Madharaasi Box Office : రేసుగుర్రంలా దూసుకెళ్తున్న 'మదరాసి' బాక్సాఫీస్ కలెక్షన్స్.. మురుగదాస్ దెబ్బకి బాలీవుడ్ షేక్!

Madharaasi Box Office : రేసుగుర్రంలా దూసుకెళ్తున్న 'మదరాసి' బాక్సాఫీస్ కలెక్షన్స్.. మురుగదాస్ దెబ్బకి బాలీవుడ్ షేక్!

కొంతకాలంగా ఎదురుదెబ్బలు తగిలినా..  ఓ అగ్ర దర్శకుడిగా తన సత్తా ఏంటో మరోసారి నిరూపించారు యాక్షన్ మాంత్రికుడు ఎ.ఆర్ . మురుగుదాస్. తమిళ నటుడు శివకార్తికేయన్ హీరోగా నటించిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ ' మదరాసి' పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడులైన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. తొలి రోజునే రూ. 13 కోట్లను వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది.  శివకార్తికేయన్ కెరీర్‌లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే రోజు విడుదలైన రెండు భారీ బాలీవుడ్ చిత్రాలపై తిరుగులేని విజయం సాధించింది.

పాజిటివ్ టాక్ తో మారిన లెక్కలు.. 
ప్రముఖ సినీ ట్రేడ్ ప్లాట్‌ఫారమ్ సాక్నిల్క్ ప్రకారం.. సాధారణంగా హిందీ సినిమాల మాదిరిగా భారీ ఓపెనింగ్స్ లేకుండా, 'మద్రాసి' మొదట నెమ్మదిగా ప్రారంభమైంది. ఉదయం షోల ఆక్యుపెన్సీ 46 శాతం మాత్రమే ఉంది. విమర్శకుల నుంచి వచ్చిన ప్రశంసలు, ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన పాజిటివ్ టాక్ ఒక సునామీలా మారాయి. రాత్రి షోలకు ఆక్యుపెన్సీ ఏకంగా 77 శాతానికి పెరిగింది. ఇది ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది. మురుగదాస్ యొక్క 'వింటేజ్ గజిని' రోజులను గుర్తుచేసిందని చాలామంది విమర్శకులు కితాబిచ్చారు. ఈ విజయం మురుగదాస్‌కు మరింత ప్రత్యేకమైనదిగా మారింది.

బాక్సాఫీస్ పోరులో 'మదరాసి' దే పై చేయి!
'మద్రాసి' విడుదలైన అదే రోజు టైగర్ ష్రాఫ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం 'బాగీ 4', అలాగే వివేక్ అగ్నిహోత్రి 'ది బెంగాల్ ఫైల్స్' కూడా థియేటర్లలోకి వచ్చాయి.  భారీ బడ్జెట్‌తో వచ్చిన 'బాగీ 4' తొలిరోజు కేవలం రూ.12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. తక్కువ స్క్రీన్‌లలో విడుదలైన 'మదరాసి' రూ.13 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక 'ది బెంగాల్ ఫైల్స్' కేవలం రూ.1 కోటి వసూలు చేసి ఈ పోటీలో వెనకబడింది. ఈ ఫలితం, కేవలం భారీ బడ్జెట్‌లు, యాక్షన్ ఫార్ములాలు కాదు, బలమైన కథ, అద్భుతమైన స్క్రీన్‌ప్లే ఉన్న చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని నిరూపించింది.

సినిమా కథ
'మదరాసి' మూవీ ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో ఫ్రగోలి డెల్యూషన్ అనే అరుదైన మానసిక రుగ్మతతో బాధపడే హీరో, ఉత్తర భారతదేశానికి చెందిన గన్ సిండికేట్‌ను అడ్డుకునే ఒక ఆపరేషన్‌లో ఎలా భాగమయ్యాడు అనేది కథాంశం. ఈ చిత్రంలో శివకార్తికేయన్ తన కామెడీ, రొమాంటిక్ ఇమేజ్‌ను పక్కన పెట్టి, ఒక సీరియస్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నారు. ఆయనతో పాటు, రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్, బిజు మీనన్, విక్రాంత్,  షబీర్ కల్లరక్కల్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. మురుగదాస్ తన గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో, యాక్షన్, డ్రామా, థ్రిల్స్‌ను సమపాళ్లలో కలిపి ప్రేక్షకులను చివరి వరకు సీట్లలోంచి కదలనివ్వకుండా చేశారు. ఈ చిత్రం లాంగ్ రన్‌లో కూడా అద్భుతమైన వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.