హైదరాబాద్‌లో పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిన కారు.. యువతి మృతి

హైదరాబాద్‌లో  పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిన కారు.. యువతి మృతి

హైదరాబాద్‌ లంగర్ హౌస్ దర్గా దగ్గరలో సెప్టెంబర్ 7న ఉదయం తెల్ల వారుజామున  రోడ్డు ప్రమాదం జరిగింది. వినాయక నిమజ్జనం కారణంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న లంగర్ హౌస్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వాహనాన్ని వేగంగా వచ్చిన కియా కార్ వెనుక నుంచి ఢీకొట్టింది. కియా కారులో ఇద్దరు అబ్బాయిలతో పాటు ముగ్గురు అమ్మాయిలు  మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారులో మద్యం సీసాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. 

ఈ ప్రమాదంలో కారులో ఉన్న 20 ఏళ్ల యువతి కశ్వి అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో పోలీస్ వాహనంలోని ముగ్గురు పోలీసులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఢీకొన్న ప్రభావంతో డీఐ వాహనం ముందున్న కోళ్లను తరలించే డీసీఎం ట్రక్‌ను ఢీకొంది. ఈ ఘటనపై లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.