పోడు పట్టాల మంజూరుకు అటవీ హక్కుల కమిటీలు

పోడు పట్టాల మంజూరుకు అటవీ హక్కుల కమిటీలు
  • నేతృత్వం వహించనున్న కలెక్టర్లు
  • ప్యానెల్​లో ఫారెస్ట్, గిరిజన శాఖ అధికారులు
  • కమిటీ సిఫార్సుల మేరకే పట్టాల పంపిణీ
  • ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రులు సీతక్క, సురేఖ రివ్యూ

హైదరాబాద్, వెలుగు : పెండింగ్ లో ఉన్న పోడు పట్టాలకు సంబంధించిన దరఖాస్తులు పరిష్కరించేందుకు కలెక్టర్ల నేతృత్వంలో అటవీ హక్కుల కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్యానెల్​లో ఫారెస్ట్, గిరిజన శాఖ అధికారులు, స్థానిక ప్రజలు ఉంటారు. ఈ కమిటీల సిఫార్సులకు అనుగుణంగా కొత్తగా పోడు పట్టాలు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు మంత్రులు సీతక్క, కొండా సురేఖ శనివారం సెక్రటేరియెట్‌‌ నుంచి ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. ‘‘క్షేత్రస్థాయిలో పర్యటించి పెండింగ్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలి. అర్హులకు పోడు పట్టాలివ్వాలి.

అనర్హులకు సమస్య ఏంటో వివరించి దరఖాస్తులు క్లియర్ చేయాలి. వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అటవీ, గిరిజన శాఖలు సమన్వయంతో పని చేయాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీలు, అటవీ శాఖ సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలి. అడవులు నరకకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి’’అని సీతక్క అన్నారు. అడవుల్లో పండ్ల మొక్కలు పెంచి స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు.

అడవుల నరికివేతకు అడవి బిడ్డలే కారణమన్న అభిప్రాయాన్ని మార్చాలని కోరారు. అడవి బిడ్డలు ఉన్న చోటే.. అడవులు భద్రంగా ఉంటాయన్నారు. ఏజెన్సీ ఏరియాల్లో రహదారుల నిర్మాణం, విద్యుత్ లైన్లు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. అడవులను కాపాడుకుంటూనే గిరిజనుల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. 

లోతుగా అధ్యయనం చేయాలి : కొండా సురేఖ

పోడు భూముల సమస్య పరిష్కారానికి లోతుగా అధ్యయనం చేయాలని అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా గైడ్​లైన్స్ రూపొందించాలని సూచించారు. ‘‘పోడు భూములు ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి..? ఎంత మందికి పోడు పట్టాల పంపిణీ జరిగింది? పట్టాలు పొందిన వారిలో అనర్హులు ఎవరైనా ఉన్నారా? వచ్చిన దరఖాస్తులు ఎన్ని? వంటి అంశాలపై కలెక్టర్లు నివేదిక తయారు చేయాలి’’అని కొండా సురేఖ అన్నారు. ఇప్పటి దాకా పంపిణీ చేసిన పోడు భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇండివిడ్యువల్ ఫారెస్ట్ రైట్ కింద 6,51,822 దరఖాస్తులు వచ్చాయి. 2,30,735 మంది పట్టాదారులకు 6,69,676 ఎకరాల పోడు భూమి పంపిణీ ప్రక్రియను పూర్తయింది. కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ కింద 3,427 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 721 దరఖాస్తుదారులకు పట్టాలు అందించారు. కొన్ని కారణాలతో 1,024 అప్లికేషన్లను పెండింగ్ లో పెట్టినట్లు మంత్రి సురేఖకు అధికారులు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్​లో పలువురు ఎమ్మెల్యేలు, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ పాల్గొన్నారు.