సర్కార్​ వాటా కట్టట్లె.. రైతుకు పరిహారం అందట్లె!

సర్కార్​ వాటా కట్టట్లె.. రైతుకు పరిహారం అందట్లె!
  •     రెండేండ్లుగా ఫసల్​ బీమా ప్రీమియం చెల్లించని రాష్ట్ర ప్రభుత్వం
  •     ఈ ఏడాదీ పంట బీమా నోటిఫికేషన్​ బంద్​
  •     ఇన్​పుట్​ సబ్సిడీకీ ఐదేళ్లుగా పైసా కట్టలె
  •     ఆగస్టు వర్షాలకు 26 జిల్లాల్లో తీవ్రంగా పంట నష్టం
  •     10 లక్షల ఎకరాల్లో నష్టం జరిగినా.. చూపించింది 3.3 లక్షల ఎకరాలే

హైదరాబాద్/మంచిర్యాల, వెలుగుఫసల్​ బీమా కాడిని రాష్ట్ర సర్కార్​ వదిలేసింది. పంట నష్టపోయిన రైతులకు పరిహారం రాకుండా చేసింది. ఫసల్​ బీమాతో ఫాయిదా లేదని రెండేళ్లుగా ప్రీమియంలో తన వంతు వాటా చెల్లించట్లేదు. దీంతో వరదలతో పంట పోయినా పరిహారం అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. విపత్తులొచ్చి పంట నష్టం జరిగితే రాష్ట్ర సర్కారు వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి రైతులకు నష్ట పరిహారం అందించాలి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఇన్​పుట్​ సబ్సిడీని చెల్లించాలి. రాష్ట్రం వచ్చాక ఓ ఏడాదిపాటు దాన్ని అమలు చేసినా. ఆ తర్వాత సర్కారు చేతులెత్తేసింది. ఇన్​పుట్​ సబ్సిడీకి ఐదేళ్లుగా పైసా కూడా ఇవ్వట్లేదు. ఈ ఏడాది ఆగస్టులో కురిసిన వర్షాలకు 10 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది. కోటీ 28 లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి, పత్తి, కంది, పెసర, ఇతర పంటలు దాదాపు 10 శాతం వరకు దెబ్బతిన్నాయి. పోయినేడాది యాసంగి సీజన్​లో పంట చేతికొచ్చే టైంకు వర్షాలు కురవడంతో లక్షలాది ఎకరాల్లో పంట కరాబైంది. దీంతో రైతులు నిండా మునిగిపోయారు. రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంతో వాళ్లకు పరిహారమూ అందలేదు.

ఈ ఏడాది నోటిఫికేషన్​ లేనే లేదు

పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులకు చేదోడుగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఫసల్​ బీమా పథకాన్ని తీసుకొచ్చింది. పథకం మొదలైన రెండేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాను చెల్లించింది. కానీ, ఆ తర్వాత వదిలేసింది. రెండేండ్లుగా వాటా ప్రీమియం కట్టకుండా రైతులకు తీవ్ర నష్టం చేస్తోంది. రూ.513.50 కోట్లు కట్టలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వమూ తన వాటాను ఆపింది. ఫలితంగా బీమా కంపెనీల నుంచి రైతులకు దక్కాల్సిన రూ.960 కోట్ల పరిహారం అందట్లేదు. ఇక ఈ ఏడాది జూన్​లో ఫసల్​ బీమా నోటిఫికేషన్​ ఇవ్వాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. బీమా కూడా రావట్లేదు కాబట్టి.. కనీసం ఇన్​పుట్​ సబ్సిడీనైనా ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు.

పంటలు ఆగమైనయ్​

ఆగస్టులో వారం పాటు ఏకధాటిగా కురిసిన వర్షాలకు 26 జిల్లాల్లో పంటలు మునిగిపోయాయి. వరి పొలాలు మొత్తం దెబ్బ తిన్నాయి. పూత, కాత దశలో ఉన్న పత్తి పంటకు తీవ్ర నష్టం జరిగింది. ఏపుగా పెరిగిన కంది చేలు పూర్తిగా నేలకొరిగాయి. చేతికందే దశలో పునాస పంటలు దెబ్బతిన్నాయి. అయితే, పై నుంచి ఒత్తిళ్లు ఉండడంతో జరిగిన నష్టంలో అధికారులు సగం కూడా నమోదు చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఏఈవోల ద్వారా సర్కారు పంట నష్టంపై నివేదిక తయారు చేయించింది. పది లక్షలకు పైగా  ఎకరాల్లో పంట నష్టపోయినా.. అందులో 3 లక్షల 30 వేల ఎకరాల్లో మాత్రమే నష్టం జరిగినట్టు నివేదికలో పేర్కొన్నారు. 3,200 ఊర్లలో లక్షా 80 వేల మంది రైతులు నష్టపోయారని తేల్చారు. సర్కారు లెక్క ప్రకారం లక్షా 40 వేల ఎకరాల్లో వరి, లక్షా 9 వేల ఎకరాల్లో పత్తి, 58 వేల ఎకరాల్లో పెసర, 10 వేల ఎకరాల్లో కంది పంటలకు నష్టం జరిగినట్టు నివేదికలో పేర్కొన్నారు. వేరు శనగ 6 వేల ఎకరాలు, మొక్కజొన్న 5 వేల ఎకరాల్లో దెబ్బతిన్నట్టు లెక్కలు చూపించారు. రాష్ట్రంలో ఎక్కువగా వరంగల్​ రూరల్​ జిల్లాలోనే పంట నష్టం జరిగినట్టు తేల్చారు.

మేడిగడ్డ ముంచింది 10 వేల ఎకరాలపైనే

మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్​వాటర్​ 10 వేల ఎకరాలకుపైగానే పంటలను ముంచింది. ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం, వారం రోజుల పాటు వర్షాలతో బ్యారేజ్​ బ్యాక్​ వాటర్​.. పొలాలను ముంచేసింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి, వేమనపల్లి మండలాలతో పాటు కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లాలోని దహెగాం, పెంచికల్​పేట్​, బెజ్జూర్​, చింతలమానెపల్లి మండలాల్లో పంటలు మునిగి రైతులు నష్టపోయారు. ఈ నెల 2 నుంచి బ్యాక్​ వాటర్​ వరద తగ్గడంతో అగ్రికల్చర్​ అధికారులు ప్రైమరీ సర్వే చేశారు. మంచిర్యాల జిల్లాలో 6,200 ఎకరాలు, ఆసిఫాబాద్​లో 3 వేల ఎకరాల మేర పత్తి, వరి దెబ్బతిన్నట్టు గుర్తించారు. ఈ నెల 4న ఆ రిపోర్ట్​ను కలెక్టర్లకు అందించారు. 6 నుంచి అగ్రికల్చర్​, రెవెన్యూ టీమ్​లతో జాయింట్​ సర్వే చేయాల్సి ఉన్నా.. మంగళవారమే ఆర్డర్స్​ అందినట్టు అధికారులు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లాలో దాదాపు 25 శాతం మంది దాకా కౌలు రైతులున్నారు. ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు కౌలు చెల్లించారు. పంటకు మరో రూ.10 వేలు పెట్టుబడి పెట్టారు. అయితే, భూమి యజమానుల నుంచి కౌలు పత్రాలు రాయించుకున్నవాళ్లకే కౌలు రైతులుగా గుర్తించే అవకాశముందంటున్నారు అధికారులు. కానీ, మెజారిటీ రైతులు ఎలాంటి పత్రాలు లేకుండా కేవలం నోటి మాటపైనే కౌలుకు తీసుకున్నారు. అలాంటి రైతులకు ఇప్పుడు పరిహారం వస్తుందా లేదా అన్న ఆందోళన ఉంది. తమకూ పరిహారం చెల్లించాలని వాళ్లు   కోరుతున్నారు.

జిల్లాల వారీగా పంట నష్టం వివరాలు

జిల్లా                                              నష్టం (ఎకరాల్లో)

వరంగల్​ రూరల్​                                99,500

జయశంకర్​భూపాలపల్లి                      35,200

మహబూబాబాద్​                               28,500

ఖమ్మం                                           24,000

భద్రాద్రి కొత్తగూడెం                              22,370

నారాయణపేట                                  21,200

కరీంనగర్​                                        19,000

వరంగల్​ అర్బన్​                                17,500

సూర్యాపేట                                       17,000

సంగారెడ్డి                                         11,350

ములుగు                                         7,650

వికారాబాద్​                                       6,100

కామారెడ్డి                                         5,600

సిద్దిపేట                                           1,964

మాకు అన్యాయం చేయొద్దు

నేను పదిహేను ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట వేసిన. ఎకరానికి పన్నెండు వేలు కౌలు కట్టిన. పెట్టుబడి మరో పదివేలు దాటింది. మొన్నటి వరదలకు పంట పూర్తిగా దెబ్బతిన్నది. పట్టాదారుల దగ్గర అగ్రిమెంట్​ రాయించుకోలేదు. మా దగ్గర కౌలు పత్రాలు లేవని నష్టపరిహారం విషయంలో అన్యాయం చెయ్యొద్దు.      ‑ పల్లె సత్తయ్య, కౌలురైతు, అలుగామ

నష్టపరిహారం ఇయ్యాలె

ఈ ఏడాది నేను పదెకరాలు కౌలుకు పట్టిన. ఇప్పటిదాకా ఎకరానికి రూ.30 వేల పెట్టుబడి పెట్టిన. పత్తి మంచిగ ఎదిగింది. నాల్రోజులైతే పూతొచ్చేది. కానీ ఏం లాభం.. కాళేశ్వరం ప్రాజెక్టుతోని మా పంటలన్నీ నీటిపాలైనయి. పత్తి చేన్లు మొత్తం నల్లవడ్డయి. ఆఫీసర్లు సర్వే చేసి మా కౌలుదారులకు సుత నష్టపరిహారం అందేవిధంగా చూడాలే.

‑ వీరయ్య, కౌలురైతు, అలుగామ