సర్కార్ కొంటలేదని బియ్యం పట్టిచ్చి అమ్ముకుంటున్రు

సర్కార్ కొంటలేదని బియ్యం పట్టిచ్చి అమ్ముకుంటున్రు
  • సన్నాలపై ప్రభుత్వ తీరుతో విసిగిపోతున్న రైతులు
  • టౌన్ల నుంచి రైతులకు పెద్ద ఎత్తున ఆర్డర్లు
  • సన్నొడ్లకు మిల్లర్లు ఇస్తున్నది1,700 లోపే
  • పట్టించి అమ్ముకుంటే 2,200 దాకా గిట్టుబాటు
  • అటు రైతులకు, అటు వినియోగదారులకు లాభం

హైదరాబాద్/ యాదాద్రి/ జగిత్యాల, వెలుగు: సర్కారు సన్నొడ్లను కొంటలేదు. బోనస్ కూడా ఇస్తలేదు. మిల్లర్లేమో అడ్డికి పావుశేరు అడుగుతున్నరు. దళారులు దగా చేస్తున్నరు. దీంతో విసిగిపోతున్న రైతులు సర్కారుతో లాభం లేదని సొంత మార్కెట్​దిక్కు చూస్తున్రు. ముఖ్యంగా సిటీలు, టౌన్లు, మండల కేంద్రాల చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని రైతులంతా సొంతంగా బియ్యం పట్టించి అమ్ముకుంటున్నరు. పాలు, కూరగాయలు అమ్మేటప్పుడు కొందరు, తమ పరిచయస్తుల ద్వారా ఇంకొందరు ఒప్పందం చేసుకుంటున్నరు. గడిచిన పది, పదిహేను రోజులుగా స్టేట్​వైడ్​ఇదే ట్రెండ్​నడుస్తున్నది.

ఈ వానాకాలం సీజన్‌‌‌‌లో రైతులు రాష్ట్రంలో సుమారు 25 నుంచి 30 లక్షల ఎకరాల్లో బీపీటీ, తెలంగాణ మసూరి లాంటి సన్నాలు వేశారు. దొడ్డు రకాలతో పోలిస్తే చీడపీడలు ఎక్కువగా ఉండడంతో ఒక్కో ఎకరాపై  రూ.10వేలకు పైగా ఖర్చు పెట్టారు. కానీ దొడ్డు వడ్లను ఐకేపీ సెంటర్లు, వ్యవసాయ మార్కెట్లలో రూ.1,888 చొప్పున కొంటున్న సర్కారు, సన్నవడ్లను మాత్రం మిల్లర్లకు అప్పగించింది. సన్నవడ్లకు రూ.150 బోనస్​ఇస్తామని సీఎం కేసీఆర్​ఇచ్చిన హామీ కూడా అమలుకావట్లేదు. సన్నాలను రైసు మిల్లులకు కొంటపోతే అక్కడ తాలు, తప్ప పేరుతో రూ.1600 – రూ.1700కు మించి ఇస్తలేరు. కొందరు ఆ ధరకు అమ్ముకుంటున్నా మరికొందరు మాత్రం ఆ రేటు గిట్టుబాటు కాదని ఇండ్లలోనే దాచుకుంటున్నరు. ఇంకొందరు మరాడించి, తెలిసినవాళ్లకు అమ్ముకుంటున్నరు.

ఇద్దరికీ లాభమే..

ప్రస్తుతం బీపీటీ, తెలంగాణ మసూరి బియ్యం రేటు మార్కెట్‌‌‌‌లో రూ.4 వేల నుంచి రూ.4500 దాకా పలుకుతోంది. ఉద్యోగ, ఉపాధి రీత్యా సిటీలు, టౌన్లు, మండల కేంద్రాల్లో ఉంటున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇంత రేటు పెట్టి కొనడం కష్టమైతాంది. అలాగని సన్నబియ్యం తినకుండా ఉండలేని పరిస్థితి. దీంతో సొంత గ్రామాల్లోని రైతుల నుంచి క్వింటాల్‌‌‌‌కు రూ.3,200 నుంచి రూ.3,500 వరకు కొని ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌లో తెప్పించుకుంటున్నారు. రైతులు మోస్తరు మిల్లుల్లో తమ వడ్లను మరాడిస్తే క్వింటాల్‌‌‌‌కు 60 కిలోల బియ్యం వస్తున్నాయి. తవుడు తీసుకొని ఫ్రీగా బియ్యం చేసి ఇస్తుండడంతో రైతుకు క్వింటాల్ వడ్లకు రూ.2100 నుంచి 2,200 దాకా పడుతోంది. దీంతో ఇటు రైతుకు అటు వినియోగదారునికి అన్ని ఖర్చులు పోను క్వింటాల్‌‌‌‌కు రూ.500కు పైగా మిగులుతున్నాయి. ఇలాంటి రైస్​ ఒకే చేనువి కావడం వల్ల అన్నం టేస్ట్​ఉంటుందని, ఆరోగ్యానికీ మంచిదని ఎక్స్‌‌‌‌పర్ట్స్​ చెబుతున్నారు. కాకపోతే కొత్త బియ్యం కావడం వల్ల ఇంట్లో స్టోర్​ చేసుకొని ఓ రెండు నెలలు ఆగి వండుకుంటే అన్నం బాగా అవుతుందని సూచిస్తున్నారు.

సొంతంగా పట్టించి అమ్ముకుంటున్నం..

సర్కారు సన్నొడ్లు సాగుచేయమని చెప్పింది. కానీ కొనుగోలు చేస్తలేదు. ఇస్తామన్న బోనస్​ కూడా ఇస్తలేరు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలే. సర్కారు తీరుతో మిల్లర్లే బతుకుతున్నరు. ఆ రేటుకు అమ్ముకుంటే మాకేమీ మిగలది. అందుకే సొంతంగా బియ్యం పట్టించి అమ్ముకుంటున్నం. దీని వల్ల మాకు, వినియోగదారులకు ఇద్దరికీ లాభం ఉంటోంది.
–బూరుగు శేఖర్​రెడ్డి, రైతు (రేణికుంట), ఉప సర్పంచ్​

సన్నొడ్లుకొని పట్టిచ్చిన..

సన్నబియ్యం మార్కెట్లో ఎక్కువ రేటున్నయ్. అందుకే ఓ రైతు దగ్గర క్వింటాల్​కు రూ.2 వేల చొప్పున 6 క్వింటాళ్ల వడ్లు కొన్న కొన్నా. మిల్లులో తౌడు తీసుకుని ఫ్రీగా పట్టిచ్చారు. ఒకే చేను బియ్యం కాబట్టి అన్నం కూడా మంచిగ అవుతది. కావాల్సిన వాళ్లు ఇలా చేసుకుంటే.. రైతుకు, కొనేవాళ్లకు ఇద్దరికీ లాభమే. మధ్యల దళారులను బాగుజేసుడెందుకు?
– నర్సయ్య, జగిత్యాల

సన్నబియ్యం అమ్ముతా సోషల్​మీడియాలో రైతు పోస్టు

ఈ రైతు పేరు మడపతి సత్యనారాయణ. జగిత్యాల జిల్లా బాలపెల్లి గ్రామం. ప్రతిసారీ 20 గుంటల పొలంలో తిండి కోసం సన్నవడ్లు వేస్తుంటాడు. కానీ ఈ సారి సర్కారు చెప్పిందని ఎకరం పది గుంటల్లో సన్నాలు వేశాడు. మార్కెట్లో  సన్నాల కంటే  దొడ్డు వడ్ల రేటే ఎక్కువుంది. ఆ రేటుకు అమ్మితే అమ్ముతే నష్టం వస్తుందని భావించిన సత్యనారాయణ.. సన్న బియ్యం అమ్ముతానంటూ సోషల్​ మీడియాలో పోస్టు పెట్టాడు.

హైదరాబాద్‌‌లో జాబ్​చేస్తూ ఫ్యామిలీతో ఉంటున్న  సురేశ్, యాదాద్రి జిల్లాలోని తన తండ్రికి ఫోన్​ చేసిండు. ​‘ఇక్కడ బీపీటీ బియ్యం బాగా పిరమున్నయ్​.. నాకు, నా ముగ్గురు దోస్తులకు 20‌‌‌‌ క్వింటాళ్ల పంట బియ్యం కావాలె..’ అని అడిగిండు. వాళ్ల నాన్న ఊళ్లోని ఓ రైతుతో క్వింటాల్​ బియ్యం రూ.3,500కు మాట్లాడుకున్నడు. రైతే గిర్నీ పట్టించి, ట్రాన్స్‌‌పోర్ట్‌‌లో వేస్తే హైదరాబాద్‌‌లో దింపుకున్నరు. మార్కెట్ రేటుతో పోలిస్తే  రైతుకు క్వింటాల్‌‌కు రూ.500కు పైగా లాభం రాగా, సురేశ్, అతని దోస్తులకు అన్ని ఖర్చులు పోను రూ.10వేలకు పైగా మిగిలినయ్.