లిక్కర్​ షాపు అప్లికేషన్ ఫీజు డబుల్.?

లిక్కర్​ షాపు అప్లికేషన్ ఫీజు డబుల్.?
  • లక్ష నుంచి రెండు లక్షలకు పెంచే యోచనలో సర్కార్‌‌
  • ఏపీలో మద్య నియంత్రణతో తెలంగాణ వైపు డీలర్ల చూపు
  • సరిహద్దు జిల్లాల్లో లైసెన్సులు దక్కించుకునేందుకు క్యూ
  • అప్లికేషన్‌‌’ఆదాయం టార్గెట్టే రూ.500 కోట్లు
  • ఈసారి ఆన్‌‌లైన్‌‌లోనే దరఖాస్తుల స్వీకరణ..!

రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం తీసుకునే లైసెన్స్‌‌ దరఖాస్తు ఫీజు పెరగనుంది. అప్లికేషన్‌‌ ఫీజు భారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2017లో అప్లికేషన్‌‌ ఫీజు లక్ష ఉండగా, ఇప్పుడు దాన్ని రెండు లక్షలకు పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఏపీలో మద్య నియంత్రణతో అక్కడి డీలర్లు తెలంగాణకు వచ్చే అవకాశం ఉండటంతో మరింత ఆదాయం పొందాలని సర్కార్‌‌ భావిస్తోంది.

రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్‌‌ పాలసీ కోసం సర్కార్‌‌ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఉన్నతాధికారులు పలు దఫాలు సమావేశమై దీనిపై చర్చించారు. 2017 అక్టోబర్‌‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన రెండేళ్ల లైసెన్సుల గడువు ఈ ఏడాది సెప్టెంబర్‌‌ 31తో ముగియనుంది. అక్టోబర్‌‌ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో  ఎక్సైజ్​ పాలసీలో మార్పుచేర్పులపై అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,216 మద్యం దుకాణాలుండగా, వీటి ద్వారా రూ.1,360 కోట్ల లైసెన్సు రుసుము వసూలైంది. అయితే కొత్త పాలసీలో పెద్దగా మార్పులు ఉండబోవని ఓ ఎక్సైజ్‌‌‌‌ అధికారి తెలిపారు. దుకాణాల సంఖ్య, పర్మిట్లు ఎత్తేసే ఆలోచన లేదని,  2003 తర్వాత దుకాణాల సంఖ్య పెంచలేదని ఓ అధికారి చెప్పారు.

టార్గెట్‌‌‌‌ 500 కోట్లు..

గత ఎక్సైజ్‌‌‌‌ సంవత్సరంలో నాన్‌‌‌‌ రిఫండబుల్‌‌‌‌ అప్లికేషన్‌‌‌‌ ఫీజు 50 వేల నుంచి లక్షకు పెంచారు. అప్లికేషన్ల ద్వారానే సుమారు రూ.411 కోట్ల ఆదాయం వచ్చింది. 2015–17లో వంద కోట్లే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈసారి అప్లికేషన్​ ఫీజును లక్ష నుంచి రెండు లక్షలకు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. అప్లికేషన్​ ఫీజు ద్వారానే ఈసారి రూ.500 నుంచి రూ.600 కోట్లు సమకూర్చుకునేందుకు సర్కార్‌‌‌‌ టార్గెట్‌‌‌‌గా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే ఎక్సైజ్​ దరఖాస్తులు స్వీకరించాలని అలోచిస్తున్నట్లు సమాచారం. 2017లోనే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లికేషన్లు స్వీకరించి అక్రమాలను అడ్డుకోవాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో మాన్యువల్‌‌‌‌గానే స్వీకరించారు.

ఏపీ నుంచి రానుండటంతోనే..

ఏపీలో ఐదేళ్లలో దశలవారీగా పూర్తిగా మద్య నియంత్రణ చేస్తామని సీఎం జగన్​మోహన్‌‌‌‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల 500 వరకు మద్యం దుకాణాలను తగ్గించారు. బెల్టు షాపులు తొలగించారు. ఏపీ ప్రభుత్వమే స్వయంగా మద్యం దుకాణాలను నడిపిస్తోంది. దీంతో ఏపీలోని డీలర్లు, దుకాణ యజమానులు తెలంగాణపై ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌తోపాటు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లాల్లో లైసెన్స్‌‌‌‌లు దక్కించుకోవాలని చూస్తున్నారు. దీంతో లైసెన్స్‌‌‌‌ల కోసం పోటీ పెరిగింది.