తప్పుడు రిజిస్ట్రేషన్లకు సర్కారే జిమ్మేదారీ

తప్పుడు రిజిస్ట్రేషన్లకు సర్కారే జిమ్మేదారీ
  • రాష్ట్రాలకు పంపిన నీతి ఆయోగ్.. 
    అమలులోకి వస్తే ఓనర్​కు భరోసా
  • పరిహారం చెల్లించేందుకు గ్యారెంటీ ఫండ్​
  • సమగ్ర భూసర్వే ద్వారా కన్​క్లూజివ్​​ టైటిల్స్​
  • 3 రిజిస్టర్లలోనే సమస్త భూముల వివరాలు 
  • అన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఒకే చోట
  • రాష్ట్ర చట్టం కంటే ఇది బెటరంటున్న ఎక్స్​పర్ట్స్​

హైదరాబాద్, వెలుగు: ‘‘స్టాంప్​ డ్యూటీ కట్టించుకుని ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయడం వరకే మా పని. తప్పుడు రిజిస్ట్రేషన్లు, డబుల్​ రిజిస్ట్రేషన్లు, ఓనర్ షిప్​ వివాదాలకు, గెట్ల పంచాయితీలకు మాత్రం మా బాధ్యత లేదు. వివాదాలుంటే సివిల్ కోర్టుల్లో తేల్చుకోండి’’.. ఇది ప్రాపర్టీ డిస్ప్యూట్స్​ విషయంలో ఇన్నాళ్లూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వాదన. ఒకదానికొకటి పొంతన లేకుండా ఆస్తుల రికార్డులను నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వం.. వాటి వల్ల తలెత్తే వివాదాలను కోర్టులకు వదిలేసి తప్పించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నీతి ఆయోగ్ ఇటీవల​రూపొందించిన ‘కన్​క్లూజివ్​ ల్యాండ్​ టైటిలింగ్ యాక్ట్’​  డ్రాఫ్ట్​ను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తే భవిష్యత్​లో ఇలా తప్పించుకోవడం కుదరదు.

ఏదైనా ప్లాట్, ఫ్లాట్, బిల్డింగ్​ లేదా ఇతర ప్రాపర్టీ రిజిస్ట్రేషన్​ కు సంబంధించి తాను జారీ చేసిన కన్​క్లూజివ్​ టైటిల్​ తప్పని తేలితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నష్టపోయిన బాధితులకు చట్ట ప్రకారం ప్రభుత్వమే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్​ విషయంలో సర్కార్​పై బాధ్యతను పెంచుతూనే.. ప్రాపర్టీ ఓనర్​కు భరోసా కల్పించే ఈ ‘కన్​క్లూజివ్​ ల్యాండ్​ టైటిలింగ్ యాక్ట్’​  డ్రాఫ్ట్​ను నీతి ఆయోగ్​.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపింది. దీన్ని 2024లోపు అసెంబ్లీలో ఆమోదించి, అమలు చేయాలని నీతి ఆయోగ్​ గడువు విధించింది.

ఆర్వోఆర్​, సేల్​ డీడ్స్ ఫైనల్ కాదు

ప్రస్తుతం రికార్డ్​ ఆఫ్​ రైట్స్​(ఆర్వోఆర్​), డీడ్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ విధానం రాష్ట్రంలో కొనసాగుతోంది. ఓనర్​ షిప్​ విషయంలో ఆర్వోఆర్​,  డీడ్​ అనేవి ఫైనల్ కాదు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే కోర్టులకు వెళ్లొచ్చు. కోర్టు ఎవరికి అనుకూలంగా డిక్రీ ఇస్తే వారికే ఆ ప్రాపర్టీ చెందుతుంది. కోర్టులో ఓడిపోయిన అవతలి వ్యక్తి ఆ ప్రాపర్టీని అసలు ఓనర్​ ఎవరో తెలియక.. వేరొకరి వద్ద కొనుగోలు చేసి ఉంటే ఆర్థికంగా నష్టపోవాల్సిందే. ప్రభుత్వం నష్టానికి బాధ్యత వహించదు.

కన్​క్లూజివ్​ టైటిల్స్​ జారీ ఇలా..

భూరికార్డుల ప్రక్షాళనను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పట్టాదారు పాస్​ బుక్స్​ జారీ చేసిన విషయం తెలిసిందే. పాత రికార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగా ఈ పాస్​ బుక్స్​ జారీ చేశారు. రికార్డుల్లో ఉన్న భూమి, ఫీల్డ్​లో భూమి ఒకే విస్తీర్ణంలో ఉందా అనే విషయాన్ని సరి చూడలేదు. దీంతో కొన్ని సర్వే నంబర్లలో ఉన్న భూమికి మించి పాస్​బుక్స్​ ను జారీ చేశారు. ఇలాంటి సమస్యలకు ‘కన్​క్లూజివ్​ టైటిల్’​ చెక్​ పెట్టనుంది. ప్రస్తుతం ఉన్న ఆర్వోఆర్​, డీడ్​ డాక్యుమెంట్ల స్థానంలో కన్​క్లూజివ్​ టైటిల్స్​ జారీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందస్తుగా సమగ్ర భూసర్వే చేయాలి. ఇందులో భాగంగా ప్రతి ప్రాపర్టీకి సంబంధించిన కచ్చితమైన విస్తీర్ణాన్ని, కొలతలను నిర్ధారించడంతోపాటు బౌండరీస్​కు కో–ఆర్డినేట్ ఇవ్వాలి. ఆ తర్వాత పాత రికార్డుల్లోని వివరాలను వీటితో సరిచూసుకుని ఆ ప్రాపర్టీ యజమానికి కన్​క్లూజివ్​ టైటిల్​ ఇవ్వాలి. ఓనర్ షిప్​కు సంబంధించి ఇదే ఫైనల్ డాక్యుమెంట్. రికార్డుల్లోకి ఎక్కిన వివరాలను రెండేండ్ల తర్వాత మార్చేందుకు వీలుండదు.

మూడు రిజిస్టర్లలో సమస్త భూముల వివరాలు

భూములకు సంబంధించి ప్రస్తుతం అనేక రికార్డులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. నీతి ఆయోగ్ రూపొందించిన చట్టం ప్రకారం.. టైటిల్స్ జాబితాతో ఒకటి​, భూవివాదాల నమోదుకు మరొకటి, భూములకు సంబంధించిన లావాదేవీలు, ఒప్పందాలకు ఇంకొకటి ఇలా మూడు రిజిస్టర్లను నిర్వహించాల్సి ఉంటుంది.

టైటిల్ గ్యారెంటీ ఫండ్

కన్​క్లూజివ్​ టైటిల్స్​ చట్టం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం టైటిల్​ గ్యారెంటీ ఫండ్ ను ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్ డ్రాఫ్ట్​లో పేర్కొంది. ప్రభుత్వం జారీ చేసిన టైటిల్ తప్పని తేలితే నష్టపోయిన బాధితుడికి మార్కెట్​ ధర ప్రకారం ప్రభుత్వమే ఈ ఫండ్​లో నుంచి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

వివాదాల పరిష్కారానికి మూడంచెల ట్రిబ్యునళ్లు

కన్​క్లూజివ్​ టైటిల్స్​ జారీ చేసే క్రమంలో ఏవైనా వివాదాలు తలెత్తినా, కన్​క్లూజివ్ టైటిల్స్​ జారీ చేశాక ఏవైనా అభ్యంతరాలున్నా పరిష్కరించేందుకు మూడంచెల ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్ పేర్కొంది. మండల స్థాయిలో టైటిల్​ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక ట్రిబ్యునల్, జిల్లా స్థాయిలో అప్పీలేట్​ ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో హైకోర్టులో ప్రత్యేక బెంచ్​ను ఏర్పాటు చేయాలని సూచించింది. మండల స్థాయిలో పరిష్కారం దొరక్కపోతే అప్పీల్​ ట్రిబ్యునల్​కు, అక్కడ కూడా పరిష్కారం లభించకపోతే హైకోర్టులోని ప్రత్యేక బెంచ్​కు అప్పీల్​ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

అన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఒకే చోట

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ యాక్ట్​ ప్రకారం అగ్రికల్చర్​ భూములు ఒక చోట, నాన్​ అగ్రికల్చర్​ ఆస్తుల రిజిస్ట్రేషన్​మరో చోట రిజిస్ట్రేషన్​ చేయనున్నారు. కానీ అన్ని ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఒకే చోట నిర్వహించేలా చూడాలని నీతి ఆయోగ్ రాష్ట్రాలకు సూచించింది. మండలానికో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ను నియమించాలని డ్రాఫ్ట్ లో పేర్కొంది.

ముందు వరుసలో మహారాష్ట్ర, ఏపీ 

సరికొత్త రెవెన్యూ యాక్ట్​ ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచామని, టైటిల్ గ్యారెంటీ దిశగా ప్రయాణం చేస్తున్నామని సీఎం కేసీఆర్​ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ విషయంలో తెలంగాణ కంటే మహారాష్ట్ర, ఏపీ ప్రభుత్వాలు చాలా ముందువరుసలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకంటే ముందే ఏడాది కిందట్నే అసెంబ్లీలో టైటిల్‌ గ్యారెంటీ చట్టాన్ని ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. టైటిల్ గ్యారెంటీ చట్టంలో ముఖ్యమైన భూ సమగ్ర సర్వే పైలట్​ ప్రాజెక్ట్​ను కృష్ణా జిల్లాలో ప్రారంభించింది. నెలలో సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టబోతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ల్యాండ్  టైటిలింగ్  యాక్ట్​ డ్రాఫ్ట్ ను సిద్ధం చేసింది.

కేంద్ర చట్టమే బెటర్

రాష్ట్రంలో మూడు నెలల క్రితం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్ కేవలం రిజిస్ట్రేషన్, మ్యుటేషన్​ ను ఒకే రోజులో పూర్తి చేయడం మినహా భూ వివాదాలకు పరిష్కారం చూపలేదు. రెవెన్యూ కోర్టుల్లో ఉన్న 16 వేల కేసుల పరిష్కారానికి తాత్కాలిక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తామని మాత్రమే చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇవి కాకుండా రెవెన్యూ కోర్టులకు ఎక్కని వివాదాలు, పార్ట్–బి  భూములకు ఎలాంటి పరిష్కారం చూపలేదు. అలాగే తాము ఇచ్చే రిజిస్ట్రేషన్​ డీడ్ ​తప్పని తేలితే  తన బాధ్యత అని చట్టంలో ప్రభుత్వం పేర్కొనలేదు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా జారీ చేసిన పట్టాదారు పాస్​ పుస్తకాల్లో అనేక తప్పులు దొర్లాయి. ఇలాంటి తప్పులన్నింటికీ నీతి ఆయోగ్​ రూపొందించిన ‘కన్​క్లూజివ్​ టైటిల్’ యాక్ట్​​ ద్వారా పరిష్కారం లభిస్తుందని, రాష్ట్ర చట్టం కన్నా ఇదే బెటర్​ అని ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు.

‘భూ భారతి’తోనే రోడ్‌‌‌‌ మ్యాప్‌‌‌‌

కన్​క్లూజివ్‌‌‌‌ టైటిల్‌‌‌‌ను తీసుకొచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం 2010లో ల్యాండ్‌‌‌‌ టైటిలింగ్‌‌‌‌ డ్రాఫ్ట్‌‌‌‌ను రూపొందించింది. ‘ది ల్యాండ్‌‌‌‌ టైటిలింగ్‌‌‌‌ బిల్లు–2011’ పేరిట ఫైనల్‌‌‌‌ డ్రాఫ్ట్‌‌‌‌ను కూడా సిద్ధం చేసింది. కానీ ఈ బిల్లు చట్టం కాలేదు. దానికి కొనసాగింపుగా 2013లో ల్యాండ్‌‌‌‌ టైటిలింగ్‌‌‌‌కు రోడ్‌‌‌‌ మ్యాప్‌‌‌‌ సిద్ధం చేసేందుకు నాటి ఉమ్మడి ఏపీ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినోద్‌‌‌‌ కె.అగర్వాల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌గా యూపీఏ ప్రభుత్వం కమిటీని నియమించింది. నిజామాబాద్‌‌‌‌లో అమలవుతున్న ‘భూ భారతి’ ప్రాజెక్టు నమూనాను దేశమంతా అమలు చేయొచ్చని సూచించింది.  ఇప్పుడు వినోద్​కుమార్​ ఆధ్వర్యంలోనే ‘కన్​క్లూజివ్​ ల్యాండ్​ టైటిలింగ్ యాక్ట్’​ డ్రాఫ్ట్​ సిద్ధమైంది.