సిరిసిల్ల సెస్ ఎన్నికలెప్పుడు?

సిరిసిల్ల సెస్ ఎన్నికలెప్పుడు?
  • ఎన్నికలు పక్కనపెట్టి నామినేటెడ్ కమిటీ
  • 2021 నుంచి పర్సన్​ ఇన్​చార్జీగా కలెక్టర్ 
  • ఓడిపోతామన్న భయంతోనే కమిటీ ఏర్పాటు చేశారంటూ ప్రతిపక్షాల ఫైర్ 
  • గతంలోనూ కోర్టు ఆదేశాలతో ఎలక్షన్స్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్​సహకారం సంఘం (సెస్​) పాలకవర్గం పదవీకాలం పూర్తయి ఏడాది దాటినా సర్కార్​ఎన్నికలు నిర్వహించడం లేదు. మొదటి ఆరు నెలల పాటు పర్సన్​ ఇన్​చార్జీగా కలెక్టర్​ను నియమించిన సర్కారు, తర్వాత మరో ఆరు నెలల పాటు ఎక్స్​టెండ్​ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇప్పుడైనా ఎలక్షన్లు నిర్వహిస్తారనుకుంటే 15 మందితో కూడిన నామినేటెడ్​ కమిటీని ఏర్పాటు చేస్తూ స్పెషల్​ జీఓ ఇష్యూ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే సెస్ ​పీఠం కోల్పోతామేమో అన్న భయంతోనే జీఓ ఇచ్చారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.  

2 లక్షల మంది ఓటర్లు  

సెస్​లో విద్యుత్​ మీటర్లు ఉన్నవాళ్లంతా ఓటర్ల కిందికే వస్తారు. సిరిసిల్లలోనే 66వేల కనెక్షన్లు ఉండగా, జిల్లా వ్యాప్తంగా మొత్తం రెండు లక్షల మంది వినియోగదారులు ఓటర్లుగా ఉన్నారు. ప్రతి ఐదేండ్లకోసారి వీరంతా ఓట్లేసి పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. బోయినిపల్లి మండలానికి చెందిన​ దోర్నాల లక్ష్మారెడ్డి చైర్మన్​గా ఉన్న సెస్​పాలకవర్గ పదవీకాలం గత ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. అయితే సర్కారు మరో ఏడాది పొడిగిస్తూ అప్పుడే ఉత్తర్వులిచ్చింది. ఏమైందో ఏమోకానీ, వారం రోజుల్లోనే పాలకవర్గాన్ని రద్దు చేసి కలెక్టర్​ను పర్సన్​ఇన్​చార్జీగా నియమించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ ​చేస్తూ డైరెక్టర్​ ఏనుగుల లక్ష్మి కోర్టుకు వెళ్లారు. ఆ కేసులో ఇంతవరకు ఎలాంటి తీర్పు రాలేదు. ఇంతలోనే మళ్లీ నామినేటెడ్​ కమిటీని నియమిస్తూ సర్కారు ఆర్డర్ ​ఇచ్చింది. చైర్మన్​గా గూడూరు ప్రవీణ్​కుమార్, మరో 15 మంది డైరెక్టర్లుగా ఏర్పడిన కమిటీ మంగళవారంపదవీ బాధ్యతలు చేపట్టింది.  

గత సర్కారుకు కోర్టులో ఎదురుదెబ్బ

సెస్​( ది కోపరేటివ్​ ఎలక్ట్రిక్​ సప్లై సొసైటీ) లో ఏదైనా పాలకవర్గం పదవీకాలం ముగిసిన తర్వాత ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రత్యేక సందర్భాల్లో కలెక్టర్ ​లేదా నామినేటెడ్​కమిటీని నియమించాలి. కానీ, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామన్న భయంతోనే సర్కారు నామినేటెడ్​ బాడీని నియమించిందన్న విమర్శలు వస్తున్నాయి. 2006 సంవత్సరంలో కాంగ్రెస్ ​పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే  పర్సన్ ఇన్​చార్జీలను నియమించగా ప్రభాకర్ రావు అనే వ్యక్తి కోర్టుకు వెళ్లాడు. సంస్థ వినియోగదారులకు సంబంధించినదని, ప్రతి వినియోగదారుడికి సంస్థలో ఓటు వేసే హక్కు ఉందని, ప్రభుత్వానికి నామినేట్ చేసే హక్కు లేదని హైకోర్టులో కేసు వేశారు. కేవలం ఆరు నెలలు మాత్రమే పర్సన్ ఇన్​చార్జి వ్యవస్థ చెల్లుతుందని, తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. అతడి వాదనతో ఏకీభవించిన కోర్టు పర్సన్ ఇన్​చార్జీలరె ను ఆరు నెలల్లోగా రద్దు చేసి ఎలక్షన్ పెట్టాలని ఆదేశించింది.  

నామినేటెడ్​ కమిటీ ఎందుకు? 

ప్రస్తుతం సిరిసిల్ల ఎమ్మెల్యేగా సీఎం తనయుడు, మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​ కొనసాగుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, స్థానిక సమ స్యలపై పోరాటం చేస్తూ ప్రతిపక్షాలు పట్టుబిగిస్తుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు త్వరలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తుందన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో సెస్​కు ఎన్నికలు పెట్టి ఓడిపోతే ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉండి మొదటికే మోసం వస్తుందని అధికార పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.  అందుకనే ఇక్కడ నామినేటెడ్​ కమిటీని ఏర్పాటు చేసినట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీలో అసంతృప్తుల సంఖ్య కూడా ఎక్కువైందని, అందరికి పదవులు ఇచ్చి మెప్పించే పరిస్థితి లేకపోవడంతో నామినేటెడ్ ​పదవులు ఇస్తున్నారంటున్నారు. దీనిద్వారా  వచ్చే ఎన్నికల్లో వారు రెబల్స్​గా మారకుండా, ఇతర పార్టీల్లోకి జంప్​ కాకుండా కాపాడుకునేందుకే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

అక్రమాలు బయటకు రాకూడదనే...

సెస్ లో జరుగుతున్న అవకతవకలు బయటకు రాకూడదనే ప్రభుత్వం ఆదరబాదరగా సెస్ నామినేటెడ్​కమిటీ ఏర్పాటు చేసింది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా దానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడం శోచనీయం, వెంటనే ఈ కమిటీని రద్దు చేసి ఎన్నికలు పెట్టాలి.  
- రాగుల రాజిరెడ్డి,  బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు, అంకిరెడ్డిపల్లె ఎంపీటీసీ
అధికార పార్టీ లీడర్లను 

సంతృప్తి పర్చడానికే

అధికార పార్టీలో ఉన్నవారికి పదవులు కట్టబెట్టి సంతృప్తి పర్చడానికే సిరిసిల్ల సెస్​కు నామినేటెడ్ కమిటీ వేశారు.   చట్టబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఓడిపోతామన్న భయంతోనూ కమిటీ వేసినట్టు అర్థమవుతున్నది. సెస్ డైరెక్టర్ గా నియమించిన మల్లారెడ్డి గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నడు. అలాంటి వారిని నియమించడం సిగ్గుచేటు.  
- ముద్దుల బుగ్గారెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి, ఎల్లారెడ్డిపేట

నామినేటెడ్​ కమిటీ కరెక్ట్​ కాదు 

2 లక్షల పైన వినియోగదారులున్న సహకార సంస్థకు ఎన్నికలు నిర్వహించాలి. ఎలక్షన్స్​నిర్వహిస్తే అవినీతిలో కూరుకుపోయిన టీఆర్ఎస్​కు ఓటమి తప్పదనే కమిటీని నియమించింది.  
-  సంగీతం శ్రీనివాస్​, కాంగ్రెస్​ పట్టణ అధ్యక్షుడు, సిరిసిల్ల