ఇండియాలో పరుగులు పెట్టనున్న టెస్లా కార్లు..జూలై 15నుంచి అమ్మకాలు

ఇండియాలో పరుగులు పెట్టనున్న టెస్లా కార్లు..జూలై 15నుంచి అమ్మకాలు

త్వరలో టెస్లా కార్లు ఇండియా రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. భారత్లో టెస్లా కార్ల అమ్మాకానికి అన్ని అనుమతులొచ్చాయి. జూలై 15న టెస్లా తన మొదటి కార్ల షోరూమ్ ను ముంబైలో ప్రారంభిస్తోంది.  మొదట ఎలక్ట్రిక్ సెడాన్  మోడల్ Y కార్లను ఇండియాలో సేల్ చేయనుంది. ఇదిగో వచ్చే.. అదిగో వచ్చే అన్న ఊహాగానాలకు చెక్ పెడూతూ టెస్లా తన కార్ల బిజినెస్ ను ఎట్టకేలకు ఇండియాలో మరో రెండు రోజుల్లో మొదలు పెట్టబోతోంది. 

టెస్లాకు మహారాష్ట్రలో ఆర్టీఓ అనుమతి లభించింది. టెస్లా తన ఎలక్ట్రిక్ కార్ల ప్రదర్శన, టెస్ట్ డ్రైవ్‌లు, అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు మహారాష్ట్రలోని రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (RTO) నుంచి అనుమతులు లభించాయి. ఆంధేరి ఆర్టీఓ (Andheri RTO) ఈ 'ట్రేడ్ సర్టిఫికేట్'ను జారీ చేసింది.

ప్రస్తుతం అధికారికంగా టెస్లా షోరూమ్‌లు లేనప్పటికీ జులై 15 నుంచి ముంబైలో మొదటి షోరూమ్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. టెస్లా తన మొదటి షోరూమ్‌ను ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) లో ప్రారంభించనుంది. దీనికి మహారాష్ట్రలోని RTO నుంచి ఇప్పటికే అవసరమైన అనుమతులు లభించాయి. ముంబై తర్వాత టెస్లా న్యూ ఢిల్లీలోని ఏరోసిటీలో కూడా త్వరలో రెండో షోరూమ్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. 

మోటారు వాహనాల చట్టం ప్రకారం ఈ  ట్రేడ్ సర్టిఫికేట్ ను టెస్లాకు జారీ చేశారు. పబ్లిక్ రోడ్లపై చట్టబద్ధంగా వాహనాలను నడిపేందుకు, అమ్మకానికి ఎగ్జిబిషన్ నిర్వహణకు, టెస్ట్ డ్రైవ్ లకు ఈ ట్రేడ్ సర్టిఫికేట్ తో అనుమతి లభిస్తుంది. ఈ సర్టిఫికేట్ ఐదేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది.

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని మేకర్ మాక్సిటీ బిజినెస్ కాంప్లెక్స్ లో టెస్లా తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించబోతోంది. ఇది టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ గా పనిచేస్తుంది. ముంబై ఎయిర్ పోర్టు సమీపంలో సాకినాకాలోని కుజుపడలోని లోధా లాజిస్టిక్ పార్క్‌లో టెస్లా గోడౌన్ ఏర్పాటు చేశారు. 

ఏ మోడల్ అందుబాటులో ఉంటాయంటే..

టెస్లా మొదట దేశంలో తన ప్రముఖ ఎలక్ట్రిక్ సెడాన్  మోడల్ Y కార్ల అమ్మకానికి పెట్టనున్నట్లు తెలుస్తోంది. టెస్లా తన షాంఘై ఫ్యాక్టరీ నుంచి కొన్ని మోడల్ Y కార్లను ఇప్పటికే ముంబైకి దిగుమతి చేసుకుంది. టెస్లా వ్యాపారాన్ని భారత మార్కెట్‌లో విస్తరించాలని.. రాబోయే నెలల్లో ఇతర మెట్రో నగరాల్లో కూడా విస్తరించాలని యోచిస్తోంది. 

టెస్లా ప్రస్తుతం దిగుమతి చేసుకున్న కార్లను మాత్రమే విక్రయించనుంది. ప్రస్తుతానికి భారత్ లో దిగుమతి అమ్మకాలు తప్పా తయారీ ప్రణాళికలు లేవని భారత ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది.

భారత్ లో టెస్లా ప్రవేశంపై ఊహాగానాలకు తెరదించుతూ.. ప్రపంచంలో వేగంగా అభివృద్ది చెందుతున్న EV మార్కెట్లలో ఒకటైన భారత మార్కెట్లో టెస్లా అధికారిక ఎంట్రీ ఇచ్చింది. ఇది దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న మక్కువను పెంచుతుందని అంచనా వేస్తున్నారు.