మూలన పడ్డ వాటిని తయారీ సంస్థలే రిపేర్లూ చేయాలె..

మూలన పడ్డ వాటిని తయారీ సంస్థలే రిపేర్లూ చేయాలె..

రిపేర్లతో మూలకు పడుతున్న డయాగ్నస్టిక్స్‌‌ యంత్రాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. యంత్రాల నిర్వహణకు ప్రస్తుతం అవలంబిస్తున్న విధానాన్ని పూర్తిగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌ ఆదేశించారు. తెలంగాణ వైద్య సేవలు, మౌళిక సదుపాయాల సంస్థ (టీఎస్‌‌ఎంఐడీసీ) ఎండీ చంద్రశేఖర్‌‌‌‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో బుధవారం దీనిపై చర్చించారు. ఎంఆర్‌‌‌‌ఐ, సీటీ స్కాన్‌‌, ఎక్స్‌‌రే మిషన్‌‌, రేడియాలజీ సహా మొత్తం 20 రకాల పెద్ద మిషన్ల నిర్వాహణ బాధ్యతను మాన్యుఫాక్చరింగ్‌‌ కంపెనీలకే అప్పగించాలని నిర్ణయించారు. మధ్య రకం యంత్రాల నిర్వాహణ బాధ్యతను టీఎస్‌‌ఎంఐడీసీ పరిధిలో పనిచేస్తున్న బయోమెడికల్ ఇంజనీర్లకు, లోకల్‌‌గా ఉండే బయోమెడికల్‌‌ ఎక్వీప్‌‌మెంట్ మెయింటెనెన్స్ సంస్థలకు అప్పగించనున్నట్టు సమాచారం.

ఫేబర్ సింధూరికి మంగళం

సర్కారు దవాఖాన్లలోని దాదాపు 35 వేల యంత్రాల నిర్వాహణ కోసం 2017లో ఫేబర్‌‌‌‌ సింధూరి అనే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు యంత్రాల విలువలో 5.7 శాతం మొత్తాన్ని ఏటా ప్రభుత్వం సదరు సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. ఒప్పందం ప్రకారం యంత్రం పని చేయడంలేదని సమాచారం ఇచ్చిన 7 రోజుల్లోగా రిపేర్‌‌‌‌ చేయాలి. కానీ ఆరేడు నెలలైనా రిపేర్లు చేయించడంలేదు. దీంతో ఆ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. అదీగాక ఎంఆర్‌‌‌‌ఐ, సీటీస్కాన్‌‌ వంటి పెద్ద మిషన్లను రిపేర్ చేసే సామర్థ్యం ఉన్న స్టాఫ్‌‌ ఆ సంస్థలో లేరు. నిజం చెప్పాలంటే ఆయా యంత్రాలను తయారు చేసిన కంపెనీలే బాగు చేయగలవు. మాన్యుఫాక్చరింగ్ కంపెనీలతో ఒప్పందం ఉన్న సంస్థలకే రిపేర్ల కాంట్రాక్ట్‌‌ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఫేబర్‌‌‌‌ సింధూరి సంస్థకు అలాంటి ఒప్పందం లేకున్నా, ఆరేండ్లపాటు యంత్రాల నిర్వాహణ బాధ్యతలు కట్టబెట్టారు. ఈ రెండేండ్లలో గాంధీ, ఉస్మానియా సహా రాష్ర్టవ్యాప్తంగా వేల సంఖ్యలో యంత్రాలు మూలకు పడ్డాయి. దీంతో రోగులు సొంత డబ్బులతో, ప్రైవేటు డయాగ్నస్టిక్స్‌‌ సెంటర్లలో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య మంత్రిగా ఈటల రాజేందర్ బాధ్యతలు చేపట్టాక, తాజాగా సింధూరి సంస్థతో కాంట్రాక్ట్ రద్దు చేయాలని
నిర్ణయించారు.