయం 8 గంటలకు జరగనున్నది. ఇందులో భాగంగా పచ్చి కుండపై నిల్చొని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించనున్నారు. అనంతరం పోతరాజుల గావుపట్టే కార్యక్రమం, అమ్మవారి అంబారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. సాయంత్రం ఫలహారం బండ్ల ఊరేగింపు తీస్తారు. ఊరేగింపు కోసం కర్నాటక తుంకూరులోని శ్రీ కరిబసవ స్వామి మఠం నుంచి 33 ఏండ్ల ఆడ ఏనుగు లక్ష్మిని తీసుకొచ్చారు.
సమృద్ధిగా పంటలు పండాలె: మంత్రి పొన్నం
శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా మంచి వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగవైభవంగా జరిగాయని, ప్రజా పాలనలో సీఎం రేవంత్ నాయకత్వంలో అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
మహిళలకు ప్రత్యేకమైన పండుగ: కిషన్ రెడ్డి
వందల ఏండ్లుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ ఘనంగా జరుగుతున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, దేశ రక్షణ కోసం సైనికులకు అద్భుతమైన శక్తిని ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు.
అమ్మవారి ఆశీస్సులు ఉండాలె: మంత్రి సీతక్క
అమ్మవారిని దర్శించుకోవడం ఇది రెండోసారని, నిరుడు బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నానని మంత్రి సీతక్క తెలిపారు. అప్పటి నుంచి అమ్మవారి ఆశీస్సులతో ఆరోగ్యంగా, సంతోషంగా, ఎంతో బలంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్రజా ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తరఫున బోనాల ఏర్పాట్లు ఘనంగా చేసినట్లు చెప్పారు. కాగా, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యంతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు బీజేపీ స్టేట్ ఛీప్ రాంచందర్‌రావు తెలిపారు.
నేడు భవిష్యవాణి: శైలజా రామయ్యర్
ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగుండా ఏర్పాట్లు చేశామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్తెలిపారు. బోనంతో వచ్చిన వారికి ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనం కల్పించామన్నారు. ఈ సారి శివసత్తుల కోసం స్పెషల్ దర్శన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. సోమవారం అంబారీ ఊరేగింపు ఉంటుందని, ఆ తర్వాత రంగం కార్యక్రమంలో భాగంగా స్వర్ణలత భవిష్యవాణిని వినిపించనున్నారని తెలిపారు.
పోలీసుల అత్యుత్సాహం: జోగిని శ్యామల
అమ్మవారికి జోగిని శ్యామల బోనం సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బోనాల ఏర్పాట్లపై తాను అసంతృప్తిగా ఉన్నట్టు తెలిపారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. తమ వెంట వచ్చిన వారిని తోసేశారని చెప్పారు.
సీఎంకు, మంత్రులకు మంత్రి పొన్నం విందు
ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ విందు ఇచ్చారు. ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో జరిగిన విందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, జూపల్లి, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ సలహాదారు కేకే, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు. తన కుటుంబ సభ్యులను పొన్నం ప్రభాకర్ సీఎంకు పరిచయం చేశారు.