నాపరాయిపై రతనాల పంట

నాపరాయిపై రతనాల పంట

ఓ గిరిజన యువకుడు తోటి గిరిజనుల తలరాత మార్చాడు. అతడి ఒక్క ఐడియా కొన్ని వందల జీవితాల్లో వెలుగు నింపింది. ఆకలికి అలమటించే జీవితాలు ప్రకృతికే సవాలు విసిరి గెలిచాయి. పరుపురాయిపై  చెరువు మట్టి పోసి, ‘‘సేంద్రియ’’ సాగు చేస్తూ ఆకలిని జయించారు ఆ ఏడు గ్రామాల గిరిజన రైతులు.

– సంతోశ్, ఆసిఫాబాద్

అది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండలం. దట్టమైన ఆ అటవీ ప్రాంతంలో అక్కడక్కడ విసిరేసినట్టు కొన్ని గూడేలు ఉన్నాయి. వాటిలో కాస్త జనాభా ఎక్కువగా ఉన్న గూడెం ‘గుండాల’. 

గుండాల గ్రామ సమీపంలో వాడిగూడ, రాజగూడ, గుడివాడ, చిక్లి గూడ (బొజ్జు గూడ ), పునగూడ, ధాబాగూడ, అర్జు గూడ వంటివి ఉన్నాయి. పదిహేను కిలోమీటర్లు రాళ్లు తేలిన దట్టమైన అడవిలో నడిస్తే గాని ఆ ప్రాంతాలకు చేరుకోలేం. దారిలో వాగులు, వంకలు, గుట్టలు దాటాలి. వ్యవసాయం చేద్దామంటే మొత్తం నాపరాయి ఉంది. సాగు చేయడానికి సరైన భూమి కాదు. దాంతో అక్కడి జనం కూలీ పనులకు వెళ్లేవాళ్లు. ఆ గూడేల్లో చదువుకున్నోళ్లు చాలా తక్కువ. అలాంటి చోట పుట్టి పెరిగిన ఓ యువకుడు తన గ్రామానికి మేలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతని ఆలోచన గుండాల గ్రామ దశ దిశను మార్చేసింది.


హైదరాబాద్​లో ఎమ్మెస్సీ, బీఈడీ చదివిన సోయం బొజ్జీరావు సొంత ఊరికి ఏదో ఒక మంచి చేయాలని ఆలోచించాడు. సోయం బొజ్జీరావుకు గిరిజన సహకార సంస్థలో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. కానీ తన మనసంతా గ్రామ అభివృద్ధి పైనే ఉండేది. ఎలాగైనా గ్రామాన్ని అభివృద్ధి చేసి తమ ప్రజల బతుకులు మార్చాలనుకున్నాడు. 

అందుకోసం ఉద్యోగం వదిలేసి వ్యవసాయం వైపు అడుగులు వేశాడు. ఇక్కడ నాపరాయిని ఒక్కో మనిషికి అర ఎకరం నుంచి ఎకరం వరకు పంచి పెట్టాడు. అయితే అక్కడి జనం ఈ భూమిని ఏం చేయాలి? నాపరాళ్లపై వ్యవసాయం ఎలా చేస్తాం? అని అర్థంకాక కొంత అయోమయంలో పడ్డారు. అప్పుడు బొజ్జీరావు వాళ్లకు నాపరాళ్లపై ఎలా వ్యవసాయం చేయాలో నేర్పించాడు. ఊరందరికీ ఓ దారి చూపించాడు.

సోయం బొజ్జీరావు వల్లనే...

బొజ్జీరావు ఎప్పుడూ తోటి గిరిజనుల జీవితాలను మార్చాలని తపించేవాడు. ఈ క్రమంలో పరుపు బండపై వ్యవసాయ చేసేందుకు ప్రయత్నం షురూ చేశాడు. నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగులు, కుంటలు, చెరువు ల నుంచి మట్టిని తీసుకొచ్చి పరుపురాయి పై అడుగు మందం పోశాడు. దానికి పశువుల పేడ కలిపాడు. మొదటగా రెండు మూడు మడుల్లో వ్యవసాయం చేశారు. 

నీటి ఎద్దడిని తట్టుకునే మొండి వరి వంగడాలను తీసుకొచ్చి చల్లారు. తొలి ప్రయత్నం ఫలించింది. గిరిజనులు నెమ్మదిగా బొజ్జీరావును అనుసరించారు. చేతనైనంత విస్తీర్ణాన్ని సాగు భూమిగా మార్చుకున్నారు. ఇప్పుడు సాగవుతున్న విస్తీర్ణం1,218 ఎకరాలు. గతంలో పోడు భూములుగా ఉండేవి. ఇప్పుడు పట్టా భూములుగా మారిపోయాయి. ఇప్పుడు ఏటా వానాకాలం, యాసంగిలో సంప్రదాయ పంటలన్నీ సాగు చేస్తున్నారు. 

►ALSO READ | లోకంలో మనుషులు మూడు రకాలు..అందులో మీరే రకం.?

వరి, మొక్కజొన్న, జొన్న, కంది పంటలతో పాటు కూరగాయలు సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు. బొజ్జీరావు పేరుతో గవర్నమెంట్ గుండాల సమీపంలో చెరువు తవ్వించింది. రెండు చెక్ డ్యాంలు ఏర్పాటు చేసింది. సమీపం నుంచి వెళ్తున్న వాగులపై అడ్డుకట్టలు వేసి నీటిని మళ్లించుకుని సాగు విస్తీర్ణం పెంచుకున్నారు. మైసమ్మ, మచ్చకుంట చెరువులు, బొజ్జీరావు కుంట, మోతిరాం కుంట చెక్ డ్యాంలు, ఎఘాట్ దొల్ల చెక్ డ్యాంలను ప్రధాన నీటి వనరులుగా మార్చుకున్నారు. బతుకు దారి చూపిన బొజ్జీరావు1995లో చనిపోయారు. కానీ ఆయన నింపిన స్ఫూర్తితో ఇప్పటికీ గిరిజనులు అదే నేలపై సేంద్రియ సాగు చేస్తూనే ఉన్నారు. చైతన్యం నింపిన ఆయన విగ్రహం ఏర్పాటు చేసి నిత్యం స్మరించుకుంటున్నారు.

నాపరాయిపై వ్యవసాయం 

నాపరాయిపై వ్యవసాయం చేసేందుకు ముందుగా మట్టి గట్టు వేశాడు. కానీ సాగు చేయడానికి నీరు అందుబాటులో లేకపోవడంతో ఐ.టి.డి.ఎ వారితో మాట్లాడి బోర్లు, రెండు చెరువులు, చెక్ డ్యాంలు అధికారుల సాయంతో నిర్మించుకున్నారు. సేంద్రియ ఎరువులతో సాగు చేయడం షురూ చేశారు. గుండాల గ్రామంలో 1993లోనే ఈ ప్రక్రియ సక్సెస్ ఫుల్ అయింది.

కడుపునిండా తింటున్నాం

మొదట్లో కూలి పని చేసే వాళ్లం. మా ఊర్లో ఎవుసం చేయాలంటే నాపరాళ్లలో తిప్పలు పడేవాళ్లం. రాళ్ల భూమిలో ఎలా పంటలు పండించాలో పాతికేళ్ల క్రితమే బొజ్జీరావు నేర్పించిండు. సోయం బొజ్జీరావు సర్ వల్లనే ఈరోజు కడుపునిండా అన్నం తింటున్నాం. వరిసాగులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందగలుగుతున్నాం. మా ఊర్లోని చాలామంది లాభసాటిగా సాగుచేస్తున్నారు.

- -కోట్నాక శ్రీనివాస్. రైతు