కోట శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు..

కోట శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు..

అనారోగ్య సమస్యలతో ఫిలింనగర్​లోని నివాసంలో తుదిశ్వాస

జూబ్లీహిల్స్‌‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు
ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌‌ సహా సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం 
‘ప్రాణం ఖరీదు’ చిత్రంతోసినీరంగ ప్రవేశం
తమిళ, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లోనూ నటన
2015లో పద్మశ్రీ, కెరీర్​లో 9 నంది అవార్డులు సొంతం

హైదరాబాద్, వెలుగు: విలక్షణ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిలింనగర్‌‌‌‌లోని నివాసంలో  తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు. సాయంత్రం జూబ్లీహిల్స్‌‌లోని మహాప్రస్థానంలో కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు జరిగాయి. ఫిలింనగర్‌‌లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర నిర్వహించారు.  కుటుంబసభ్యుల సమక్షంలో పెద్ద మనుమడు శ్రీనివాస్‌‌ అంతిమ సంస్కారాలు చేశారు.  సినీ ప్రముఖులు, అభిమానులు, కుటుంబ సభ్యులు కోట శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు పలికారు.

కోట శ్రీనివాసరావు 1942 జులై 10న ఏపీలోని కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించారు. 1968లో రుక్మిణితో వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్‌‌‌‌  2010 జూన్‌‌‌‌ 21న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సినిమాల్లోకి రాక ముందు కోట శ్రీనివాసరావు స్టేట్‌‌‌‌ బ్యాంకులో పనిచేశారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’తో సినీరంగంలోకి ఆయన అడుగుపెట్టారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. మొత్తం 750కి పైగా చిత్రాల్లో యాక్ట్​ చేశారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. 2015లో పద్మశ్రీ పురస్కారంతో కేంద్రం ఆయనను సత్కరించింది. కోట శ్రీనివాసరావు తన నట జీవితంలో తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్నారు. 1999-–2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు.  

ప్రముఖుల సంతాపం..

కోట శ్రీనివాసరావు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణం బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు.  నటనతో ఆయన  ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతారని, సామాజిక సేవలోనూ ముందుండి పేదల భవిష్యత్తు కోసం కృషి చేశారని  ఎక్స్ వేదికగా గుర్తుచేశారు.  కోట శ్రీనివాసరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిది అని, ఆయన పోషించిన విభిన్న పాత్రలతో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని ట్వీట్​ చేశారు.  కోట శ్రీనివాసరావు భౌతికకాయానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి నివాళి అర్పించారు. 1999లో తామిద్దరం ఎమ్మెల్యేలుగా పనిచేశామని, ఎప్పుడు ఎదురైనా ఆప్యాయంగా పలకరించేవారని  గుర్తు చేసుకున్నారు. కోట శ్రీనివాసరావు మృతికి ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్​కల్యాణ్, పీసీసీ చీఫ్​మహేశ్​కుమార్​గౌడ్, బీఆర్ఎస్​చీఫ్​ కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌‌‌‌రావు, కేటీఆర్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సీనియర్ లీడర్ బండారు దత్తాత్రేయ,  బీజేపీ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు సంతాపం తెలిపారు. కాగా, కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని ప్రముఖ నటుడు చిరంజీవి సందర్శించి, నివాళి అర్పించారు. తమ ఇద్దరి నట ప్రస్థానం ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతోనే మొదలైందని గుర్తు చేసుకున్నారు.  ఆయన మరణం వారి కుటుంబానికే కాదు సినీ పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు.

కోట శ్రీనివాస్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం

న్యూ ఢిల్లీ, వెలుగు: ప్రముఖ నటుడు కోట శ్రీనివాస్‌‌‌‌ రావు మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటని ఆదివారం ‘ఎక్స్‌‌‌‌’లో పేర్కొన్నారు. ‘‘కోట శ్రీనివాస్‌‌‌‌ రావు మరణం బాధాకరం. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన నటన, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ముందుంజలో ఉన్నారు. పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు’’ అని కొనియాడారు. కుటుంబ సభ్యులు, అభిమానులకు మోదీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.