ధరణి పోర్టల్​తో సర్కార్​ వెనకేసుకుంది వెయ్యి కోట్లు

ధరణి పోర్టల్​తో సర్కార్​ వెనకేసుకుంది వెయ్యి కోట్లు
  • పోర్టల్ వల్ల వచ్చిన సమస్యలకూ రైతులపైనే భారం 
  • సమస్యల పరిష్కారం అటుంచి.. ధరణిని ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రభుత్వం 
  • మ్యుటేషన్లు, తప్పుల సవరణకు, ఇతర పనులకు పైసల వసూలు 
  • అప్లికేషన్ల ఫీజుల పేరుతోనూ దండుకుంటున్న సర్కార్ 

 

హైదరాబాద్, వెలుగు:  ధరణి పోర్టల్ తో భూసమస్యల పరిష్కారాన్ని పక్కన పెట్టిన రాష్ట్ర సర్కార్.. దానిని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నది. ప్రతి దానికి రైతుల నుంచి చార్జీలు వసూలు చేస్తూ ప్రభుత్వం కోట్ల రూపాయలు దండుకుంటున్నది. రిజిస్ర్టేషన్ల చార్జీల దగ్గర నుంచి అనుకోకుండా పడిన తప్పుల వరకూ ప్రతిదానికి ఎంతో కొంత చెల్లించేలా ధరణి పోర్టల్​ను మార్చింది. ఒకవైపు కుప్పలు, తెప్పలుగా పేరుకుపోతున్న భూ సమస్యలు అలాగే ఉండిపోతుండగా.. ప్రభుత్వం రాబడి తగ్గకుండా చూసుకుంటోంది. ధరణిని ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ. 1000 కోట్లను ప్రభుత్వం తన ఖాతాలో వేసుకున్నది. దాదాపు రెండేండ్లలోనే అన్ని రకాలుగా కలిపి ఈ ఆదాయం వచ్చింది. అప్లికేషన్ల చార్జీల దగ్గర నుంచి ప్రతిదానికి ధరణిలో రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వెళ్లేలా ఫీజులు ఉన్నాయి. ధరణిలో సక్సెషన్, మార్ట్​గేజ్, నాలా, పెండింగ్ మ్యుటేషన్లు, జీపీఏ, అగ్రిమెంట్​సేల్ కమ్​ జీపీఏ, లీజు వంటి ట్రాన్సా​క్షన్ల పేరుతో సొమ్ము చేసుకుంటున్నది. మరోవైపు సేల్స్, గిఫ్ట్ డీడ్​వంటి రిజిస్ర్టేషన్ల చార్జీలతోనూ రూ.3,120 కోట్ల ఆదాయం సమకూర్చుకున్నది. సేల్, గిఫ్ట్, మార్ట్​గేజ్​లతో ప్రభుత్వానికి వచ్చేది రెగ్యులర్ ఆదాయం. కానీ ధరణి పోర్టల్ రావడంతో తలెత్తిన సమస్యలు, తప్పులతో వేనకేసుకున్న ఆదాయాన్ని కూడా ప్రభుత్వం రెగ్యులర్ ఆదాయంగానే చూపుతున్నది.  

రూ. 150తో అయ్యే పనులకు రూ. 2,500  
ధరణి రాక ముందు సబ్ రిజిస్ర్టార్ ఆఫీస్​లోనే వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్ నడిచేది. అప్పుడు వాటితో వచ్చే ఆదాయం నెలకు రూ.30 కోట్లలోపే ఉండేదని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇప్పుడు అది ఏకంగా నెలకు యావరేజ్​గా రూ.190 కోట్లకు చేరింది.  రైతు చనిపోతే  వారసులకు భూమిని సక్సెషన్​ (ఫౌతి) చేసేందుకు ధరణి రాకముందు ఎలాంటి ఫీజు లేదు. కానీ ఇప్పుడు ఎకరాకు రూ.2,500 వరకు ప్రభుత్వం వసూలు చేస్తోంది. పట్టా పాస్ బుక్ కు ఇంకో రూ.300 తీసుకుంటున్నది. మ్యుటేషన్​కు కూడా అంతే చార్జీని రాష్ట్ర సర్కార్​ తీసుకుంటున్నది. అప్పట్లో మ్యుటేషన్ కేవలం రూ.150 కట్టి మీసేవలో దరఖాస్తు చేసుకుంటే పూర్తి అయితుండే.  ధరణి రాకముందు రిజిస్ర్టేషన్ అయిన డాక్యుమెంట్లకు పెండింగ్ మ్యుటేషన్ల కోసం కూడా అంతే చార్జీలు తీసుకుంటున్నారు. కేవలం సక్సెషన్లు, పెండింగ్​మ్యుటేషన్లు, కొత్త మాడ్యుల్స్​తెచ్చి వాటికి అప్లికేషన్ల ఫీజులు, చార్జీలు ఇతరత్రా అన్ని కలిపి ఏకంగా రూ. వెయ్యి  కోట్ల మేర సర్కారు వసూలు చేసింది. నామమాత్ర ఖర్చులతో పూర్తి కావాల్సిన ఈ పనులకు ఇలా కోట్లు వసూలు చేస్తున్నది. ధరణి వచ్చాక ఇప్పటి వరకు1.95 లక్షల సక్సెషన్లు, 2.38 లక్షల పెండింగ్​మ్యుటేషన్లు పూర్తయ్యాయి. ఇతర గ్రీవియెన్స్ అప్లికేషన్లు 5 లక్షల వరకు క్లియర్ అయ్యాయి. ఇంకా సగానికి పైగా పెండింగ్​లో ఉన్నాయి. వాటితోనూ ప్రభుత్వానికి డబ్బు రానుంది.

అన్నీ కలిపి 6  నెలల్లోనే  రూ.1,134 కోట్లు 
రాష్ట్ర సర్కార్ 2020 అక్టోబర్ లో ధరణిని అందుబాటులోకి తెచ్చింది. ధరణి వచ్చి రెండేళ్లు అవుతోంది. ఈ రెండేండ్లలో రెండు సార్లు  భూముల విలువలు సవరించడంతో పాటు రిజిస్ర్టేషన్​చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఆ సందర్భంగా ప్రభుత్వం రెండు రోజుల పాటు ధరణి పోర్టల్ ను ఆపేసింది. ఆదాయం రాబట్టుకునేందుకు పోర్టల్ సర్వర్​ను ఆపిన సర్కార్​ సమస్యల పరిష్కారానికి మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఇక ఈ ఏడాది ఏప్రిల్​ నెలలో రూ.192.13 కోట్లు అగ్రికల్చర్ ధరణి రిజిస్ర్టేషన్లతో వచ్చింది. ఆ తరువాత మే నెలలో రూ.205.84 కోట్లు, జూన్​లో రూ.214.85 కోట్లు, జులై లో రూ.197.88 కోట్లు, ఆగస్టులో రూ.143.41 కోట్లు, సెప్టెంబర్​లో రూ.180.01 కోట్లు ఆదాయం వచ్చింది. ప్రతినెలలో యావరేజ్​గా 66 వేల అగ్రికల్చర్​ డాక్యుమెంట్లు రిజిస్ర్టేషన్ చేస్తున్నారు.

తప్పులు సవరించేందుకూ పైసలే 
ధరణిలో నమోదైన తప్పులను సవరించేందుకు కూడా కొత్త మాడ్యుల్స్ తెచ్చి అప్లికేషన్లతో పేరుతో ఒక్కోదానికి సర్వీస్ చార్జీలతో కలిపి ప్రభుత్వం రూ.1,011 చొప్పున వసూలు చేస్తోంది. పాస్ బుక్ లో పేరు తప్పుగా పడితే మార్చుకోవడం, నేచర్ ఆఫ్ ల్యాండ్, క్లాస్లిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ లో ఏమైనా మార్పులు, భూమి రకంలో మార్పులు, భూవిస్తీర్ణంలో హెచ్చుతగ్గులు ఉంటే సవరించడం, ఏవైనా సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్ మిస్సయితే చేర్చడం, నోషనల్ ఖాతా నుంచి పట్టా భూమిగా మార్చడం, భూమి అనుభవం(ఎంజాయ్మెంట్)లో మార్పుల వంటి వాటికి ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్​నుంచి మాడ్యూళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో దేనికి అప్లయ్​ చేసుకున్నా రూ. వెయ్యి తీసుకుంటున్నారు. అప్లికేషన్ల ఫీజుతోనే రూ.15 కోట్ల పైనే వసూలు చేసినట్లు తెలిసింది. వివిధ రకాలుగా ధరణికి వచ్చిన అప్లికేషన్ల సంఖ్య కూడా10 లక్షలు దాటింది.