
- కార్డుల ప్రింటింగ్ పూర్తికాగానే జిల్లాల్లో పంపిణీ
- నిర్మల్లో 46 వేలు, మంచిర్యాల 30 వేలు, ఆదిలాబాద్లో 32 వేలు, ఆసిఫాబాద్లో 22 వేల అప్లికేషన్లు
మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. దశాబ్ద కాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పేదలకు త్వరలోనే రేషన్ కార్డులు అందనున్నాయి. ఈనెల 14 నుంచి కొత్త కార్డులు జారీ చేస్తామని సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 14న సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. కొత్త కార్డుల ప్రింటింగ్ పూర్తికాగానే జిల్లాల వారీగా పంపిణీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు స్పీడప్ చేసిందని పేర్కొన్నారు.
పదేండ్లుగా ఎదురుచూపులు
ప్రజలు గత పదేండ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలుమార్లు కార్డులు అందజేస్తామని ప్రకటించినప్పటికీ ఆచరణలో విఫలమయ్యారు. అప్పట్లోనే వేల సంఖ్యలో అప్లై చేసుకోగా.. 2021–22లో పరిమిత సంఖ్యలో కొత్త కార్డులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అప్పటినుంచి వేలాది మంది పేదలు కార్డుల కోసం రెవెన్యూ ఆఫీస్ల చుట్టూ తిరుగుతున్నారు.
మాట నిలుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు గత సంవత్సరం ప్రజా పాలనలో పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ ఏడాది మరోసారి అవకాశం ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. కొత్త కార్డులతో పాటు కొత్తగా కుటుంబ సభ్యులను కార్డుల్లో చేర్చేందుకు వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. రేషన్ కార్డులో కొత్త సభ్యుల నమోదు ప్రక్రియ ఏప్రిల్ నుంచే కొనసాగుతోంది. ఇది నిరంతర ప్రక్రియ అని అధికారులు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా నిర్మల్లో 46,586 అప్లికేషన్లు వచ్చాయి. మూడు దశల్లో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి 41819 దరఖాస్తులకు అప్రూవల్ఇచ్చారు. వివిధ కారణాలతో అనర్హులుగా గుర్తించిన 2473 అప్లికేషన్లను అధికారులు రిజెక్ట్ చేశారు. ఇంకా 2294 అప్లికేషన్లను వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. మంచిర్యాల జిల్లాలో 30,577 అప్లికేషన్లు రాగా 20,391 దరఖాస్తులకు అప్రూవల్ ఇచ్చారు. 1,030 అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి.
9,156 అప్లికేషన్లను వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 32,216 అప్లికేషన్లు రాగా... 24,730 అప్రూవల్ అయ్యాయి. 5,465 అప్లికేషన్లు రిజెక్ట్ కాగా 2,021 పెండింగ్ ఉన్నాయి. ఆసిఫాబాద్జిల్లాలో 22630 అప్లికేషన్లు రాగా, 14398 అప్రూవల్అయ్యాయి. 4319 పెండింగ్లో ఉండగా 1348 అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. ఈ ప్రక్రియ పూర్తికాగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉంది.
జిల్లా అప్లికేషన్లు అప్రూవ్ అయినవి పెండింగ్ రిజెక్ట్ అయినవి
నిర్మల్ 46,586 41819 2294 2473
మంచిర్యాల 30,577 20,391 9,156 1,030
ఆదిలాబాద్ 32,216 24,730 2,021 5,465
ఆసిఫాబాద్ 22630 14398 4319 1348