
- స్పెషల్ డ్రైవ్ చేపట్టే యోచనలో ప్రభుత్వం
- 30 లక్షల మందికిపైగా లబ్ధి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా జారీ చేస్తున్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు సర్కార్ సిద్ధమైంది. ప్రతి స్కీమ్‌తో పాటు ఆరోగ్య శ్రీ కింద చికిత్సకు కూడా రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో కొత్తగా కార్డులు పొందుతున్నోళ్లకు ప్రభుత్వ పథకాలు అందేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నది. కొత్తగా 7 లక్షల రేషన్ కార్డులు అందజేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
వీటి కింద దాదాపు 30 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉంటారని అంటున్నారు. ఇప్పుడు వీళ్లందరికీ ప్రభుత్వ గ్యారంటీలు, ఆరోగ్యశ్రీ అందేలా రేషన్ కార్డులతో అనుసంధానించనున్నారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా రేషన్ కార్డులు పొందినోళ్లు ఆరోగ్యశ్రీ పథకం ప్రయోజనాలను పొందడంలో ఎలాంటి జాప్యం లేకుండా చూసేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఇప్పటికే స్పెషల్ సెల్ ఏర్పాటు చేసింది. ఈ సెల్ కొత్త లబ్ధిదారుల వివరాలను క్రోడీకరించి, వారికి ఆరోగ్యశ్రీ సేవలను సత్వరమే అందేలా చర్యలు
తీసుకుంటున్నది.
అధికారులే ఇంటికొస్తరు..
ఇప్పటికే అమలు చేస్తున్న వివిధ గ్యారంటీలను కొత్త రేషన్ కార్డుదారులకు కూడా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మీ, చేయూత తదితర పథకాల కోసం వీళ్ల నుంచి దరఖాస్తులు తీసుకోనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ డ్రైవ్‌లో భాగంగా అధికారులే నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి.. వాళ్ల వివరాలను నమోదు చేసుకుని, అవసరమైన అనుసంధాన ప్రక్రియ పూర్తి చేస్తారు.
దీనివల్ల లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే సేవలు పొందనున్నారు. కాగా, రాష్ట్రంలో ఇంతకుముందు 90.10 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉండగా.. 2.84 కోట్ల మంది వివిధ స్కీమ్‌ల కింద లబ్ధిదారులుగా ఉన్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కొత్తగా 3.50 లక్షలకు పైగా రేషన్ కార్డులు మంజూరు చేసింది. మొత్తంగా 7 లక్షల కుటుంబాలకు కొత్తగా కార్డులు ఇవ్వనుంది. ఈ కార్డుల కింద 30 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉంటారని, వాళ్లందరినీ ప్రభుత్వ పథకాల పరిధిలోకి తీసుకురావాలని సర్కార్ భావిస్తున్నది. దీంతో రేషన్‌కార్డులు లేని కారణంగా ఇంతకాలం ప్రభుత్వ పథకాలు అందనివాళ్లకు ప్రయోజనం చేకూరనుంది.