
తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ మళ్లీ సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైంది. ఇనాళ్ల నిరీక్షణకు దాదాపుగా తెరపడింది. మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ మ్యాజిక్ మొదలు కాబోతోంది . ఎనిమిది సీజన్ల విజయాల తర్వాత, తొమ్మిదో సీజన్‌తో మరింత ఉత్కంఠ, డ్రామా, వినోదాన్ని అందించడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 7, ఆదివారం రాత్రి 7 గంటలకు గ్రాండ్ ప్రీమియర్‌తో ‘బిగ్‌బాస్ తెలుగు 9’ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సీజన్‌కి కూడా కింగ్ నాగార్జున తనదైన శైలిలో హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే, ఈసారి షో నిర్వాహకులు ఒక వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల అంచనాలను మించిపోయేలా రెడీ చేశారు.
కొత్త కాన్సెప్ట్.. సరికొత్త ఆట!
ఈసారి బిగ్‌బాస్ టీమ్ “చదరంగం కాదు.. రణరంగం” అనే థీమ్‌తో ఆటను పూర్తిగా మార్చేసింది. ఈ సీజన్‌లో "డబుల్ హౌస్, డబుల్ డోస్" ఫార్మాట్ ఉండనుంది. ఇది కచ్చితంగా షోలో డ్రామా, ఎమోషన్స్, ఊహించని మలుపులకు దారితీస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సీజన్ 9 గురించి సోషల్ మీడియాలో చర్చ జోరుగా నడుస్తోంది. “కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్” కాన్సెప్ట్‌తో షో టీమ్ ఒక ప్రయోగం చేసింది. ఒక సాధారణ వ్యక్తి సెలబ్రిటీలతో కలిసి ఉండటం, వారికి ఎదురయ్యే సవాళ్లు, అలాగే సెలబ్రిటీలు తమ ఇమేజ్‌ను కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలు.. ఇవన్నీ ప్రేక్షకులను కట్టిపడేసే అంశాలుగా నిలవనున్నాయి. ఈ సీజన్‌లో మొత్తం 15 మంది హౌస్‌మేట్లు ఉండగా, వారిలో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది సామాన్యులు ఉండనున్నారు. కామనర్స్ ఎంపిక కోసం ఇప్పటికే నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’ టాస్క్‌లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
హౌస్‌లోకి వెళ్తున్న కంటెస్టెంట్లు వీరే!
బిగ్‌బాస్ ఎప్పటిలాగే కంటెస్టెంట్ల వివరాలను గోప్యంగా ఉంచినప్పటికీ, సోషల్ మీడియాలో కొన్ని పేర్లు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇందులో సెలబ్రిటీల జాబితాలో ‘బుజ్జిగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంజనా గల్రానీ, నరసింహ నాయుడు వంటి చిత్రాల్లో నటించిన ఆశాశైనీ, జబర్దస్త్ ఫేమ్ ఇమ్మానుయేల్, సింగర్ రాము రాథోడ్, నటులు సుమన్ శెట్టి, భవాణి శంకర్, యాంకర్ రీతూ చౌదరి, అలాగే యూట్యూబర్ అలేఖ్య చిట్టి పచ్చళ్లు రమ్య వంటి ప్రముఖులు ఉన్నారు. వీరితో పాటు తనూజ గౌడ, శ్రష్ఠి వర్మ కూడా ఇందులో భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి.
కామనర్స్ జాబితాలో..
ఇక కామనర్స్ జాబితాలో శ్రీజ దమ్ము, మాస్క్ మ్యాన్ హరీష్, కల్యాణ్ పడాలా, మర్యాద మనీష్, దివ్యా నికితా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. డిమోన్ పవన్ లేదా నాగ ప్రశాంత్ లలో ఒకరు మాత్రమే హౌస్‌లోకి వెళ్లనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ కామనర్ల రాకతో బిగ్ బాస్ హౌస్‌లో ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
ఈ 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' గ్రాండ్ ప్రీమియర్ షో సెప్టెంబర్ 7, ఆదివారం రాత్రి 7 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుంది. అంతేకాకుండా జియో హాట్ స్టార్ లో కూడా అందుబాటులో ఉంటుంది. మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ మ్యాజిక్ మొదలు కాబోతోంది.. సెలబ్రిటీలు, సామాన్యులు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో డబుల్ హౌస్, డబుల్ డోస్, డబుల్ ఎంటర్టైన్మ్మెంట్ అందించడానికి రెడీ అవుతోంది. మరి హౌస్ లోకి ఎవరు ఎంటర్ అవుతారో, అసలు గేమ్ ఎలా మొదలవుతుందో చూడాలి...