విడాకులు తీసుకున్న భర్త.. 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు.. దరిద్రం వదిలిందంటూ సంబురాలు

విడాకులు తీసుకున్న భర్త.. 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు.. దరిద్రం వదిలిందంటూ సంబురాలు

దిస్‎పూర్: వాళ్లిద్దరూ భార్యాభర్తలు.. పాపం ఆ భర్త ఎంత నగిలిపోయాడు ఏంటో.. భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత అతను చేసిన పనితోనే ఈ విషయం స్పష్టం అవుతుంది. కోర్టు ద్వారా అధికారికంగా విడాకులు పొందిన భర్త.. నేరుగా ఇంటికొచ్చాడు.. ఇంటికి వస్తూ వస్తూ 40 లీటర్ల పాలు కొన్నాడు.. ఇంటికి రావటంతోనే పాల స్నానం చేశాడు.. దరిద్రం పోయింది అంటూ సంబురాలు చేశాడు.. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‎లో వైరల్ అయ్యింది.. ఇంతకీ ఈ మహానుభావుడు ఎవరు.. ఎక్కడి వాడు.. ఎందుకంత సంబురం అనేది డీటెయిల్డ్‎గా తెలుసుకుందాం..

అస్సాంలోని నల్బరి జిల్లా ముకుల్మువా గ్రామానికి చెందిన మాణిక్ అలీ (32)  అనే వ్యక్తికి ఓ మహిళతో వివాహమైంది. వీరికి ఒక కూతురు ఉంది. పెండ్లి అయి పిల్లలు ఉన్న మాణిక్ అలీ భార్య తప్పుడు దారి పట్టింది. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా మొగుడు, పిల్లలను వదిలి ఏకంగా ప్రియుడుతో వెళ్లిపోయింది. గ్రామ పెద్దలు, మహిళ కుటుంబ సభ్యులు సయోధ్య కుదిర్చి మళ్లీ తీసుకొచ్చారు. 

పిల్లల మొఖం చూసి మాణిక్ అలీ కూడా భార్యను క్షమించాడు. ఇంత జరిగినా ఆమెలో ప్రియుడుపై ఉన్న ప్రేమ మాత్రం చావలేదు. ప్రియున్ని వదిలి ఉండలేకపోయింది. కుటుంబాన్ని వదిలేసి మళ్లీ ప్రియుడితో జంప్ అయ్యింది. మళ్లీ తీసుకొచ్చి మాణిక్ అలీకి అప్పగించారు పెద్ద మనుషులు. పిల్లల కోసం పెద్ద మనసు చేసుకుని రెండోసారి కూడా భార్యను క్షమించాడు మాణిక్. కానీ ఆమెలో మార్పు రావడం లేదు. 

ప్రియుడితో అక్రమ సంబంధం అలాగే కొనసాగిస్తోంది. ఇక, భార్య తీరుతో విసిగిపోయిన మాణిక్.. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. చివరకు కోర్టు మాణిక్ అలీ, ఆయన భార్యకు విడాకులు మంజూరు చేసింది. బుద్ధి సక్కగా లేని భార్యతో కోర్టు విడాకులు మంజూరు చేయడంతో మాణిక్ అలీ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. భార్య తన ప్రాణానికి ఎలాంటి అపాయం తలపెట్టకుండా వెళ్లిపోయిందనా.. లేక అలాంటి క్యారెక్టర్ లేని వ్యక్తి జీవితం నుంచి వెళ్లిపోయిందనే సంతోషంలోనో తెలియదు కానీ.. కోర్టు విడాకులు ఇవ్వడంతో మాణిక్ సంబరాలు చేసుకున్నాడు. 

కొత్త జీవితం ప్రారంభించబోతున్నానని ఏకంగా 40 లీటర్ల పాలతో తల స్నానం చేశాడు. మాణిక్ దీన్ని తన జీవితంలో శుద్ధి వేడుకగా అభివర్ణించాడు. మాణిక్ పాలతో స్నానం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. 

అలాంటి భార్య ఉండటం కంటే వెళ్లిపోవడమే బెటర్ అని కొందరు.. మనోడికి ముప్పుతిప్పులు పెట్టి మూడు చెర్ల నీళ్లు తాగించిందని కొందరు, ఏం గుండెయ్యా నీది.. రెండుసార్లు ప్రియుడితో వెళ్లిపోయిన క్షమించావంటూ ఇంకొందరు, దరిద్రాన్ని వదిలించుకుని పాలతో జీవితాన్ని పవిత్రం చేసుకున్నావంటూ కొందరు ఫన్నీ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.