
హైదరాబాద్: భాగ్య నగరంలో గణేష్ నిమజ్జనాల వేళ వర్షం మొదలైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కూడా కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లో మోస్తరు వర్షం కురిసింది. బాలానగర్, గాజులరామారం, మియాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాలతో పాటు కుత్బుల్లాపూర్ పరిధిలో పలుచోట్ల వర్షం కురిసింది. ఇక.. గణేష్ నిమజ్జనాలతో సందడిగా ఉన్న ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మాత్రం వర్షం ప్రభావం పెద్దగా లేకపోవడం గమనార్హం.
హైదరాబాద్ సిటీలో ఈ మధ్య తరచూ వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా వేడి ఎక్కువగా ఉండడం వల్ల మధ్యాహ్నం మూడు గంటల తర్వాత భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో ఇలా జరగడానికి కారణం పారిశ్రామికీకరణ, సిటీల విస్తీర్ణం పెరగడం, ఇండస్ట్రియల్ పొల్యూషన్, వెహికల్స్ నుంచి వెలువడే పొగ, వాతావరణంలో వేడిమి, అధిక జనాభా వల్ల కాలుష్యం పెరుగుతుంది. దాంతో భూతాపం పెరిగి వాతావరణంలో మార్పులు వస్తున్నాయి.
బడా గణేష్ శోభాయాత్ర సమయంలో వర్షం ఆటంకం కలిగించకపోవడంతో అంతా ప్రశాంతంగా జరిగింది. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తయిన సంగతి తెలిసిందే. భక్తుల కోలాహలం మధ్య ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలలోపే ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద బడా గణేషుడిని నిమజ్జనం చేశారు. ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైన గణేషుడి శోభయాత్ర మధ్యాహ్నానికి హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంది. మహా గణపతి శోభయాత్రలో వేలాది భక్తులు పాల్గొన్నారు.
ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన ప్రక్రియ మధ్యాహ్నం గం.1.30లకు పూర్తయింది. 69 అడుగుల భారీ గణనాథుడిని వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య డప్పుల మోత, డీజేల సందడితో హుస్సేన్ సాగర్ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శోభాయాత్రను చూసేందుకు వేలాదిగా భక్తులు రోడ్లపైకి రావడంతో హుస్సేస్ సాగర్ రహదారులన్నీ జనంతో నిండిపోయాయి.