వలస కూలీల కోసం 2 వేల బస్సులు

వలస కూలీల కోసం 2 వేల బస్సులు

హైదరాబాద్‌‌, వెలుగురాష్ట్రం నుంచి సొంత ప్రాంతాలకు వెళ్తామన్న వలస కూలీలు, కార్మికులను తరలించడానికి సర్కారు రైళ్లు, బస్సులను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే, ఆర్టీసీలను అలర్ట్​ చేసింది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. ఏయే స్టేషన్లు, ప్రాంతాల నుంచి తరలిస్తారు, ఎంత మందిని ఎక్కడెక్కడికి పంపుతారన్న వివరాలేమీ అధికారులు బయటపెట్టడం లేదు. విషయం తెలిస్తే కార్మికులంతా ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో వచ్చే చాన్స్​ ఉందని గోప్యంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

రైళ్లు సిద్ధమైనయ్‌‌

రాష్ట్రం నుంచి ఇప్పటివరకు రెండు రైళ్లు జార్ఖండ్‌‌, బీహార్‌‌ కు వెళ్లాయి. కార్మికులను తరలించేందుకు రోజూ 40 ట్రైన్లు నడుపుతామని సీఎం కేసీఆర్‌‌  ప్రకటించారు. దీనిపై దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌‌ మాల్యాతో మాట్లాడారు. ఈ మేరకు ఆయన రైళ్లు, అధికారులు, సిబ్బందితో సంప్రదించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ రైలు, ఏ టైంలో, ఎక్కడి నుంచి నడపాలన్న వివరాలను కూడా రెండు, మూడు గంటల ముందు మాత్రమే అధికారులకు చెప్తున్నారు. హైదరాబాద్ లోని వివిధ స్టేషన్లతోపాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల తదితర ప్రాంతాల నుంచి కూడా రైళ్లు నడపనున్నారు. కరోనా నేపథ్యంలో కోచ్​లను పూర్తిగా శానిటైజ్‌‌ చేశారు. మధ్య బెర్త్‌‌లను తొలగించారు. ఒక్కో ట్రైన్‌‌లో 1,200 మందినే తీసుకెళ్లేలా ఏర్పాటు చేశారు.

2 వేలకుపైగా బస్సుల్లో..

కార్మికుల తరలింపు కోసం బస్సులను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కార్మికులు, కూలీలు ఉండే చోటి నుంచి రైల్వే స్టేషన్లకు ఆర్టీసీ బస్సుల్లోనే తరలిస్తున్నారు. తొలిరోజు 56, రెండోసారి 60 బస్సులు నడిపారు. ప్రస్తుతం ప్రతి డిపోలో 20 శాతం మేర బస్సులను రెడీ చేశారు. మొత్తంగా రెండు వేల బస్సులను సిద్ధంగా ఉంచుతున్నారు. వాటిని శానిటైజ్​ చేస్తున్నారు. ఒక్కో బస్సులో 20 నుంచి 24 మందినే ఎక్కించుకుంటున్నారు.

స్టేషన్ల దగ్గరికి వస్తనే ఉన్నరు

వలస కార్మికుల్ని చేరవేసేందుకు ఇప్పటికే రెండు రైళ్లు వెళ్లడంతో మరింత మంది రైల్వే స్టేషన్లకు వస్తున్నారు. హైదరాబాద్‌‌లోని సికింద్రాబాద్‌‌, కాచిగూడ, లింగంపల్లి, నాంపల్లి స్టేషన్లకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ప్రభుత్వం అనుమతించిన రైళ్లు మినహా ప్యాసింజర్  రైళ్లను తిప్పే అవకాశాల్లేవని, వెనక్కి వెళ్లిపోవాలని రైల్వే అధికారులు చెప్తున్నా.. ఎవరూ వినడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా స్టేషన్ల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడికి వస్తున్న వలస కూలీలను దగ్గరలోని షెల్టర్లకు తరలిస్తున్నారు.