
లోకంలో ఉత్తములు, మధ్యములు, అధములు అని మూడు విధాల మనుషులు ఉంటారు. అందరి హితం కోరేవారు, మంత్రాంగంలోను, నిర్ణయాలు తీసుకోవటంలోను సమర్థత కలిగిన మిత్రులతో చర్చించడం, విద్యాధికులైన బంధువులతో కలసి పనులను ప్రారంభించటం, దైవాన్ని అనుకూలంగా చేసుకోవటానికి ప్రయత్నించటం.. ఈ లక్షణాలు కలవారిని ఉత్తములు అంటారు.
ఒంటరిగానే ఆలోచన చేయటం, ఒంటరిగానే ధర్మాన్ని నిర్ణయించటం.. ఈ లక్షణాలు ఉన్నవారు మధ్యములు. గుణదోషాలను సరిగా నిర్ణయించలేకపోవటం, దైవం మీదే ఆధారపడి ‘చేయవచ్చునులే’ అని పని పట్ల ఉపేక్షించటం... ఈ లక్షణాలు ఉన్నవారు అధములు.
ఇందుకు పంచతంత్రంలోని మూడు చేపల కథ మంచి ఉదాహరణగా నిలుస్తుంది. దీర్ఘదర్శి (ముందుచూపు), ప్రాప్తకాలజ్ఞుడు (సమయానుకూలంగా ఆలోచించడం), దీర్ఘసూత్రుడు (సోమరితనం, ప్రతిదానికి విధిని నమ్ముకోవడం) అని మూడు చేపలు ఉండేవి.
జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి, ఆ ఆపద నుంచి ముందుగానే బయటపడే లక్షణం దీర్ఘదర్శి అనే చేపది. ఆపద సంభవిస్తుండగా, అప్పటికప్పుడు ఆలోచన చేసి, ఆపద నుండి కష్టపడి గట్టెక్కే లక్షణం ప్రాప్తకాలజ్ఞుడు అనే చేపది. ఏ ప్రయత్నం చేయకుండా, పూర్తిగా విధి మీద ఆధారపడి, ఆపదలలోనే చిక్కుకుపోయే లక్షణం దీర్ఘసూత్రుడు అనే చేపది. ఈ మూడు లక్షణాలు పరిశీలిస్తే.. దీర్ఘదర్శనం వల్ల ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ప్రాప్తకాలజ్ఞత వలన ఒక్కోసారి సత్ఫలితం, ఒక్కోసారి దుష్ఫలితం వస్తుంది, ఇక దీర్ఘసూత్రత వల్ల పూర్తిగా ఆపదలలో చిక్కుకుపోవలసిందే... అని తెలుస్తోంది. ఆ మూడు చేపలు నివసించే చెరువులోని నీటిని తీసేస్తున్నారని తెలిసిన మొదటి చేప ముందు చూపుతో ముందుగానే తప్పించుకుంది. పనివారు వచ్చి చెరువులోని నీటిని తీసివేస్తుండగా రెండో చేప తెలివి ప్రదర్శించి తప్పించుకుంది. ఇక మూడవ చేప సోమరితనంతో ఉండటంతో చచ్చిపోయింది. ఇటువంటి కథలు వ్యక్తిత్వ వికాసానికి ఉపయుక్తంగా ఉంటాయి.
పురుషులలో ఉత్తములు, మధ్యములు, అధములు ఉన్నట్లే మంత్రాంగంలోనూ ఉత్తమం, మధ్యమం, అధమం అనే భేదాలు నిత్యం ఉన్నాయి. శాస్త్రం చెప్పిన విధానాన్ని అనుసరించి ఐకమత్యంతో, ఒక ఆలోచనలో స్థిరంగా ఉండే మంత్రాంగాన్ని ఉత్తములు అనుసరిస్తారు.
ఒక ఆలోచన చేయటం ప్రారంభించినప్పుడు... మొదట్లో అభిప్రాయ భేదం ఉన్నప్పటికీ, చివరకు అందరు మంత్రులు చేసే నిర్ణయం ఒకే విధంగా ఉంటే.. ఆ మంత్రాంగ మధ్యములు అనుసరిస్తారు. ఎవరికి వారు వేరు వేరు అభిప్రాయాలతో మాట్లాడుతూ, ఐకమత్యంగా ఉండటంలో ఆసక్తిని చూపించకుండా చేసే మంత్రాంగాన్ని అధములు ఆచరిస్తారు.. అని రామాయణం యుద్ధకాండలో రావణుడు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ, ‘ఉత్తమమైన బుద్ధి గల మీరందరు బాగా ఆలోచించి, చేయవలసిన కార్యాన్ని నిర్ణయించండి. నేను మీ ఆలోచనను అంగీకరించి ఆచరిస్తాను’ అని మంత్రులతో మాట్లాడాడు.
►ALSO READ | యూకేలో ఎనర్జీ డ్రింక్స్ బ్యాన్!
‘‘త్రివిధం పురుష లోకే ఉత్తమాధమ మధ్యమః
తేషామ్ తు సమవేతానామ్ గుణదోషమ్ వదామ్యహమ్’’
(యుద్ధకాండ ఆరవ సర్గ, 6వ శ్లోకం)
వాస్తవానికి ఏది ధర్మమో, ఏది అధర్మమో రావణునికి బాగా తెలుసు. రావణుడు సకల శాస్త్రాలు చదివాడు. చదవడం, మననం, స్మరణం, ఆచరణం... ఇవన్నీ వేరు వేరు అంశాలు. ముందుగా... చదివినదానిని మననం చేసుకోవాలి. మననం చేసుకున్న అంశాన్ని నిరంతరం స్మరించుకోవాలి, అలా స్మరించుకోవటం వలన తప్పనిసరిగా ఆచరించడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు మంచీ చెడుల విచక్షణ తెలుస్తుంది. ఆ విచక్షణ తెలిసినవారు తప్పు చేయలేరు. ఇదీ వాల్మీకి మనకు చెప్పిన అంశం. రావణుడు కేవలం శాస్త్ర పఠనం మాత్రమే చేశాడు. ఎన్నడూ మననం కాని, స్మరణం కాని చేయకపోవటం వల్లే ఆచరించలేకపోయాడు.
హనుమంతుని వెంట నడుస్తూ, ఆయనను దగ్గరగా పరిశీలిస్తే –హనుమంతుడు ఉత్తమమైన మంత్రాంగం గల రాయబారి. అందువల్లే హనుమంతుడిని రావణుడి దగ్గరకు రాయబారిగా పంపారు. హనుమంతుడు కేవలం ఒక రాయబారిగా మాత్రమే కాకుండా, తన ప్రభువుకు హితం చేకూరేలా.. లంకాదహనం చేశాడు. కొందరు రాక్షసులను సంహరించాడు. వారంతా తిరిగి వారి నగరాన్ని నిర్మించుకునే పనిలో నిమగ్నమయ్యేలా చేశాడు.
హనుమంతుడు పరాక్రమమునకు తగిన తన బలమును ప్రదర్శించి, తన ప్రభువైన సుగ్రీవునకు ఒక భృత్యుడు చేయవలసిన గొప్ప కార్యాన్ని సాధించిపెట్టాడు.
కష్టమైన పనిని పూర్తిచేయటం కోసం ప్రభువు ఒక సేవకుడిని నియమిస్తే, ఆ పనిని ఆసక్తితో పూర్తిచేసే సేవకుడిని ఉత్తముడు లేదా శ్రేష్ఠుడు అంటారు. బుద్ధిమంతుడు, సమర్థుడు అయి.. రాజుకి ప్రియమైన పనిని చెప్పినదాని కంటే ఎక్కువ చేసినవాడిని మధ్యముడు అంటారు. బుద్ధిమంతుడు, సమర్థుడు అయి ఉండి కూడా ప్రభువు చెప్పిన పనిని శ్రద్ధగా చేయనివాడిని అధముడు అంటారు.ఇలా సృష్టిలో మూడు రకాల మనుషులు, మూడు రకాల మంత్రాంగాలు, మూడు రకాల దూతలు ఉంటారని రామాయణం చెబుతోంది.
- డా. పురాణపండ వైజయంతి