హైదరాబాద్ : ప్రభుత్వానికి చర్చలు జరిపే ఉద్దేశం లేదన్నారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. శనివారం జరగాల్సిన ఆర్టీసీ జేఏసీతో యాజమాన్యం చర్చలు విఫలం అయ్యాయి. ఈ సందర్భంగా మాట్లాడారు జేఏసీ నేతలు. చర్చలకు పిలిచి సెల్ ఫోన్లు కూడా లాక్కోవడం అన్యాయం అన్నారు. భారీ బందోబస్తుతో చర్చలకు తీసుకెళ్లారన్నారని.. 26 డిమాండ్లను పరిష్కరించాలని తాము పట్టుబట్టామని.. కానీ ప్రభుత్వం 21 డిమాండ్లపైనే చర్చలు జరుపుతామన్నారని తెలిపారు. దీంతో తాము సమావేశం నుంచి మధ్యలోనే బయటికి వచ్చామని తెలిపారు.
ప్రభుత్వానికి చర్చలు జరిపే ఉద్దేశంలేదని.. బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేశారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎజెండాపై చర్చలు జరుపాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. అన్నీ రికార్డ్ చేశారని..మా వాళ్లతో ఫోన్లో మాట్లాడుతామన్నా వినలేదన్నారు. మళ్లీ చర్చలకు పిలిచినా మేం రెడీ అన్నారు. ఆర్టీసీ చరిత్రలో నిర్భంద చర్చలు చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నారు. లోపలికి వెళ్లేటప్పుడు భయంవేసిందని చెప్పారు. బయటికి వెళ్లొద్దంటూ ఒత్తిడి చేశారని..కోర్టు ఆదేశాల మేరకే చర్చలకు పిలిచారు తప్ప 26 డిమాండ్లను పక్కకు పెట్టారన్నారు. ప్రభుత్వం 26 డిమాండ్లపై చర్చించేంతవరకు సమ్మె కొనసాగుతుందని తెలిపింది RTC JAC.
