ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో తన కస్టమర్ సర్వీస్ లో తీసుకొచ్చిన ఏఐ చాట్ బాట్ పనితీరు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. టెక్నాలజీ పేరుతో మనుషుల ప్రమేయాన్ని పూర్తిగా పక్కన పెట్టడం వల్ల ఎమర్జెన్సీ సమయాల్లో యూజర్లు ఎంతటి ఇబ్బందులు పడుతున్నారో అభిషేక్ ఆనంద్ అనే జర్నలిస్ట్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఒక 'మెడికల్ ఎమర్జెన్సీ' సమయంలో జొమాటో చాట్‌బాట్ స్పందించిన తీరు.. కంపెనీ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ అనుసరిస్తున్న ఏఐ విధానాలపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.
అభిషేక్ ఆనంద్ తీవ్రమైన లోబ్లడ్ షుగర్ సమస్యతో బాధపడుతున్న సమయంలో తక్షణ శక్తి కోసం జొమాటోలో ఫ్రెష్ జ్యూస్ ఆర్డర్ చేశారు. ఆ సమయంలో ఇతర క్విక్ డెలివరీ యాప్స్ అందుబాటులో లేకపోవడంతో జొమాటోను ఆశ్రయించారు. అయితే ఆర్డర్‌లో సమస్య తలెత్తినప్పుడు సాయం కోసం కస్టమర్ కేర్‌ను సంప్రదిస్తే.. అక్కడ కేవలం ఏఐ బాట్ మాత్రమే జవాబు ఇచ్చింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఒక మనిషితో మాట్లాడే అవకాశం ఆ సాఫ్ట్‌వేర్ ఇవ్వలేదట. మీరు ఏం చెప్పినా సరే, అది వినదు.. కేవలం ప్రోగ్రామ్ చేసిన సమాధానాలే ఇస్తుంది అంటూ అభిషేక్ ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు.
WTF! Have Zomato and Deepinder @deepigoyal given all the customer care agents’ jobs to AI?
— Abhishek Anand (@TweetAbhishekA) February 22, 2026
How many people have become unemployed because of this?
Now, if you have any issue with your order on Zomato, no matter what you say, you cannot speak to a human agent. Even if you… pic.twitter.com/neGOx4JLIG
ఈ అంశంపై ఎక్స్ వేదికగా చర్చ జరగగా.. జొమాటో నుండి వచ్చిన ఆటోమేటెడ్ రిప్లై విడ్డూరంగా ఉంది. ముందు మీ ఆర్డర్ ఐడీని మాకు డిఎమ్ చేయండి అంటూ మళ్లీ అదే ఏఐ స్పందించింది. దీంతో విసుగు చెందిన అభిషేక్ నువ్వు ఆడవా? మగవా? నీ పేరేంటి? అని ప్రశ్నించగా.. దానికి కూడా ఏఐ ఏజెంటే బదులిచ్చింది. కంపెనీ లీడర్‌షిప్ కూడా ఏ పోస్టులకు సమాధానం ఇవ్వాలో నిర్ణయించుకోవడానికి ఏఐనే వాడుతోందేమో అంటూ ఎద్దేవా చేశారు. ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య మాత్రమే కాదని.. టెక్నాలజీపై అతిగా ఆధారపడుతున్న ప్రతి ప్లాట్‌ఫారమ్‌లోనూ వినియోగదారులు ఎదుర్కొంటున్న నరకం అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒకవేళ ఫుడ్ తిన్న తర్వాత అలర్జీ వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. ఈ చాట్‌బాట్ వచ్చి మీకు ఒక కూపన్ కోడ్ ఆఫర్ చేస్తుందేమో అంటూ ఒక యూజర్ వ్యంగ్యంగా విమర్శించారు. ఏఐ వర్క్ ఫ్లోను ఓవర్‌రైడ్ చేసే ప్రాంప్ట్‌లను పదే పదే పేస్ట్ చేస్తేనే హ్యూమన్ ఏజెంట్ లైన్లోకి వస్తారని సలహాలు ఇస్తున్నారు. సర్వీస్ ఛార్జీలు, డెలివరీ ఫీజుల పేరుతో భారీగా వసూలు చేస్తున్న కంపెనీలు.. కనీస మానవ సహాయాన్ని అందించడంలో విఫలమవ్వడం బాధ్యతారాహిత్యమని వినియోగదారులు మండిపడుతున్నారు. ఏఐ మెరుగుపడవచ్చు కానీ.. మనిషి ప్రాణంతో ముడిపడిన ఎమర్జెన్సీ పరిస్థితిలో అది ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదని కొందరు యూజర్లు సూచిస్తున్నారు. ఏఐ రాకతో ఎంత మంది ఉద్యోగాలు పోతున్నాయో ఇది నిరూపిస్తోందని మరొకరు అభిప్రాయపడ్డారు. మనిషి చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నా ఫీలింగ్స్ లేని ఏఐ తనకు ఇచ్చిన కోడింగ్ ప్రకారమే జవాబులు ఇస్తుందని.. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారొచ్చని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
