తెలంగాణ చరిత్ర : నిర్మల్ జిల్లాలో కనకాయ్ రాజ్యం ఆనవాళ్లు.. శాతవాహనుల కంటే ముందే ఇక్కడ ప్రాచీన రాజ్యం..!

తెలంగాణ చరిత్ర : నిర్మల్ జిల్లాలో కనకాయ్ రాజ్యం ఆనవాళ్లు.. శాతవాహనుల కంటే ముందే ఇక్కడ ప్రాచీన రాజ్యం..!

తెలుగురాజ్యం అనగానే గుర్తొచ్చేది శాతవాహనుల సామ్రాజ్యం... మన చరిత్ర కారులు కూడా ఇప్పటివరకు శాతవాహనులే మొదటి తెలుగు రాజలు అన్నారు. కానీ ఇంకాస్త వెనక్కి వెళ్తే మరో రాజ్యపు ఆనవాళ్లు కూడా ఉన్నాయి. శాతవాహనుల కంటే ముందే కనకాయ్ అనే రాజ్యమొకటి ఉండేది. అది కూడా అన్ని ప్రాచీన రాజ్యాలు మాదిరిగానే  కాలగర్భంలో కలిసి పోయింది అంటున్నారు. పరిశోధకులు. ఇప్పుడు  ఆ రాజ్య విశేషాలు ఏంటో తెలుసుకుందాం. . .

నిర్మల్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని కనకాయ్ జలపాతం సమీపంలోనే కనకాయ్ రాజ్యపు ఆనవాళ్లు ఉన్నాయి. అయితే శాసన పరిష్కర్త బీఎన్ శాస్త్రి రాసిన 'ఆదిబాబాద్ జిల్లా సర్వస్వం' అనే గ్రంథంలో కనకాయ్ ప్రస్తావన లేదని, పదేళ్ల క్రితం వెలుగు చూసిన ఈ ప్రాంతంలో తవ్వకాలు చేపడితే కొత్త చరిత్రను తెలుసుకోవచ్చు అంటున్నారు చరిత్రకారులు.

ప్రాథమిక దశలో పరిశోధనలు...

ఇప్పటివరకు తెలంగాణకు చెందిన చరిత్రకారుల బృందాలు రెండు సార్లు, విదేశీ బృందం ఒకసారి ఈ ప్రాంతాన్ని సందర్శించి కొన్ని విషయాలను తెలుసుకున్నారు. 2008లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ డైరెక్టర్ వీవీ కృష్ణశాస్త్రి, ప్రముఖ చరిత్ర పరిశోధకులు జితేంద్రబాబు, జైకిషన్, సూర్యకుమార్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఆ విజిట్ లో అక్కడ రోమన్ల శైలిలో యాంఫీ థియేటర్, బౌద్ధజాతక కథల శిల్పాలతో కూడిన స్తంభం, కనకాయ్ విగ్రహం. పురా మానవుని రాతి పనిముట్లు, ఇనుప వస్తువులను గుర్తించారు.

 రాళ్ల వరుసతో ఉన్న కనకాయ్ కోట ఆనవాళ్లు శాతవాహనుల కాలం నాటివిగా భావించారు. గతంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన విదేశీ పరిశోధకులు క్రీ.పూ.1000 సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ తొలి  చారిత్రక సంస్కృతి ఉందంటున్నారు.

2014లో శ్రీరామోజు హరగోపాల్ నేతృత్వంలో మరో బృందం ఈ ప్రాంతాన్ని సందర్శించింది. ఆ విజిట్ లో కనకాయ్​ కు వెళ్లే దారిలో నాలుగైదు ఆదిమానవుల సమాధులు (రాతి కుప్పలు, సిస్తులు, డోల్మన్ సమాధులు), రాతి గోడల వంటి నిర్మాణాలు, ఆవాసాల శిథిలాలను, శిథిల స్థితిలో ఉన్న ఒక కోట బురుజును వాళ్లు కనుగొన్నారు. వాళ్లకు పాత కుండ ముక్క, రోలు, సానరాయి ముక్క,నూరే రాళ్లు, పెద్ద సైజు ఇటుకలు, ఇనుం చిట్టెం కూడా లభించాయి. కనకాయ్ కోట ముందు కొలను (నీటిమడుగు) ఉన్నట్లు హరగోపాల్ చెప్తున్నారు.

యుద్ధవీరుడి ప్రతిమ

కనకాయ్ ఆలయం ముందు ఉన్న స్తంభానికి నాలుగువైపుల ఉల్బణ శిల్పాలు ఉన్నాయి. ఒక వైపు ఒక వీరుడు యుద్ధంలో శత్రుసంహారం చేస్తున్నట్లుగా ఉంది. ఎడమచేతిలో గధ లాంటి ఆయుధం ఉంది. కుడి చేతిలో ఉన్న ఆయుధం అస్పష్టంగా కనిపిస్తుంది. ఎడమ కాలితో గుర్రాన్ని తన్నుతున్నట్లు ఉంది. అతడి కాళ్ల నడుమ కూలిపోయిన శత్రువులు కనిపిస్తున్నారు. రెండో వైపు గుర్రం ఎక్కిన యోధుడు తన ఎడమ కాలితో శత్రువులను తొక్కి చంపుతున్నాడు. అతడి కింది వరుసలో భటులు సాయుధులై, డాళ్లతో కనిపిస్తున్నారు.. మూడో వైపు శిల్పం పెద్ద తలతో ఉన్న మనిషి కుడిచేత్తో పెద్ద కొమ్ము, ఎడమ చేత్తో ఏనుగు వంటి జంతువును ఎత్తినట్లుగా ఉంది. నాలుగో వైపు ఇద్దరు సైనికులు ధనుర్భాణాలు ధరించి కనిపిస్తున్నారు. ఈ స్తంభం ఏ చారిత్రక సందర్భానికి సాక్ష్యమో తేల్చాల్సి ఉంది.

 చారిత్రక కాలానికి సంబంధించి ఈ కనకాయ్ గోండు రాజ్యంలోని ఒక కోటగా భావిస్తున్నారు. పురావస్తు శాఖ పూర్తి స్థాయిలో తవ్వకాలు చేపట్టి ఆధారాలు వెలికి తీస్తే తెలంగాణ చరిత్రలో కనకాది ప్రత్యేక అధ్యాయమయ్యే అవకాశముందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు..

కనకాయ్ కైఫియత్..

ఈ ప్రాంతంలో పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. కణ్వ మహర్షి తన తపోశక్తితో గిరిజాయి, బతాయి. అరకాయి, కనకాయ్ అనే నలుగురు కూతుళ్లని పొందాడు. వాళ్లలో చిన్నకూతురైన కనకాయ్ అడిగినవాళ్లకు కాదనకుండా బంగారం ఇచ్చేదట. కానీ.. స్థానికుడు ఒకాయన ఆమె గురించి అవమానకరంగా మాట్లాడడంతో శిలగా మారిపోయిందనేది కైఫియత్​ లోని సారాంశం. అలా మారిన విగ్రహాన్నే ఇప్పుడు కనకాయ్ మాతగా కొలుస్తున్నారు

అదిలాబాద్ జిల్లా గర్భాన ప్రపంచానికి తెలియని చరిత్ర ఎంతో బాగుంది. కనకాయ్ అద్భుతమైన చారిత్రక స్థలం. శాతవాహనుల కంటే పూర్వం అంటే క్రీ.పూ. 7వ శతాబ్దంకన్నా ముందు మంటే అక్కడ రాజ్యపాలన కేంద్రం ఉందనిపించింది. అక్కడ లభించిన. ఆధారాలను కార్బన్ డేటింగ్ చేస్తే హరప్పా, -మొహంజదారతో సమాంతరమైన చరిత్ర బయటపడే అవకాశం ఉందని చరిత్రకారులు అంటున్నారు.