
హైదరాబాద్, వెలుగు: హాస్టళ్లలో చదివే పిల్లల తిండి తిప్పలను సర్కారు గాలికొదిలేసింది. నిరుపేద చిన్నారులకు బుక్కెడు బువ్వ పెట్టేందుకు ఇవ్వాల్సిన బిల్లులను ఆపేసింది. మూడు నెలలుగా పలు జిల్లాల్లో హాస్టళ్లకు డైట్ బిల్లులివ్వకుండా పెండింగ్‌లో పెట్టింది. దీంతో సరుకులు సప్లయ్ చేసే కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. గత్యంతరం లేకపోవటంతో కూరగాయలు, సరుకులు కొనేందుకు వార్డెన్లు అప్పుల పాలవుతున్నారు. పిల్లలకు అన్నం పెట్టేందుకు లక్షలాది రూపాయలు అప్పులు చేసి… మిత్తీల భారంతో జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. వార్డెన్లు పట్టించుకోని చోట అన్నం, పప్పు నీళ్లనే.. వడ్డించి పిల్లల కడుపులను మాడుస్తున్నారు. డైట్ ఛార్జీలతో పాటు రెండు నెలలకు సంబంధించి కాస్మోటిక్ చార్జీలను కూడా ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదు. దీంతో పిల్లలు చుట్టుపక్కల ఉన్న కిరాణా షాపుల్లో ఉద్దెర పెట్టి తమకు అత్యవసరమైన సబ్బులు, పేస్ట్, పౌడర్ కొనుక్కుంటున్నారు. తమ తల్లిదండ్రులు వచ్చినప్పుడు డబ్బులు కడుతామని బతిమిలాడుకుంటున్నారు.
కోట్లలో బకాయిలు…
ప్రభుత్వం నెలానెలా డైట్ బిల్లులను ఇవ్వకపోవడంతో కోట్లాది రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. ఫస్ట్ క్వార్టర్‌లో కొన్ని నిధులను విడుదల చేసినా, అవి గతేడాది బకాయిలకే సరిపోయాయి. ప్రతినెలా ప్రీ మెట్రిక్ హాస్టల్స్‌కు సుమారు రూ.25 కోట్లు, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్‌కు రూ.7 కోట్లు అందించాలి. ఇప్పటికీ కొన్ని హాస్టళ్లకు మార్చి, ఏప్రిల్ బిల్లులు కూడా రాలేదు. గిరిజన సంక్షేమ శాఖ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) ద్వారా సరుకులను సరఫరా చేయిస్తున్నా, అక్కడ కూడా సకాలంలో బిల్లులు చెల్లించడంలేదు. జీసీసీకి దాదాపు రూ.40కోట్ల వరకు బకాయి పడింది. రాష్ట్రమంతటా రూ.100కోట్ల వరకూ డైట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కొంత మొత్తంలో నిధులు విడుదల చేశామనీ, జిల్లా ట్రెజరీల్లో ఆగి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.గడిచిన మూడు, నాలుగు నెలలుగా సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన అన్ని రకాల బిల్లులనూ సర్కారు పెండింగ్‌లో పెట్టింది. సివిల్ సప్లై శాఖ నుంచి బియ్యం సరఫరా చేసి మిగిలిన సరుకులను పట్టించుకోలేదు. ఫలితంగా పిల్లలను పస్తులుంచలేక ఉప్పు పప్పులు సహా అన్ని సరుకులను వార్డెన్లు కొనుక్కోవాల్సి వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొందరు వార్డెన్లు ఇప్పటికే రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ అప్పులు చేసి పిల్లలకు అన్నం పెడుతున్నారు. జిల్లాల్లో రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలు అప్పులు చేసిన వార్డెన్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
2.75 లక్షల మంది విద్యార్థులు
రాష్ర్టంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ శాఖల పరిధిలో 1,311 ప్రీమెట్రిక్ హాస్టల్స్ ఉండగా, పోస్టు మెట్రిక్ హాస్టల్స్ 642, ఆశ్రమ పాఠశాలలు 319 ఉన్నాయి. వీటిలో దాదాపు 2.75 లక్షల మంది స్టూడెంట్లున్నారు. ప్రీ మెట్రిక్ హాస్టల్స్‌లో మూడు నుంచి ఏడో తరగతి వరకూ చదివే స్టూడెంట్లకు నెలకు రూ.950 చొప్పున, 8వ తరగతి నుంచి పదో తరగతి స్టూడెంట్లకు రూ.1050 చొప్పున ప్రభుత్వం మెస్‌చార్జీలు అందిస్తోంది. పోస్ట్ మెట్రిక్ హాస్టల్ స్టూడెంట్లకు రూ.1500 చొప్పున ఇస్తోంది. అన్ని హాస్టల్స్‌కు బియ్యాన్ని ఒక రూపాయికే అందిస్తుండగా, కూరగాయలు, పండ్లు, గుడ్లు, పప్పులు, ఉప్పులు, ఇతర సరుకుల సరఫరాను అయా శాఖలు ఆఫీసర్లు ఏటా టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తోంది. కొన్ని నెలలుగా బిల్లులు రాకపోవడంతో విసుగెత్తిన కాంట్రాక్టర్లు సరుకుల సప్లయ్ అపేయటంతో ఈ సమస్య తలెత్తింది.
కాస్మొటిక్ చార్జీలూ పెండింగ్‌లోనే..
ప్రీమెట్రిక్ హాస్టల్స్‌లో చదివే విద్యార్థులకు నెలనెలా కాస్మొటిక్, హేయిర్ కటింగ్, నాప్‌కిన్ చార్జీలను అందించాల్సి ఉంది. అబ్బాయిలకు కాస్మొటిక్‌చార్జీల కింద రూ.50, కటింగ్ చార్జీల కింద రూ.12 కలిపి నెలకు రూ.62 చొప్పున చెల్లించాలి. ప్రైమరీస్థాయి బాలికలకు కాస్మోటిక్ చార్జీల కింద రూ.55, హైస్కూల్ విద్యార్థినులకు నాప్‌కిన్ చార్జీలతో కలిపి రూ.75 ఇవ్వాలి. కానీ గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని హాస్టల్స్‌కు మాత్రం ఆ శాఖనే జీసీసీ ద్వారా మూడునెలలకు సరిపడా కిట్స్ అందిస్తోంది. మిగిలిన ఎస్సీ, బీసీ హాస్టల్ విద్యార్థులు మాత్రం సర్కారు ఇచ్చే డబ్బులతోనే సబ్బులు, నూనెలు కొనుగోలు చేసుకోవాల్సి ఉంది. ఇవి కూడా రెండు నెలలుగా ఇవ్వడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండున్నర కోట్ల వరకు కాస్మొటిక్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
2 లక్షలు అప్పుచేసిన..
జూన్ నుంచి ఇప్పటివరకు హాస్టల్‌కు సంబంధించిన ఒక్క బిల్లు కూడా రాలేదు. పిల్లలను పస్తులు పడుకోపెట్టలేక అప్పు చేసి మరీ అన్నం పెడుతున్నాం. ఇప్పటివరకు రూ. 2 లక్షలు మిత్తికి తీసుకొచ్చాను. అధికారులను అడిగితే బడ్జెట్ లేదంటున్నరు. ఇట్లా ఎన్నిరోజులు చేయాలో అర్థం కావడం లేదు.
‑ రవి, ఎస్సీ హాస్టల్ వార్డెన్, ఉట్నూర్
ఉద్దెర తెస్తున్న..
నేను ఈ ఏడాదే కొత్తగా చార్జ్ తీసుకున్నా. ప్రభుత్వం నుంచి మూడు నెలలుగా బిల్లులు మంజూరు కావట్లే. విద్యార్థులను పస్తులుంచలేక నా జేబులోంచి లక్షా80వేలు పెట్టుకున్న. ఇదిగాక సిలిండర్లకే లక్షకుపైగా అప్పు చేసిన. కూరగాయలన్నీ ఉద్దెర తెస్తున్న.
–పి జయవంతరావు , వార్డెన్, మార్లవాయి
అప్పులు తెచ్చి నడిపిస్తున్నం..
ఈ ఏడాది ఇప్పటివరకు డైట్ చార్జీలు రాలేదు. జూన్, జులై కాస్మొటిక్ చార్జీలూ ఇవ్వలె. అంతటా ఇదే పరిస్థితి. దీంతో అప్పులు తెచ్చి విద్యార్థులకు వండిపెడుతున్నాం.
– లక్ష్మణ్, వార్డెన్,
బీసీ వెల్ఫేర్ హాస్టల్ భీంగల్, నిజామాబాద్
ఇబ్బందిగా ఉంది
కాస్మొటిక్ చార్జీలు నెలనెలా ఇవ్వడం లేదు. హాస్టల్లో చేరి మూడు నెలలవుతున్నా పైసా రాలేదు. సబ్బులు ఉద్దెర తెచ్చుకొని మా అమ్మా, నాన్న వచ్చినప్పుడు అడిగి కడుతున్నం.
- సాయి కుమార్,
బీసీ హాస్టల్ స్టూడెంట్, పాపన్నపేట, మెదక్
మంజూరు కాలేదు
హాస్టల్ స్టూడెంట్స్‌కు కాస్మొటిక్ చార్జీల కింద నెలకు రూ.62 ఇవ్వాలి. కానీ ఇప్పటివరకు అవి రాలేదు. దీంతో పిల్లలు ఇబ్బంది పడుతు న్నారు. సర్కారు నుంచి చార్జీలు రాగానే స్టూడెంట్స్‌కు పంపిణీ చేస్తాం.
– మనోహర్, వార్డెన్, బీసీ హాస్టల్ కొత్తపల్లి, పాపన్న