సర్కార్కు చేనేత, వ్యవసాయం రెండు కండ్లు.. నేతన్న, రైతన్నల త్యాగంతోనే మాకు అధికారం.. మంత్రి తుమ్మల

సర్కార్కు చేనేత, వ్యవసాయం రెండు కండ్లు.. నేతన్న, రైతన్నల త్యాగంతోనే మాకు అధికారం.. మంత్రి తుమ్మల

యాదాద్రి, వెలుగు :  రాష్ట్ర సర్కార్ కు చేనేత, వ్యవసాయం రెండు కండ్లు అని, ఆయా రంగాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నామని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. యాదాద్రి జిల్లా భూదాన్​పోచంపల్లిలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ‘చేనేత సదస్సు’ జరిగింది. ఇందులో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. రైతన్నలు, నేతన్నల త్యాగంతోనే కాంగ్రెస్​కు అధికారం వచ్చిందన్నారు.  

వారి సమస్యల పరిష్కారంలో రాజీపడమని తేల్చి చెప్పారు. చేనేత రంగానికి బడ్జెట్ లో రూ. 250 కోట్ల కేటాయింపులే ఉండగా..   రూ. వెయ్యి కోట్లు మంజూరు చేశామన్నారు. వ్యవసాయ రంగానికి రూ. 35 వేల కోట్లు ఖర్చు చేశామని, మరో రూ.10 వేల కోట్లు చేయాల్సి ఉందన్నారు. ఆచార్య వినోబాభావే భూదానోద్యమంతో పోచంపల్లి పుణ్యభూమిగాపేరొందిందని పేర్కొన్నారు. ఇండియన్​ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్​ టెక్నాలజీ(ఐఐహెచ్​టీ)కి కొండా లక్ష్మణ్​బాపూజీ పేరు పెట్టనున్నామని తెలిపారు. ఇనిస్టిట్యూట్ ను చేనేతకు కేంద్రమైన  పోచంపల్లిలోనే ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. 

నకిలీ చేనేత వస్త్రాలు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖల ద్వారా యూనిఫామ్స్ మెటీరియల్​కొనుగోలు చేయిస్తామన్నారు. చేనేత ఉత్పత్తులను మార్కెటింగ్​కోసం ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయిస్తామన్నారు.  పోచంపల్లి హెరిటేజ్ గ్రామంగా గుర్తింపు తెచ్చుకోవడం అభినందనీయమన్నారు.  కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్,  రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు మురళి, అధికారులు పాల్గొన్నారు.