అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ.. కుమ్రంభీం జిల్లాలో ముగ్గురు యువకులకు గాయాలు

అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ.. కుమ్రంభీం జిల్లాలో ముగ్గురు యువకులకు గాయాలు

కుమ్రంభీం ఆసిఫాబాద్  జిల్లా సిర్పూర్(టి) మండలం పెద్దబండ గ్రామంలో ఘటన

కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్  జిల్లా సిర్పూర్(టి) మండలం పెద్దబండ గ్రామంలో అర్ధరాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగగా, ముగ్గురు యువకులు గాయాలపాలయ్యారు. గ్రామంలో వినాయకుడి నిమజ్జనం జరుగుతుండగా, దానికి సమీపంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి చివరకు దాడికి దారితీసింది. 

ఈ ఘటనలో రాజు, మధు, చరణ్  గాయాలపాలయ్యారు. ముగ్గురికి పక్కటెముకల దగ్గర బలమైన గాయాలు కావడంతో, వారిని సిర్పూర్(టి) సివిల్  హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై సిర్పూర్(టి) ఎస్సై కమలాకర్ ను సంప్రదించగా, శుక్రవారం అర్ధరాత్రి దాడి జరిగిన మాట వాస్తవమేనని, అయితే దీనిపై ఫిర్యాదు రాలేదని చెప్పారు. వినాయక నిమజ్జనానికి, ఈ ఘటనకు సంబంధం లేదని చెప్పారు.

గద్వాలలో సీసీ యూత్  వీరంగం..

గద్వాల: గద్వాల పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు సీసీ యూత్(చావు, చంపు) సభ్యులు వీరంగం సృష్టించారు. దౌదర్ పల్లి, అంబేద్కర్ నగర్  కాలనీవాసులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సీసీ యూత్ కు చెందిన వ్యక్తులు దౌదర్ పల్లిలోని బెల్ట్  షాప్ కు వెళ్లారు. అక్కడ లిక్కర్​ లేదని చెప్పడంతో మధు అనే వ్యక్తి ఇంటిపై దాడి చేసి, అతడిని కొట్టారు. 

అక్కడి నుంచి అంబేద్కర్ నగర్ కాలనీకి చేరుకొని వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూను తిన్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మాజీ కౌన్సిలర్  మహేశ్, శ్రీనివాసులు, వినయ్  తదితరులపై కత్తులతో దాడి చేశారు. అక్కడ ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గాయపడ్డ వారిని సర్కార్  దవాఖానకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గద్వాల టౌన్  ఎస్సై కల్యాణ్ కుమార్  తెలిపారు.