
ఏ భాషలో అయినా స్పోర్ట్స్ డ్రామాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులోనూ అమ్మాయిలు ఒక స్పోర్ట్స్ పర్సన్‌లా, స్ట్రాంగ్‌గా కనిపిస్తే.. ఓవర్‌నైట్‌లో స్టార్‌గా గుర్తింపు వచ్చేస్తుంది అనడంలో అతిశయోక్తిలేదు. ‘దంగల్’ సినిమాలో నటించిన ఫాతిమా సనా షేక్ మూవీ జర్నీ కూడా ఇలాగే జరిగింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలుపెట్టి వరుస సినిమాల్లో నటించినా రాని గుర్తింపు దంగల్ సినిమాతో సొంతమైంది.
దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మాయి కెరీర్లో సవాళ్లూ ఉన్నాయి. సక్సెస్ తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. శామ్ బహదూర్ వంటి సినిమాలో ఇందిరాగాంధీ పాత్రలో మెరిసిన ఫాతిమా ప్రస్తుతం ‘మెట్రో.. ఇన్ దినో’ మూవీలో ఒక బ్యూటిఫుల్ రోల్లో కనిపించింది. తన జర్నీలోని ఇంట్రెస్టింగ్ విశేషాలతో ఈ వారం పరిచయం.
ముంబైకి చెందిన నటి ఫాతిమా సనా షేక్.. బాలీవుడ్లో పేరు తెచ్చుకుంది. చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు హిందీ సినిమాల్లో అలరించింది. తొలిసారిగా1997లో ‘చాచి 420’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. 2008లో వచ్చిన ‘తహాన్’ అనే సినిమాలో నటించింది. ఆ సినిమాకు ‘ది జర్మన్ స్టార్ ఆఫ్ ది ఇండియా అవార్డు’ సొంతం చేసుకుంది.
బాలీవుడ్లో ఎన్ని సినిమాలు చేసినా బ్రేక్ రాకపోవడంతో టాలీవుడ్ వైపు మళ్లింది. 2015లో తెలుగులో ‘నువ్వు నేను ఒక్కటవుదాం’ అనే సినిమా చేసింది. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో తిరిగి హిందీ ఇండస్ట్రీకి వెళ్లింది.
హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న సనాకు 2016లో ‘దంగల్’ సినిమాతో బ్రేక్ వచ్చింది. ఆమిర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమాలో ‘గీతా ఫొగట్’ అనే పాత్ర పోషించింది. ఆ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సనా బాలీవుడ్లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ అయింది.
‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’, ‘లూడో’, ‘థార్’, ‘మోడర్న్ లవ్ ముంబై’, ‘ధక్ ధక్’, ‘శామ్ బహదూర్’ వంటి వాటిల్లో నటించింది. ప్రస్తుతం ‘మెట్రో.. ఇన్ దినో’ అనే మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఇండస్ట్రీకి రాకముందు ఫొటోగ్రఫీ నేర్చుకుంది సనా. టీవీ కమర్షియల్స్‌కు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేసింది.
కాన్ఫిడెన్స్ ఇచ్చిన డైరెక్టర్లు
అప్పటివరకు రకరకాల పాత్రలు పోషించిన సనా.. మోడర్న్ లవ్ స్టోరీ ముంబైలో రాత్రాణి రోల్ చేసింది. ఒకరకంగా అది ఆ ఎపిసోడ్‌కి లీడ్ రోల్. ఆ విషయంలో నేను కొంచెం భయపడిన మాట వాస్తవం. కానీ, దాన్నుంచి వెంటనే బయటపడ్డాను కూడా. ఎందుకంటే కొవిడ్ టైంలో అందరం ఎంతో భయపడిపోయాం. కానీ, ఆ భయాల నుంచి నెమ్మదిగా అయినా ఎవరికి వాళ్లు బయటకు వచ్చేశారు.
ఒక పాయింట్లో మిమ్మల్ని మీరు నమ్మాలి. నేను అలానే చేశాను. ఫెయిల్ అవుతానా? అవ్వనీ. కానీ నేను మాత్రం ప్రయత్నిస్తూనే ఉండాలి కదా. ఎన్నాళ్లని భయపడుతూ కూర్చుంటాను. రిలీజ్ అయిన తర్వాత ఆడియెన్స్ నన్ను రిసీవ్ చేసుకున్న విధానం చూసి ఆ పాత్రలో నటించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీలయ్యా.
ఆ డైరెక్టర్ సోనాలితో పాత్ర గురించి చాలా డిస్కస్ చేసేవాళ్లం. ఎన్నో బుక్స్ చదివేవాళ్లం. అయినా చివరికి ఇంటికి వెళ్లగానే సెల్ఫ్ డౌట్ వెంటాడేది. అప్పుడు సోనాలి నాలో కాన్ఫిడెన్స్ పెరిగేలా ఎన్నో విషయాలు చెప్పేది. తనే కాదు.. నేను పని చేసిన డైరెక్టర్లు అంతా నాకు చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. నాలో కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడల్లా ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్లు. ఎందుకంటే నాకు సెల్ఫ్ డౌట్ ఎక్కువ. దాంతో నా చుట్టూ ఉండేవాళ్లు, సెల్ఫ్ డౌట్ ఉండడం మంచిదే. కానీ, అది నీ దారికి అడ్డు కాకూడదు అంటుంటారు.
దంగల్ కోసం..
‘దంగల్’ సినిమాలో ‘గీతా ఫొగట్’ పాత్ర కోసం ఆరు రౌండ్లు ఆడిషన్స్ దాటాల్సి వచ్చింది. రెజ్లింగ్ వీడియోలు చూసి రెజ్లర్స్ నడక, కదలికలు, బాడీ లాంగ్వేజ్ ఒంటబట్టించుకున్నా. అంతేకాదు... రెజ్లర్, ఫిట్నెస్ కోచ్ కృప శంకర్ పటేల్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా. తివారీ, ఆమిర్ ఖాన్‌తో ప్రాక్టీస్ చేశా.
ట్రైనింగ్ టైంలో ఒకసారి ఏం జరిగిందో తెలియదు.. కళ్లు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నా. అప్పుడే అర్థమైంది నాకు ఎపిలెప్సీ ఉందని. ఇప్పుడు ఆ సమస్యను ఎదుర్కోవడం నేర్చుకున్నా. అధిగమించడానికి ట్రై చేస్తున్నా. డైరెక్టర్స్‌కు నా ప్రాబ్లమ్ గురించి చెప్పినప్పుడు వాళ్లు చాలా సపోర్ట్ చేశారు. ఎపిలెప్సీపై అవేర్నెస్ కల్పించడం నా బాధ్యతగా భావించా. సందర్భం వచ్చినప్పుడల్లా దాని గురించి మాట్లాడుతున్నా.
ఈరోజుల్లో..
ప్రస్తుతం జెన్ జెడ్ యూత్ ప్రతి విషయానికి ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారు. కానీ, అలా ప్రతిదానికీ హైరానా పడిపోకూడదు. నెమ్మదిగా ఉండడం నేర్చుకోవాలి. గుండెల నిండా శ్వాస తీసుకుని నిబ్బరంగా ఉండాలి. అన్నీ ఇప్పటికిప్పుడు జరిగిపోవు. లక్ష్యం, సహనం వంటి వాటి మధ్య లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలో మన కల్చరే మనకు నేర్పిస్తుంది. ఎదుటివాళ్లు చెప్పేది వినడం, ఎక్స్‌ప్రెస్ చేయడం ఈ రెండింటి మధ్య కూడా సమన్వయం ఉండాలి. కొన్ని విషయాల నుంచి పక్కకు వైదొలగడం, రిఫ్లెక్ట్ చేయడం, కూర్చుని మీలో మీరు ఆలోచించుకోవడం వంటివి ఎంతో ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంటుంది. ఆ విషయాలను ఇన్‌డైరెక్ట్‌గా ‘మెట్రో.. ఇన్ దినో’లో చెప్పడానికి ప్రయత్నించాం.
కర్మను నమ్ముతా
మా అమ్మ తబస్సుమ్ శ్రీనగర్‌కు చెందిన ముస్లిం. నాన్న విపిన్ శర్మది జమ్మూలోని హిందూ ఫ్యామిలీ. వాళ్లిద్దరూ వేర్వేరు ఆచారాలను ఫాలో అవుతారు. దాంతో మా బ్రదర్ దేవుడ్ని నమ్మడు. ఇక నేను కర్మను నమ్ముతా.