Ghaati Box Office : అనుష్క పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్.. 'ఘాటీ' తొలిరోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

Ghaati Box Office : అనుష్క పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్.. 'ఘాటీ' తొలిరోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా చిత్రం 'ఘాటీ' . సెప్టెంబర్ 5, శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.  ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.  విడుదలైన తొలి రోజు ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.

'మదరాసి' నుంచి  'ఘాటీ' కి గట్టిపోటీ..
ప్రముఖ సినీ ట్రేడ్ ప్లాట్‌ఫారమ్ సాక్నిల్క్ ప్రకారం.. 'ఘాటీ' మొదటి రోజు అన్ని భాషల్లో కలిపి కేవలం రూ.2 కోట్ల నికర వసూళ్లను మాత్రమే సాధించింది. ఉదయం షోలు 21.08% ఆక్యుపెన్సీతో మొదలవగా, సాయంత్రం, రాత్రి షోలకు ఇది కొద్దిగా పెరిగి 28.92%కి చేరింది. అయితే, ఇదే రోజు విడుదలైన శివకార్తికేయన్ 'మదరాసి' చిత్రం తొలిరోజు ఏకంగా రూ.13 కోట్లు వసూలు చేయడంతో, 'ఘాటీ' గట్టి పోటీని ఎదుర్కొన్నట్లయ్యింది. 

ALSO READ : రేసుగుర్రంలా దూసుకెళ్తున్న 'మదరాసి' బాక్సాఫీస్ కలెక్షన్స్..

అంతేకాకుండా అనుష్క గత చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' (2023) తొలిరోజు రూ.4 కోట్లు వసూలు చేయగా, దానితో పోలిస్తే 'ఘాటీ' కలెక్షన్లు తక్కువగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా కీలకమైన శని-, ఆదివారాల్లో ఈ చిత్రం తన జోరును కొనసాగిస్తే రాబోయే వారాల్లో బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రదర్శన కనబరిచే అవకాశం ఉందిని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అనుష్కకు ప్రశంసలు.. కథనానికి విమర్శలు
అయితే 'ఘాటీ' విడుదలైన తర్వాత విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. చాలామంది విశ్లేషకులు చిత్రంలో అనుష్క శెట్టి పోషించిన పాత్ర, ఆమె శక్తివంతమైన నటనను ప్రశంసించారు. ఒక మహిళ శక్తికి, ప్రతిఘటనకు ఆమె ప్రతీకగా నిలిచారని కితాబిచ్చారు. అయితే, సినిమా కథనం నెమ్మదిగా సాగిందని, కొన్ని కీలక సన్నివేశాలు ఆకట్టుకోలేదని విమర్శలు వస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో వాస్తవికతతో కూడిన లొకేషన్లు సినిమాకు సహజత్వాన్ని తీసుకొచ్చాయి. మొదటి భాగం నెమ్మదిగా సాగగా, రెండో భాగంలో వేగం పుంజుకుంది. దర్శకుడు క్రిష్ తన శైలిని కొనసాగిస్తూ, కథానాయిక శీలవతి ప్రయాణాన్ని రావణుడి లంకను నాశనం చేసిన సీతామాతతో పోల్చడం సినిమాకు మరింత లోతును ఇచ్చిందనిపేర్కొన్నారు.

'ఘాటీ' కథాంశం
పరిస్థితుల ప్రభావంతో గంజాయి వ్యాపారంలో చిక్కుకున్న ఒక ధైర్యవంతురాలైన మహిళ కథే 'ఘాటీ'. ఈ సినిమా ప్రమాదకరమైన ప్రపంచంలో ఆమె ఎలా తనను తాను కాపాడుకుందనే నేపథ్యంలో సాగుతుంది. అనుష్కతో పాటు, విక్రమ్ ప్రభు, చైతన్య రావు మాదడి, జగపతి బాబు వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యెదుగురు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం, యూవీ క్రియేషన్స్ సమర్పణలో విడుదలైంది.  

 

మొత్తానికి మిశ్రమ టాక్ సంపాదించుకున్న  'ఘాటీ' రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.