
టీవీలు, సోషల్ మీడియాల్లో వచ్చే కమర్షియల్ యాడ్స్ చూసి అందులో కనిపించేవన్నీ టేస్ట్ చేయాలనుకుంటుంటారు. మరీ ముఖ్యంగా ఎనర్జీ డ్రింక్స్. వీటికి ఉండే పాపులారిటీ, మార్కెట్ అంతా ఇంతా కాదు. టీనేజర్స్, మిడిల్ ఏజ్ వాళ్లు ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు. అయితే ఇవి పేరుకే ఎనర్జీ డ్రింక్స్ కానీ, వాటిలో పోషకాలు ఏం ఉండవు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా వాటిని తాగడం మానుకోవట్లేదు. ముఖ్యంగా16 ఏండ్ల లోపు పిల్లలు ఎనర్జీ డ్రింక్స్‌కు బాగా అడిక్ట్ అవుతున్నారట. అందుకే యూకే ప్రభుత్వం వాటి మీద బ్యాన్ విధించింది.
వివరాల్లోకి వెళ్తే...
ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని ఎక్స్పర్ట్స్ ఎప్పటినుంచో చెప్తున్నారు. కానీ, దాన్నెవరూ సరిగా పట్టించుకోవట్లేదు. వయసు తేడా లేకుండా ఎనర్జీ డ్రింక్స్‌కు అలవాటుపడుతున్నారు. దీనిపై గట్టి చర్యలు తీసుకోవాలని చాలామంది ఆరోపణలు చేశారు. యూకే ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. 16 ఏండ్ల కంటే తక్కువ వయసు ఉన్న ఎవరికైనా కెఫిన్ ఎక్కువగా ఉండే ఎనర్జీ డ్రింక్స్ అమ్మకూడదని తేల్చి చెప్పేసింది. అవి పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయని అందుకే బ్యాన్ చేస్తున్నట్లు తెలిపింది. యూకే గవర్నమెంట్ డేటా ప్రకారం ప్రతిరోజూ దాదాపు లక్ష మంది పిల్లలు కనీసం ఒక హై – కెఫిన్ ఎనర్జీ డ్రింక్ తాగుతున్నారు. వాళ్లలో 13 నుంచి 16 ఏండ్ల పిల్లలు వారంలో ముగ్గురు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. తద్వారా వాళ్లకు రాత్రుళ్లు సరిగా నిద్ర పట్టడం లేదు. నిద్రపోయినా మధ్యలో మెలకువ రావడం, యాంగ్జైటీ పెరగడం, ఏకాగ్రత తగ్గిపోవడం, చదువు మీద ఆసక్తి లేకపోవడం వంటివి కనిపిస్తున్నాయి.
►ALSO READ | ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస రెడ్డి రాసిన.. నవరసాల పుంజుతోక
అంతేకాదు.. ఈ ఎనర్జీ డ్రింక్స్‌లో ఎక్కువ శాతం చక్కెర ఉండడం వల్ల పిల్లలు ఊబకాయం, దంత క్షయం బారినపడే ప్రమాదం ఉంది. 1990 ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం.. లీటర్‌కు 150 ఎంజీల కెఫిన్ కలిగి ఉన్న డ్రింక్‌లను ఇకపై అమ్మకూడదు. వాటిలో రెడ్ బుల్, మాన్స్టర్, ప్రైమ్ వంటి ఇతర డ్రింక్‌లు కూడా ఉన్నాయి. కోకా కోలా, పెప్సీ, డైట్ కోక్, కాఫీ, టీలకు నిషేధం లేదు. ఎనర్జీ డ్రింక్స్ అమ్మే షాప్స్, రెస్టారెంట్లు, కెఫెలకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది. అంతేకాకుండా వెండింగ్ మిషన్, ఆన్లైన్ పేమెంట్స్ చేసే వీలు లేదు. పెద్ద రిటైలర్లు వాళ్లంతటవాళ్లే 16 ఏండ్ల లోపు పిల్లలకు అమ్మట్లేదు. కానీ, చిన్న స్టోర్లు, ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందరికీ అమ్ముతున్నాయి. దీంతో గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఈ రూల్ పాటించాలని గట్టిగా హెచ్చరించింది. అయితే ఎప్పటినుంచి ఈ రూల్ అమలు అవుతుందో క్లారిటీ లేదు. కానీ, ఈ నిషేధాన్ని ఎలా అమలు చేయాలో హెల్త్ ఎక్స్పర్ట్స్, ఎడ్యుకేషనలిస్ట్లు, రిటైలర్లు, మాన్యుఫాక్చరర్స్, ప్రజల నుంచి ఒపీనియన్స్ సేకరించడానికి 12 వారాల గడువు పెట్టింది.