ఇగ తహసీల్దార్లు తిరిగినట్టే.. గొర్లు కొన్నట్టే..!

ఇగ తహసీల్దార్లు తిరిగినట్టే.. గొర్లు కొన్నట్టే..!


మండల పర్చేజింగ్​ కమిటీలో తహసీల్దార్​, ఎంపీడీవో
రైతులతోపాటు ఆఫీసర్లూ పోవాల్నట
ఇప్పటికే పుట్టెడు పనులతో బిజీగా ఆఫీసర్లు
పక్కరాష్ట్రాల్లో వారాలకొద్దీ తిరిగినా దొరకని జీవాలు
గతంలో డీడీలు కట్టిన వాళ్లకే స్కీమ్​ వర్తింపు

ఖమ్మం, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్ల పంపిణీ స్కీమ్ అమలు కోసం ప్రభుత్వం కొత్త లింక్​ పెట్టింది. 2017లో రాష్ట్రంలో స్కీమ్​ మొదలుపెట్టిన సమయంలో గొర్రెల యూనిట్ల కొనుగోలు కోసం పర్చేజింగ్ కమిటీ చైర్మన్ గా జిల్లా కలెక్టర్​వ్యవహరించేవారు. లబ్ధిదారులను తీసుకొని మండల వెటర్నరీ డాక్టర్ కేటాయించిన రాష్ట్రానికి వెళ్లి యూనిట్లను కొనుగోలు చేసేవారు. ఒక్కోసారి కనీసం వారం నుంచి పది రోజులపాటు ఆయా రాష్ట్రాల్లో తిరిగి, యూనిట్లను కొనుగోలు చేసి తిరిగి వచ్చేవారు. ఇప్పుడు మాత్రం కొత్తగా మండల కమిటీల్లో తహసీల్దార్​, ఎంపీడీవోలను చేర్చారు. మండల పరిపాలన వ్యవహారాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే ఆఫీసర్లు రోజుల తరబడి ఇతర రాష్ట్రాల్లో పర్యటించి, పర్చేజ్​ చేయడం త్వరగా అయ్యే పనేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్కీమ్​అమల్లో మరింత పారదర్శకత కోసం ఇద్దరు ఆఫీసర్లను చేర్చినట్లు జిల్లా స్థాయి అధికారులు చెబుతున్నారు. అయితే గతంలో కొనుగోళ్ల సమయంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఒక్కోసారి వారం రోజుల పాటు ఇతర రాష్ట్రాల్లో పర్యటించాల్సి రావచ్చు. అలాంటపుడు పాలనా వ్యవహారాలకు ఇబ్బంది కలుగుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

నాలుగేండ్లకు.. రెండో విడత పంపిణీ

రాష్ట్రంలోని గొల్ల, కురుమల కుటుంబంలో 18 ఏండ్లు పైబడిన వాళ్లందరిని అర్హులుగా గుర్తించి, వారందరికీ 20 గొర్రెలు, ఒక పొట్టెలు ఇస్తామని 2017లో స్కీమ్​ప్రకటించారు. రాష్ట్రంలోని 7లక్షల 29,067 గొల్లకురుమ కుటుంబాలకు యూనిట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  2018 ఎలక్షన్ల ముందు వరకు  గొర్రెలు పంపిణీ చేశారు. ఆ తరువాత ఆపేశారు. సెకండ్​ఫేజ్​గొర్రెల పంపిణీ మొదలు పెట్టాలని గత ఏడాది జులైలో సీఎం కేసీఆర్​ఆదేశించారు. అయితే ఇంతవరకు దానికి సంబంధించి అతీగతి లేదు. ఫస్ట్​ఫేజ్​లో రాష్ట్రంలో 3లక్షల 80  వేల యూనిట్లు పంపిణీ చేశారు. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ఇంకా గొర్రెలు ఎప్పుడిస్తరా అని దాదాపు 3.5 లక్షల మంది గొల్లకురుమలు ఎదురు చూస్తున్నారు. స్కీమ్​ మొదలు పెట్టిన సమయంలో 21 జీవాలున్న యూనిట్ ఖరీదు రూ.1.25 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో ప్రభుత్వం వాటా రూ.93,750 కాగా, లబ్ధిదారుని వాటా రూ.31,250. తర్వాత యూనిట్ ధర రూ.1.75 లక్షలకు పెంచడంతో లబ్ధిదారుల వాటా రూ.42,500 చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్రంలో 28వేల మంది గొల్లకుర్మలు మూడేళ్ల క్రితం యూనిట్ కాస్ట్ ప్రకారం రూ.31,250 డీడీలు కట్టి యూనిట్ల కోసం ఎదురుచూస్తున్నారు. మళ్లీ ఆర్నెళ్ల క్రితం అదనంగా పెరిగిన యూనిట్ కాస్ట్ ప్రకారం రూ.11,250 చొప్పున చెల్లించారు. వాళ్లకు ప్రస్తుతం యూనిట్లను కొనుగోలు చేసి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఏపీ, కర్నాటకలో కొనుగోలు

మొదటి విడతలో భాగంగా డీడీలు కట్టి యూనిట్ల కోసం ఎదురుచూస్తున్న 28 వేల మందికి గొర్రెల కొనుగోలు కోసం ఏపీలోని ప్రకాశం, అనంతపురం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాలతో పాటు, కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్​, రాయచూర్​, సింధనూరు జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేటాయించారు. కొనుగోళ్లకు సంబంధించిన విధివిధానాలతో తాజాగా సర్క్యులర్​ ను ఆఫీసర్లు రిలీజ్​ చేశారు. ఆరుగురు చొప్పున లబ్ధిదారులు, ఎంపీడీవో, తహసీల్దారు, వెటర్నరీ డాక్టర్​మండల పర్చేజింగ్ కమిటీలో ఉంటారని సర్క్యులర్​లో పేర్కొన్నారు. హుజూరాబాద్, నాగార్జునసాగర్​ఉప ఎన్నికల సందర్భంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన సమయంలో రోజుల తరబడి ఆయా ప్రాంతాల్లో పర్చేజింగ్ కమిటీలు తిరగాల్సి వచ్చింది. ఇప్పుడు మండల స్థాయి అధికారులను కమిటీలో చేర్చడంతో, వాళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు జిల్లా కలెక్టర్​గ్రీన్​సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ నెలాఖరులోగా ఈ ప్రాసెస్​ కంప్లీట్ అవుతుందని ఆఫీసర్లు చెబుతుండగా, లబ్ధిదారులు, గొర్రెలు మేకల పెంపకందారుల సంఘాలు మాత్రం పలు సందేహాలను వ్యక్తంచేస్తున్నాయి. 

త్వరగా పంపిణీ చేయాలి

ప్రభుత్వం ఇచ్చే గొర్రెల యూనిట్ల కోసం లబ్ధిదారులు డీడీలు కట్టి ఇప్పటికే మూడేండ్లవుతోంది. అధికారులు, మండల కమిటీలు అంటూ మరింత ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా లబ్ధిదారులకు యూనిట్లను అందజేయాలి. తహసీల్దార్, ఎంపీడీవో ఇద్దరిలో ఎవరో ఒకరినే  యూనిట్ల పర్చేజింగ్ కు పంపిస్తే ఆలస్యం జరగకుండా ఉంటుంది. 
– మేకల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, ఖమ్మం జిల్లా గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం

నెల్లూరు పోవాల్సి ఉంది

జిల్లాలో గొర్రెల యూనిట్ల కోసం ఎక్కువగా కూసుమంచి, పెనుబల్లి, మధిర మండలాలకు చెందినవారు డీడీలు కట్టారు. ఖమ్మం రూరల్​ మండలంలో ముగ్గురు లబ్ధిదారులున్నారు. ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు యూనిట్ల పర్చేజింగ్ కోసం ఏపీలోని నెల్లూరు జిల్లా తడకు వెళ్లాల్సి ఉంది. తహసీల్దార్, ఎంపీడీవోలు వెళ్లొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్​ను కోరాం. త్వరలోనే అలాట్ చేసిన ప్రాంతానికి వెళ్లి యూనిట్లను పర్చేజ్​చేసి లబ్ధిదారులకు అందజేస్తాం. 
– వేణు మనోహర్, పశు సంవర్థక శాఖ జేడీ, ఖమ్మం జిల్లా