ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస రెడ్డి రాసిన.. నవరసాల పుంజుతోక

ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస రెడ్డి రాసిన..  నవరసాల పుంజుతోక

 ఫలం ఎంత మాగితే అంత తీపి. ప్రకృతిసిద్ధ సహజత్వ సమయమే ఫలానికి మాధుర్యం. కవిత్వం కూడా అంతే! ఎంత మగ్గితే అంత రమ్యత, అంతే పదును. అలాంటి మాగిన కవిత్వాన్ని‘‘పుంజుతోక’’గా పాఠకుల ముందుంచారు సీనియర్ ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. విద్యార్థిగా, పోలీసు అధికారిగా సుధీర్ఘ ప్రయణంలో తన హృదయ స్పందనలను, ప్రగాఢ భావోద్వేగాలను రాసుకొని, దాచారు. వాటిలో కొన్నిటిని అచ్చువేసేందుకు తిరగరాసి, కొన్నిటిని సంస్కరించినట్టు చెప్పారు. మాగిన కవిత్వం అంటే ఇదే! ఇలాంటి కవిత్వం నవరసాలు పండించకమానదు. 120 కవితల ఈ సంకలనంలో ‘నవ’రసాలు పండించారు. 


వృత్తిలో ముక్కుసూటితనానికి పేరున్న శ్రీనివాసరెడ్డి .. ఈ పుస్తకంలో కూడా ముక్కుసూటి కవిత్వాలను తీసుకొచ్చారు. ప్రకృతి ప్రేమ, సామాజిక స్పృహ, సమాజంలోని రుగ్మతలు, మానవ సంబంధాల గురించి చలించారు. తనదైన వ్యక్తిత్వాన్ని, తాను కట్టుబడి ఉండే విలువలను మొదటి కవిత ‘అందరిలా కాదు.. నేను నాలాగే’ అని తేల్చిచెపుతూ.. వారి కవిత్వం మానవ సంబంధాలు, స్నేహబంధాల వైపు సాగింది. అవసరాలు, పైరవీలు, పరపతి పాకులాటల కోసం కాకుండా సహజ మానవత్వ పరిచయాలను కాంక్షించారు. ఉద్యోగంలో ఉన్నా.. ఆయన ప్రకృతిపై రచయిత దృష్టిని కోల్పోలేదు. ఓ వర్షాకాలం ఉదయం బీచుపల్లి గుట్టపై విశ్రాంతి గృహం నుంచి సూర్యోదయాన్ని వీక్షిస్తూ.. ప్రకృతి అందాన్ని ‘ఉదయం’ అనే కవితలో ఒడిసిపట్టారు. ఏడు దశాబ్దాల భారతంలో మహనుభావులు నిర్దేశించిన ఉద్దేశ్యాలను గుర్తుచేస్తూ.. నేటి భరతభూమి పరిస్థితిని తలుచుకుంటూ ‘భరతావని’ కవితలో దుఖించారు. 

ఉన్నతాధికారుల చమ్చాగిరిమాని, ప్రజల కోసం పని చేయాలని అదే కవిత్వంలో ట్రిగ్గర్ లాగేతే.. అది 33వ కవిత్వం అధికారుల ‘సమావేశం’లో గన్ షాట్ గా పేలింది. ఉన్నవాళ్లు తమ స్వార్థం కోసం దేశాన్ని తాకట్టుపెట్టకపోతే .. నక్సలైట్లు అడవులను విడిచి, జనంలో కలవకుండా ఉండరా? అన్న మరో పార్శ్వపు ఆలోచనను రేకెత్తించారు రచయిత. పని ఏదైనా మానవత్వమే సర్వత్రిక సూత్రం. సున్నితమైన, సమస్యాత్మకమైన సమస్యలను చిన్నపాటి మానవత్వంతో పరిష్కరించవచ్చు. ఒకసారి తల్లిదండ్రులు లేని ఓ పాప కనబడితే ఆమెను చేరదీసి షెల్టర్​ హోమ్​కు పంపిన ఈ అధికారి అక్కడితో డ్యూటీ అయిపోయిందనుకోలేదు. ఆ పాపలాంటి పిల్లలు ఇంకా ఉంటారని చలించి అటువంటి కొందరు పపిప్రాణాలను గవర్నమెంట్ హోమ్ కు చేర్చి మానవత్వంతో ఉద్యోగ బాధ్యత నిరూపించుకున్నారు. ఆ చలనం నుంచి పుట్టిన కవితే ‘ అనాథ పసిపాప.’ సక్రమంగా లేని ఉద్యోగుల పట్ల కఠిన హృదయునిగా ఉన్నా... అభాగ్యుల పట్ల ఆ అధికారి పసి హృదయం ‘అనాథ పసిపాప’ కవిత్వంలో కనిపిస్తుంది. 

►ALSO READ | చదువు మానేసి మష్రూమ్‌‌‌‌ స్పాన్ ..లక్షల్లో సంపాదిస్తూ రైతులకు సాయం..

ఆ హృదయం అందరికీ ఉండాలని కోరుకుంటూ.. ‘దొడ్డ మనసు లేని పెద్దరికమెందుకయ్యా’ అంటూ మరో కవితలో చురకలు అంటించారు. మనుషుల ఏర్పాటు చేసుకున్నదే మతమని, మతం మారుతున్న వారిని ద్రోహులని మనుషులపై మాయదారి నింద వేస్తున్నారని ఛాందసత్వాన్ని ‘మతంమార్పిడి’ కవిత్వంలో నిలదీసిన రచయిత.. ప్రకృతికి మతం, కుల బేధం లేదని .. సూర్యోదయానికి భిన్న రీతులున్నాయా? వర్షించు మేఘానికి లింగవర్ణాలున్నాయా? అంటూ.. ప్రకృతిపై రచయిత విశ్వాసాన్ని , దైవత్వాన్ని ‘దైవం ప్రకృతి’ కవితలో అక్షరీకరించారు. ‘జై’ అనే కవితలో దొంగ దేశభక్తుల భరతంపట్టారు. రక్కసిమూకల వల్ల నిజమైన దేశ ప్రేమికులకు, దేశానికి కలిగిన గాయాలను ఈకవిత్వంలో చార్జీషీట్ లాగా సమాజం ముందు దాఖలు చేశారు. ఇలా.. ‘తన’ నుంచి మొదలై మనుషుల చుట్టూ, ప్రకృతి చుట్టూ విహారం చేస్తూ వెళ్లిన కవిత్వం ఉద్యోగస్వామ్యంలో, సమాజంలో ఉన్న తీరుతెన్నులపై వీరత్వాన్ని , రౌద్రాన్ని ప్రదర్శిస్తూ..ప్రకృతిపై శాంతాన్ని చూపారు, మనుషులపై కరుణను ప్రదర్శించారు. సంకలనంలో కవితలే కాక.. పద్యాలు, గేయాలు , నానీలు పేర్చి కొత్త ఒరవడిని సృష్టించారు కొత్తకోట శ్రీనివాస్​రెడ్డి. అక్కడక్కడా ఇంగ్లిష్ పదాలను, ఇంగ్లీష్ కవిత్వాన్ని పెట్టి పడికట్టు పద్ధతుల బ్యారీకేడ్లను తొలగించారు. కవిత్వం అంచున చివర్లో స్నిప్పెట్స్ పెట్టి కొత్త పద్ధతికి తెరతీశారు . వాటిని గుళికలన్నారు కానీ, నెమళీకల వలె అవి చదువరులను ఆకర్షించీ, ఆలోచింపజేస్తాయి. మతవాదం, కులబేధం, ప్రాంతీయ దురాభిమానం వీటన్నిటికన్నా ప్రమాదకరమైంది కుహానా లౌకికవాదం అని చిన్న స్నిప్పెట్ లో స్వయంప్రకటిత మేధోవాదంపై తన కలాన్ని పాయింట్ బ్లాంక్ లో పెట్టారు. 

 ఈ పుస్తకం కేవలం ఒక ఐపీఎస్ అధికారి అనుభవాల సంకలనం మాత్రమే కాక, ఒక లోతైన చర్చను రేకెత్తిస్తుంది. రచనా శైలి పొందికైన పదజాలంతో నిండింది. పదాల ఎంపికలో నైపుణ్యం, సమాజంలోని సమస్యలను సూటిగా ఎత్తిచూపే విధానం ఈ పుస్తకాన్ని పాఠకులకు ఆకర్షణీయంగా చేస్తుంది. 
– వినోద్​ మామిడాల